నేషనల్ పాలిటిక్స్ ఎందుకు బాస్?.. మనకు స్టేట్ చాలు 

మనకు జాతీయ రాజకీయాలు ఎందుకు బాస్? రాష్ట్ర రాజకీయాలు చాలు అంటున్నారు గులాబీ పార్టీ నాయకుల్లో ఎక్కువమంది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, దేశ రాజకీయాలను శాసించాలని, అన్ని కలిసొస్తే ప్రధాని కావాలని ఎన్నో…

మనకు జాతీయ రాజకీయాలు ఎందుకు బాస్? రాష్ట్ర రాజకీయాలు చాలు అంటున్నారు గులాబీ పార్టీ నాయకుల్లో ఎక్కువమంది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, దేశ రాజకీయాలను శాసించాలని, అన్ని కలిసొస్తే ప్రధాని కావాలని ఎన్నో ఆశలు పెంచుకున్న గులాబీ బాస్ కేసీఆర్ ఆశలు నీరుగారిన సంగతి తెలిసిందే.

తాను రాష్ట్ర రాజకీయాల్లో మంచి ఊపు మీద ఉన్నప్పుడు, ఎదురు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, గాయిగాత్తర లేపుతానని ఘీంకరించి హుంకరించాడు. కొన్నాళ్లపాటు కాలికి బి బలపం కట్టుకొని రాష్ట్రాలు తిరిగాడు. సీఎంలను, ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకులను కలుసుకున్నాడు. మంతనాలు జరిపాడు.

పొరుగున ఉన్న మహారాష్ట్రలో, ఏపీలో బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేశాడు. ఆ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ చేశాడు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని, ఇక్కడ అమలు చేసే పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ప్రచారం చేసుకున్నాడు. 

కానీ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికలు ఆయన ఆశల పేక మేడలను కుప్పకూల్చాయి. కాబట్టి జాతీయ రాజకీయాల మీద ఆశలు వదులుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అధినేతకు సంకేతాలు పంపుతున్నారు. ఏమిటా సంకేతాలు? నిజానికి ఇది పాత విషయమే.

బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ అని మార్చాలని. అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని బలంగా కోరుతున్నారు. అధికారం కోల్పోగానే నాయకులు పేరు మార్పు పాట ఎత్తుకున్నారు. పార్టీ పేరులో తెలంగాణ పేరు లేకపోవడంవల్లనే ఓడిపోయామని అన్నారు. పేరు మార్పువల్ల ప్రజలకు దూరమయ్యామని అన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించకుండా శూన్యమైపోవడంతో ఈ అభిప్రాయం మరింతగా బలపడుతోంది. అంటే జాతీయ రాజకీయాల ఊసు మనకొద్దని చెబుతున్నారన్న మాట. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్, ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు, మరి కొందరు మాజీ మంత్రులు, బాస్ కు కుడి భుజాలుగా ఉన్న నాయకులు కూడా ఇదే మాట చెబుతున్నారు.

పార్టీ కార్యకర్తల సమావేశానికి హరీష్ రావు టీఆర్ఎస్ కండువా కప్పుకొని వచ్చాడు. అంటే పార్టీ పేరు మార్చాలని బలంగా కోరుతున్నట్లే కదా. పార్టీ పేరు మార్పులో తాను ప్రధాన పాత్ర పోషించాను కాబట్టి పార్టీ ఓటమిలో తనకూ భాగం ఉందన్నట్లుగా కేసీఆర్ కుడి భుజమైన మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెబుతున్నాడు.

ఇక నుంచి పార్టీ పేరును బీఆర్ఎస్ గా పిలవబోమని , తాము మాత్రం టీఆర్ఎస్ గానే వ్యవహరిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నాడు. అంటే పార్టీలో ఎక్కువమంది పార్టీ పేరు మార్చాలనే అంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీ పేరు మార్చే ప్రసక్తే లేదని అధినేత కేసీఆర్ ఓటమి తరువాత కూడా చెప్పాడు. ఆయన కొడుకు కూడా ఇదే మాట అన్నాడు.

అయితే టీఆర్ఎస్ అనే పేరును ఆల్రెడీ వేరేవాళ్లు తీసుకున్నారని, కాబట్టి మార్చడం సాధ్యం కాదని పార్టీకి సంబంధం లేని కొందరు రాజకీయ పండితులు ఇదివరకే చెప్పారు. కానీ బీఆర్ఎస్ నాయకులు కొందరు మాత్రం టీఆర్ఎస్ పేరును వేరేవాళ్లు వాడకుండా ఎన్నికల సంఘం వద్ద ఆరేళ్లపాటు ఫ్రీజ్ చేశామని అంటున్నారు. అంటే మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారన్నమాట. పార్టీ పేరు మార్చనని కేసీఆర్ చెబుతున్నాడంటే ఆయనకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆశ ఇంకా ఉందనుకోవాలా?