నిజంగా 3 గంటల వినోదం ఇస్తున్నారా?

“టికెట్ రేట్లు పెంచిన తర్వాత సింగిల్ స్క్రీన్ లో టికెట్ 250 రూపాయలు. నలుగురు కుటుంబ సభ్యులు సినిమాకు వెళ్తే వెయ్యి. పాప్ కార్న్ కొనుక్కుంటే మరో 500. మొత్తం రూ.1500. ఆంధ్ర, తెలంగాణ,…

“టికెట్ రేట్లు పెంచిన తర్వాత సింగిల్ స్క్రీన్ లో టికెట్ 250 రూపాయలు. నలుగురు కుటుంబ సభ్యులు సినిమాకు వెళ్తే వెయ్యి. పాప్ కార్న్ కొనుక్కుంటే మరో 500. మొత్తం రూ.1500. ఆంధ్ర, తెలంగాణ, యూఎస్ లో 1500 రూపాయలకు 3 గంటల పాటు కూర్చెబెట్టి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాం. అదే 1500 రూపాయలకు ఎంటర్ టైన్ మెంట్ అందించే ఎలిమెంట్ ఇంకోటి ఉందా??

గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని లగ్జరీ హౌజ్ లో ఉంటూ, ఖరీదైన కార్లలో తిరిగే నాగవంశీకి రూ.1500 పెద్ద మొత్తం కాకపోవచ్చని.. సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాలకు వచ్చి చూస్తే.. అది ఎంత పెద్ద మొత్తమో తెలుస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

రూ.1500 రూపాయల వినోదానికి ప్రత్యామ్నాయం లేదన్న నాగవంశీకి లెక్కలేనన్ని కౌంటర్లు పడుతున్నాయి. అదే డబ్బుతో విజయవాడలోని చాలా హోటల్స్ లో కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేసే ప్లేసులు చాలా ఉన్నాయంటున్నారు అక్కడి స్థానిక జనం. నలుగురు కుటుంబ సభ్యులు ఓ పార్క్ కు లేదా ఎగ్జిబిషన్ కు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చని.. లేదంటే ఓ మంచి రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ తినొచ్చని చెబుతున్నారు.

దాదాపు ఇలాంటి పోస్టులే విశాఖపట్నం, వరంగల్, తిరుపతి లాంటి ప్రాంతాల నుంచి కూడా కనిపిస్తున్నాయి. అయినా నాగవంశీ కేవలం డబ్బుల గురించే ఆలోచిస్తున్నారని, తమ 3 గంటల విలువైన సమయం గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తాము కేవలం డబ్బులు మాత్రమే పెట్టడం లేదని, తమ సమయాన్ని కూడా పెడుతున్నామని, సినిమా బాగాలేనప్పుడు, తమకు 3 గంటల వినోదం అందించలేనప్పుడు తమ సమయాన్ని ఎలాగూ తిరిగివ్వలేరు, కనీసం డబ్బు వాపస్ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

ఇక ఓటీటీ ఉందని చెబుతూ పడుతున్న పోస్టులకు లెక్క లేదు. సబ్ స్క్రిప్షన్ ఛార్జీలతో సరిపోల్చి మరీ కంపేర్ చేస్తున్నారు. ఒక సినిమాకు నెలకు 1500 రూపాయలైతే, ఏడాదికి 18వేలు అవుతుందని.. అదే ఏడాదికి రూ.5785 రూపాయలు పెడితే, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, హాట్ స్టార్ వార్షిక సబ్ స్క్రిప్షన్ (2388+1499+399+1499=5785) వస్తోందని చెబుతున్నారు. చవకైన వినోద మాధ్యమం ఏదో చెప్పాలని అడుగుతున్నారు.

మరికొన్ని పోస్టులు ఇలా ఉన్నాయి.

– 1500కు నెల రోజులు నలుగురు కడుపునిండా రెండు పూట్ల తినడానికి 25 కేజీల బియ్యం వస్తుంది. మీ సినిమా భాషలోనే చెప్పాలంటే.. “3 గంటల ఆనందం vs 30 రోజుల ఆకలి” – దీనికి మీరేమంటారు సర్???

– ఈయన స్క్రిప్ట్ సెలక్షన్ వల్ల మంచి ఫిలిం మేకర్ అనే రెస్పెక్ట్ ఉంది కానీ, మాట్లాడే విధానంతో ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు

– రూ.1500 ఎక్కువ కాబట్టే టికెట్ రేట్లు తగ్గిన తర్వాత ఫ్యామిలీతో సినిమాకెళ్లాను. ఒక్కో టికెట్ 150 చొప్పున నలుగురికి 600 అయింది.. ఇక ఇంటర్వెల్ లో స్నాక్స్ తినడం ఎప్పుడో మానేశాం.

– ఈయన మాట్లాడే విధానంలో ఎప్పుడూ నాకు అహంకారమే కనిపిస్తుంది.

– ఆయన బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. పబ్లిక్ ను ఎప్పుడూ చులకనగా చూస్తున్నారు. డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందే అనే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన వ్యవహారశైలి సినీ పరిశ్రమకు చేటు.

– ప్రజల వినోదంలో సినిమా ఒక భాగం మాత్రమే. సినిమా మాత్రమే ప్రజలకు వినోద సాధనం కాదు. ఇంత చిన్న లాజిక్ ను నాగవంశీ ఎలా మిస్సయ్యారు.

– రూ.1500కి మా జీవితాలు బాగు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. కనీసం ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీగా ఉంటుందా అంటే ఇండస్ట్రీలో సక్సెస్ రేటు 10శాతం కూడా ఉండడం లేదు.

7 Replies to “నిజంగా 3 గంటల వినోదం ఇస్తున్నారా?”

  1. ప్రేక్షకులను తక్కువ చేసి మాట్లాడితే… బాలీవుడ్ లాగా టాలీవుడ్ లో కూడా # boycott .,hash tags వస్తాయని అహంకారం తో మాట్లాడే వాళ్ళు తెలుసుకోవాలి

  2. సినిమా అనేది పూర్తిగా optional .. చూడకపోతే చావరు… ఈయన ఏదైనా వైద్యం లేదా విద్యా లాంటివి గురించి అంటే ఏమన్నా అనొచ్చు .. అప్రధానమైన సినిమా లాంటివాటి గురించి పట్టించుకోవడం అనవసరం

Comments are closed.