తమకు అధికారం ఇస్తే… నెలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అలాగే మూడు నెలల అరియర్స్‌తో కలిపి… జూలై 1న మొత్తం రూ.7 వేల పింఛన్ అందజేస్తామన్న మాటపై చంద్రబాబునాయుడు నిలబడ్డారు. హామీ ఇచ్చిన ప్రకారం ఆయన పెన్షనర్ల మనసు చూరగొనేలా వ్యవహరించారు. మాటపై చంద్రబాబునాయుడు నిలబడడనే విమర్శ పెన్షనర్ల విషయంలో పచ్చి అబద్ధమని చంద్రబాబు నిరూపించారు. మాట నిలబెట్టుకున్న చంద్రబాబును తప్పక అభినందించాలి.
పెంచిన పెన్షన్ సొమ్మును అందిస్తున్న సందర్భంలో చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. ఆ మాటల వెనుక మర్మం ఏంటనే చర్చకు తెరలేచింది. ఇంతకూ ఆయన ఏమన్నారంటే….
“రాష్ట్ర అప్పు ఎంతో నాకు తెలియదు. భారీ మొత్తంలో రాష్ట్రానికి అప్పులున్నాయి. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు”
ఇదే సమయంలో ఆయన జగన్ పాలన తప్పులు, అప్పులు అన్నట్టుగా సాగిందన్నారు. జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ప్రతిరోజూ చంద్రబాబునాయుడు, లోకేశ్‌తో పాటు టీడీపీ నాయకులు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అప్పు ఎంతో తెలియదని, రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని అనడం వెనుక ఉద్దేశం ఏమై వుంటుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పెన్షన్ పెంపుతోనే చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత తీరిపోలేదు.
ఇంతకు మించి ఆర్థిక భారం పడే సంక్షేమ పథకాలున్నాయి. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుతుంటే, ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.15 వేలు, అలాగే రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.20 వేలు చొప్పున తక్షణం అందించాల్సినవి ఉన్నాయి. ఇంత వరకూ వాటి ఊసే చంద్రబాబు ఎత్తడం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకునే, ఆర్థిక ఇబ్బందులు, అలాగే అన్నీ ఒకటే సారి జరగవని పరోక్షంగా చంద్రబాబు చెప్పారా? అనే అనుమానం తలెత్తింది.
సంక్షేమ పథకాలు వాయిదా పడే అవకాశం వుందని బాబు మాటలపై ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు. మిగిలిన సంక్షేమ పథకాల అమలుపై తన మనసులో మాట ఏంటో బయట పెట్టాల్సిన అవసరం వుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.