కవిత లేకుండానే ఎన్నికల ప్రచారం ముగుస్తుందా?

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు గులాబీ పార్టీ బాస్ కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ అండ్ మేనల్లుడు, మాజీ మంత్రి కూడా అయిన హరీష్ రావు. పార్టీలోని నాయకుల్లో…

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు గులాబీ పార్టీ బాస్ కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ అండ్ మేనల్లుడు, మాజీ మంత్రి కూడా అయిన హరీష్ రావు. పార్టీలోని నాయకుల్లో చాలామంది కాంగ్రెసులోకో, బీజీపీలోకో వెళ్లిపోయారు. మిగిలిన నాయకులు వారి నియోజకవర్గాలకు పరిమితమయ్యారు తప్ప రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసే స్థాయి ఉన్న నాయకులు ఎవరూ లేరు.

సరిగ్గా ఎన్నికల సమయానికి కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లడం గులాబీ పార్టీకి పెద్ద లోటు. పార్టీలో ఆమె స్టార్ క్యాంపైనర్. ఆమె జైలుకు పోకుండా ఉన్నట్టయితే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసేదే. తండ్రి, అన్న, బావ మాదిరే ఆమె కూడా మాటకారి. ఆకట్టుకునేలా మాట్లాడగల నేర్పుంది. అందులోనూ తెలుగుతోపాటు హిందీ, ఇంగీష్ ల్లో కూడా అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె జాగృతి అనే సంస్థ నిర్వహిస్తోంది కాబట్టి కళాకారులు కూడా ఆమె వెంట ఉండేవారే.

ఆమె లేకపోవడం కేసీఆర్ కు చెయ్యి విరిగినట్లే అనుకోవాలి. సరిగ్గా ఎన్నికల సమయానికి కీలకమైన వ్యక్తిని, ప్రచారంలో ఒక ఆయుధంలా ఉపయోగపడే కవితను లోపల వేసింది మోడీ సర్కారు. అసలు ఈ లిక్కర్ కుంభకోణం గొడవే లేకుండా ఉంటే ఆమె నిజామాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేదే. ఆ అవకాశం పోయింది. ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశమూ పోయింది.

ఆమె బెయిల్ పిటిషన్ పై తీర్పు ఆరో తేదీకి వాయిదా పడటంతో అదెలా వస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా ఉంది. ఒకవేళ ఆమెకు బెయిల్ ఇచ్చారని అనుకుందాం. అప్పటికి ఎన్నికలే వారం రోజుల్లో పడతాయి. ప్రచారం రెండు రోజుల ముందే ఆపేయాలి కాబట్టి ఆమె బెయిల్ మీద వచ్చినా చేసేది ఏమీ లేదు. గులాబీ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇవ్వండని ప్రజలకు విజ్ఞప్తి చేయడం తప్ప తిరిగి ప్రచారం చేసే అవకాశం ఉండదు. అందులోనూ కోర్టు ఏం షరతులు పెడుతుందో తెలియదు. ఎన్నికల గురించి అసలు మాట్లాడకూడదంటే చేసేదేమీలేదు.

మార్చి 15న తీహార్ జైలుకు వెళ్లిన కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడంలేదు. పిల్లగాడికి పరీక్షలు ఉన్నాయని, తాను దగ్గరుండి చదివించుకోవాలన్నా బెయిల్ ఇవ్వలేదు. తీవ్ర అనారోగ్య కారణాలు చెప్పినా ఇవ్వలేదు. తాను పార్టీకి స్టార్ క్యాంపైనర్ అని, ఎన్నికల ప్రచారానికి పోవాలన్నా బెయిల్ ఇవ్వలేదు. మళ్ళీ ప్రయత్నాలు చేసింది. దీనిమీద ఏం తీర్పు వస్తుందో చూడాలి. మొత్తం మీద కవిత లేకుండానే ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది.