సినిమాలకు ఒకప్పుడు టైటిళ్లు పెడితే హీరో క్రేజ్, ఇమేజ్ ను దృష్టిలో వుంచుకుని పెట్టేవారు. ఎన్టీఆర్ సినిమాలకు ఎక్కువగా రాముడు అనే పదం టైటిల్ లోకి వచ్చేలా పెట్టినవి ఎన్నో. ఎఎన్నార్ అయితే కృష్ణుడు పదం వచ్చేలా చూసినవీ వున్నాయి.
హీరో కృష్ణకు అయితే కృష్ణ అన్నది కూడా ఓ కన్సిడర్ పాయింట్ గా వుండేది. కానీ తరువాత తరువాత టైటిళ్ల తీరుతెన్నులు మారాయి. కంటెంట్ కు దగ్గరగా, దూరంగా రకరకాల టైటిళ్లు, అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిడియాలు ఇలా అన్నీ చోటు చేసుకున్నాయి.
హీరో రవితేజ కు కొన్ని టైటిళ్లు అనుకోకుండా పడినా భలే గమ్మత్తుగా కుదిరాయి. కృష్ణ పేరుతో సినిమా చేసాడు. రామారావు ఆన్ డ్యూటీ అంటూ ఓ సినిమా చేసేసాడు. అప్పుడెప్పుడో చిరంజీవులు అంటూ ఓ సినిమా. లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు అంటూ మరో టైటిల్. ఇలా సీనియర్ హీరోలు అందరినీ కవర్ చేసేసినట్లే. శోభన్ బాబు అనే టైటిల్ తోనో, శోభన్ అనే పేరు కలిసి వచ్చేలాగో రవితేజ తో ఓ సినిమా వస్తే ఆ లిస్ట్ పూర్తి అయిపోతుంది.
మొత్తం మీద హీరోల పేర్లు అన్నీ రవితేజ వాడేసినట్లే. నిజానికి ఇవేవీ ప్లాన్ చేసినవి కావు. అలా కుదిరాయి అంతే.. అన్ని సినిమాల్లోకి కృష్ణ టైటిల్ తో వచ్చిన వివి వినాయక్ సినిమా పెద్ద హిట్. ఇక్కడ గమ్మత్తేమిటంటే పిచ్చి పిచ్చి పేర్లతో టైటిళ్లు కూడా రవితేజకే పడ్డాయి. ఇడియట్, ఖతర్నాక్, క్రాక్, షాక్, బలాదూర్, మిరపకాయ్, దరువు, ధమాకా ఇలా రకరకాలు.
చకచకా సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో ఇప్పుడు రవితేజ నే. అందువల్ల మరిన్ని టైటిళ్లు ఎక్స్ పెక్ట్ చేయచ్చు.