మాజీ సీఎం, గులాబీ బాస్ తన పదవీ కాలం పెంచుకున్నాడు. అదేంటి? ఆయన సీఎం కాదు కదా. మరే పదవిలోనూ లేడు కదా? మరి పదవీకాలం పెంచుకోవడం ఏమిటి? అంటారా.. ఇదంతా ఆయన ఫ్యూచర్ ప్లాన్ అన్నమాట. గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా కనుమరుగైనప్పటి నుంచి బాస్ భవిష్యత్తు ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు.
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోగా మిగిలిన ఎమ్మెల్యేలు, నాయకులకు పార్టీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఎలా ఉండబోతున్నదో 70ఎంఎంలో చూపిస్తున్నాడు. తనతో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారో చెబుతున్నాడు. ఆ పార్టీలో వారు ఎంత అసంతృప్తిగా ఉన్నారో, గులాబీ పార్టీలోకి రావాలని ఎలా తహతహలాడిపోతున్నారో కళ్ళకు కడుతున్నాడు. పదేళ్లు తాను అద్భుతంగా పరిపాలన సాగించానని, రాష్ట్రం అన్ని విధాలా సుభిక్షంగా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నాడు.
వచ్చే ఎన్నికలకంటే ముందుగానే మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని ఆశపడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని గుండెలు బాదుకుంటున్నాడు. రాష్ట్రం ఏర్పడగానే మొదటి సీఎం తానే అయ్యాడు. రెండోసారీ కూడా పరిపాలించాడు. అంటే మొత్తం పదేళ్ళపాటు ఎదురు లేకుండా ఏలుకున్నాడు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం కట్టానన్నాడు. దేశం మొత్తానికి తెలంగాణే అన్నం పెడుతోందన్నాడు. అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రాన్నే ఫాలో అవుతున్నాయని చెప్పాడు.
రాష్ట్రంలో ఇక తాను చేయాల్సింది ఏమీలేదని, దేశం పాడైపోతోంది కాబట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని గాడిలో పెడతానన్నాడు. సరే .. పార్టీ ఓటమితో ఆ కథ ముగిసింది. ఇప్పట్లో జాతీయ రాజకీయాల్లో జోలికి పోడు. ఇక వచ్చే ఎన్నికల్లో తాను ఎలాగూ గెలుస్తాను కాబట్టి ఇక గులాబీ పార్టీకి ఢోకా లేదని, కంటిన్యూగా పదిహేనేళ్ళు అధికారంలో ఉంటానని తాజాగా ప్రవచించాడు. గతంలో ఎన్టీఆర్ కూ ఇలాగే జరిగిందని, కాబట్టి తనకూ జరుగుతుందని అన్నాడు.
అధికారంలోకి వస్తే పిచ్చి పనులు చేసి ప్రజలచేత ఛీ కొట్టించుకోవడం కాంగ్రెస్ లక్షణమని అన్నాడు. కానీ పదేళ్లు తాను చేసిందని ఇదేనని మర్చిపోయాడు. ప్రజలు తనను ఛీ కొట్టారనే విషయం బాస్ కు గుర్తు లేదు. మొత్తం మీద పదిహేనేళ్ల అధికారానికి ఆయన ఫిక్స్ అయ్యాడు. తన పదవీ కాలాన్ని తానే పెంచుకున్నాడు. మరి కేసీఆర్ కట్టుకునేవి గాలి మేడలో, ఉక్కులాంటి మహా సిమెంట్ తో కట్టుకునే మేడలో తెలియాలి.