జనసేన సేఫ్: పవన్ గ్లాసు కూటమి గొంతు కోస్తోంది!

పవన్ కల్యాణ్ కు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమీ లేదు. అలాగని ఆయన సారథ్యం వహిస్తున్న జనసేన పార్టీకి వచ్చిన నష్టం కూడా ఎంతమాత్రమూ లేదు. పవన్ ఫాలోయింగ్ తో ఆ పార్టీకి పడదగిన ఓట్లు…

పవన్ కల్యాణ్ కు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమీ లేదు. అలాగని ఆయన సారథ్యం వహిస్తున్న జనసేన పార్టీకి వచ్చిన నష్టం కూడా ఎంతమాత్రమూ లేదు. పవన్ ఫాలోయింగ్ తో ఆ పార్టీకి పడదగిన ఓట్లు ఎన్ని ఉన్నాయో.. అవన్నీ వాళ్లకు ఖచ్చితంగా పడతాయి. వాళ్లు కోల్పోయేది ఏమీ లేదు. ఎటొచ్చీ నష్టపోయేది మొత్తం కూటమిలోని ఇతర పార్టీలే.

పవన్ కల్యాణ్ గాజు గ్లాసు పగిలి ముక్కలై ఇతరుల చేతుల్లో కూడా ఆయుధంగా మారిన తర్వాత.. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కూటమి పార్టీల గొంతు తెగే ప్రమాదం కనిపిస్తోంది.

ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చినట్టు? ఇదంతా పవన్ కల్యాణ్ చేతకానితనం వల్ల ఏర్పడిన దుస్థితి కదా? అని కూటమి పార్టీలు గుర్రు మంటున్నాయి. గత ఎన్నికల్లో తానేదో పెద్ద ఒంటరిగానే పోటీచేసి సీఎం అయిపోయేంతటి మహానాయకుడిలాగా పవన్ కల్యాణ్ జనసేనను బరిలోకి దింపారు. 6 శాతం ఓట్లు వచ్చాయి. ఒక ఎమ్మెల్యే కూడా గెలిచారు. రెండుస్థానాల్లో పోటీచేసిన పవన్ కల్యాణ్ స్వయంగా ఒక స్థానంలో గెలిచి ఉన్నా సరే..ఇవాళ కూటమికి ఈ ఇబ్బందులు లేవు.

ఇద్దరు ఎమ్మెల్యేలు, 6 శాతం ఓట్లు గెలిచిన పార్టీగా గాజు గ్లాసు గుర్తు వారికి పర్మినెంట్ అయిపోయి ఉండేది. ఆనాడు తన గెలుపు చేతకాకపోవడం వల్ల.. ఇప్పుడు ఇతర నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ గా మారి, ఇండిపెండెంట్ల వశమై తెలుగుదేశానికి, భాజపాకు ప్రమాదకరంగా తయారైంది.

హైకోర్టులో జరుగుతున్న దావాలో తెలుగుదేశం కూడా చేరి, ఆ గుర్తు ఇతరులకు ఇవ్వడం వల్ల తెలుగుదేశం, భాజపాకు నష్టం అని వాదించింది. కానీ వారి వాదనలు వర్కవుట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.

బుధవారం సాయంత్రానికే బ్యాలెట్ బ్యాలెట్ల ముద్రణ ప్రారంభం అయిపోయిందని ఈసీ న్యాయవాది కోర్టుకు చెప్పారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులతో ఇళ్ల వద్దనే ఓటు వేయించే ప్రక్రియ కూడా గురువారం ప్రారంభం అయిపోయిందని చెప్పారు. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుంటే ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని అనడం మాత్రమే కాదు.. అసలు ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడాన్ని ఆర్టికల్ 329(బి) అనుమతించదని కూడా గుర్తుచేశారు. ఈసీ న్యాయవాది చెప్పినవన్నీ చాలా సహేతుకమైన అంశాలు.

ప్రస్తుతానికి న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇది ఇంకా ప్రమాదకరం అని చెప్పాలి. సోమవారం లోగా.. ఎన్నికల ప్రక్రియ మరింత జరిగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన గాజు గ్లాసు పగిలి కూటమిలోని ఇతర పార్టీల గొంతు కోస్తున్నదని అంతా అనుకుంటున్నారు.

జనసేనకు వచ్చిన ఇబ్బందేం లేదు. వారు పోటీచేస్తున్న సీట్లలో వారికి పదిలంగా ఓట్లు పడతాయి. వారి ఎంపీలు పోటీచేస్తున్న నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ కేండిడేట్లు ఎవ్వరికీ గ్లాసు కేటాయించడం లేదు. ఆ మేరకు వారి ఎంపీ అభ్యర్థులకు కూడా కించిత్తు నష్టం లేదు. ఎటొచ్చీ.. తెలుగుదేశానికి, బిజెపికి పెనునష్టం తప్పదు.