అదే నిజమైతే రేవంత్ ది గొంతెమ్మ కోరికే!

ఇవాళ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి విభజన సమస్యలు, పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవడానికి తొలిసారిగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం సందర్భంగా ఎలాంటి డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు…

ఇవాళ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి విభజన సమస్యలు, పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవడానికి తొలిసారిగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం సందర్భంగా ఎలాంటి డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు వినిపించాలి అనే విషయంలో రేవంత్ సర్కారు ఒక నిర్దిష్టమైన ఎజెండా సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలేని గనుక నిజమైతే రేవంత్ సర్కారు అత్యాశకుపోతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఈ చర్చలు ఇవాళ కాదు కదా ఎప్పటికీ ఒక కొలిక్కి రావు అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. ఇంతకూ తెలంగాణ సిద్ధం చేసిన ఎజెండాలోని కోరికలు ఏమిటో తెలుసుకోవాలి కదా. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోని అతిపెద్ద సముద్రతీరం ఉన్నదని సంగతి అందరికీ తెలిసినదే. కేవలం ఆ సముద్రతీరం కారణంగా పరిశ్రమలను ఆకర్షించి ఆర్థికంగా ఎదగాలనేది ఆ రాష్ట్రానికి ఉన్న ఏకైక మార్గం. ఏపీకి ఉన్న సముద్ర తీరంలో తెలంగాణ వాటా కావాలని కోరుతున్నది.

అలాగే మచిలీపట్నం గంగవరం కృష్ణపట్నం పోర్టులలో కూడా తెలంగాణ ప్రభుత్వం వాటా కోరుతున్నది. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం కూడా మునిగిపోతుందని వాదిస్తున్న తెలంగాణ, గతంలో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన ఏడు ముంపు మండలాలను తిరిగి తమ రాష్ట్రానికి ఇవ్వాలని కోరబోతున్నది. ఆ మండలాలను తిరిగి ఇవ్వడం అంటే.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు దారుణంగా తగ్గించవలసి వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అశనిపాతం అవుతుంది.

ఇవి మాత్రమే కాదు టీటీడీ ఆస్తులు, పదవులు ఆదాయాలలో కూడా తెలంగాణకు వాటా కావాలని అడగబోతున్నారు. టీటీడీలో తెలంగాణ వాటా అడగడం అంటే.. హెచ్ఎండిఏ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్నులు సమస్త ఆదాయాలలో అదే దామాషాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వాటా ఇవ్వాలనే తరహాలో ఉండాలి.

ఇంచుమించుగా 42.8 శాతం వాటా తమకు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి శిష్యుడితో భేటీకి ఉత్సాహంగా సిద్ధమవుతున్న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం తెలంగాణకు తాకట్టు పెట్టేస్తారో లేదా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వీరి ప్రతిపాదనలను తిరస్కరిస్తారో వేచి చూడాలి!