జనసేన నాయకులు హద్దులు దాటుతున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. అందుకే ఆ పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్‌తో ప్రకటన వెలువరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్డీఏ సర్కార్ కొలువుదీరి ఇంకా నెల రోజులు కూడా కాకుండానే, పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణుల్ని హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి ప్రకటన ఏదైనా టీడీపీ నుంచి వచ్చి వుంటే అందరూ సంతోషించేవారు.
అదేంటో గానీ, 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలున్న జనసేన పార్టీ హద్దులు దాటడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకట్రెండు నియోజక వర్గాల్లో జనసేన నాయకులు అధికారిక కార్యక్రమాల్లో చొరబడడంపై విమర్శలు వచ్చాయి. జనసేన పార్టీ నాయకుడు వేములాపాటి అజయ్‌కుమార్ పేరుతో వెలువడిన ప్రకటనలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హెచ్చరించారంటూ పేర్కొన్నారు.
ప్రొటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ పాల్గొనడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని అజయ్ హెచ్చరించారు. అలాంటి వారిపై చర్యలు తప్పవంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇటీవల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కుమారుడు శివకుమార్ అధికారులతో సమావేశం నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కమిషనర్ అదితిసింగ్‌ను పక్కన పెట్టుకుని, అధికారులు ఎలా పని చేయాలో ఆయన గారు పాఠాలు చెప్పారు.
అలాగే తిరుపతిలో టూరిజం అధికారులతో సంబంధిత శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనధికారికంగా జనసేన నాయకులు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ వార్నింగ్‌ను అర్థం చేసుకోవచ్చు.
కానీ ప్రభుత్వాన్ని, అధికారుల్ని విమర్శించడం మంచిది కాదని పవన్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? ఎవరిని దృష్టిలో పెట్టకుని ఇచ్చారనే చర్చకు తెరలేచింది. ఈ హెచ్చరిక ప్రకటనతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని భాగస్వామ్య పక్షమైన జనసేన నేతలు విమర్శిస్తున్నారనే సంకేతాలు వెళ్లాయి. అలాగే అధికారులపై కూడా జనసేన నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తమకు తామే చెప్పుకున్నట్టైంది.