ఒకవైపు పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిలో చేరిపోతారని భారాస దళాలు చాలా కాలంగా ఆరోపసిస్తూ వస్తున్నాయి. రేవంత్ ఆరెస్సెస్ కు చెంది వాడే అని.. చివరకు ఆయన భాజపాలోనే తేలుతారని వారు వాదిస్తున్నారు. వారి ఆరోపణల్ని రేవంత్ రెడ్డి నేరుగా ఖండించకుండా, అలాగని ఊరుకోకుండా, ఆ ప్రచారం తప్పు అని ప్రజలే భావించేలాగా.. మోడీ, అమిత్ షా ద్వయం మీద తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ తన ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఆయన తాజాగా చేస్తున్న ఒక పని.. కాంగ్రెస్ తో రేవంత్ వేరుకుంపటి పెట్టుకుంటున్నారనే ప్రచారాలు సాగడానికి అవకాశం ఇచ్చేలాగా ఉంది. న్యాయ్ పత్ర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జాతీయ స్థాయిలో తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయగా.. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ తరఫున.. తెలంగాణలోని ఎంపీ అభ్యర్థుల విజయం కోసం సెపరేటుగా మరొక మేనిఫెస్టోను కూడా విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు.
రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేయడం అనేది.. కేంద్రంలోని తమ పార్టీతో విభేదిస్తున్నట్టుగానే ఉన్నదని ఆపార్టీ నాయకులే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ మేనిఫెస్టోలో రాష్ట్ర పునర్విభజన నాటి హామీలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ లతో పాటు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా, కనీసం ఒక్క ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐడీ వర్సిటీలు, సమ్మక్క సారక్క మేడారం జాతరకు జాతీయహోదా, కృష్ణా జలాల్లో సరైన వాటా వంటివి ఉన్నాయి.
అయితే ఈ డిమాండ్లు అన్నీ అంత తొందరగా తేలేవి కాదు. రాహుల్ ప్రధాని అయితే, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. అనే మాటలతో తెలంగాణ ప్రజల్ని ఊరించడానికి రేవంత్ ఈ మేనిఫెస్టో తేవచ్చు గానీ.. ఇది అమలులోకి వస్తుందని నమ్మడం కష్టం.
కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా సరే.. తమకు ఎంపీలను ఇస్తే.. ఈ హామీల సాధన కోసం పోరాడుతామని రేవంత్ ప్రకటిస్తే కొంత ఎడ్వాంటేజీ ఉండొచ్చు. కానీ.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అలాంటి ప్రకటన చేయడం అనేది అసాధ్యం. కాకపోతే ప్రజల్ని రాహుల్ విడుదల చేసిన న్యాయ పత్ర్ కు భిన్నంగా కొంత మేర ఊరించడానికి తెలంగాణ కాంగ్రెస్ సెపరేటు మేనిఫెస్టో ఉపయోగపడవచ్చు. తమాషా ఏంటంటే.. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని విధంగా రేవంత్ ఇలాంటి సొంత కుంపటి.. అదేఅదే, సొంత మేనిఫెస్టో తెస్తున్నారు.