వాస్తవానికి క్రికెట్ ప్రియులకు క్రికెట్ ఓవర్ డోస్ గా మారి చాలా కాలం అయ్యింది. లెక్కకు మించిన మ్యాచ్ లు, క్రికెట్ లీగ్ లతో క్రికెట్ ఒక రకంగా మజాను కోల్పోయింది! గతంలో బిజీ లైఫ్ లో ఎప్పుడో విరామం లభించినప్పుడు, రెండు మూడు నెలలకు ఒక సీరిస్, రెండేళ్లకు ఒక ఛాంపియన్స్ ట్రోఫీ, నాలుగేళ్లకు ఒక వరల్డ్ కప్, అడపాదడపా టెస్ట్ క్రికెట్.. ఇలా మ్యాచ్ లు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించేవి! గెలుపులు, ఓటములు ఒక్కోరకమైన అనుభూతులుగా మిగిలపోయేవి!
అయితే.. ఇప్పుడు పరిస్థితి వేరు! ఏడాదికి ఐపీఎల్ నెలన్నర పాటు సాగుతుంది. ఈ మ్యాచ్ ఫలితం గురించి గుర్తుంచుకునే లోపే ఇంకో మ్యాచ్! ఈ సీజన్ విజేతలెవరో విశ్లేషణలు సాగేంతలోపే ఇంకో సీజన్ గురించి, ఇంకో లీగ్ గురించి వార్తలు వస్తూ ఉంటాయి! ఇక టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్, టీ20లు.. ఇలా అన్నీ కలగలిపి ఎక్కువైపోయి.. మునుపటి ఎమోషన్స్ లేకుండా పోయాయి! ఒక మ్యాచ్ జరిగితే దాని గురించి నెలలు, సంవత్సరాలు డిస్కస్ చేసుకునే రోజులు పోయాయి. దీంతో.. ఇప్పుడు గెలుపూ అంత గొప్ప కాదు. ఓటమీ అంత తీవ్రమైనది కాదు! ఇది కాకపోతే ఇంకోటి అనే దశలో ఉన్నారు క్రికెట్ అభిమానులు కూడా!
ఇలాంటి పరిస్థితుల్లో కూడా 2023 ప్రపంచకప్ ఒకింత ఆసక్తిదాయకంగానే సాగుతూ ఉంది. క్రికెట్ మాజాను చూపిస్తోంది. బహుశా ఈ ప్రపంచకప్ లో టీమిండియా ప్రదర్శన పతాక స్థాయిలో ఉండటం కూడా ఇందుకు కారణాల్లో ఒకటి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకూ జరిగిన ఏ ప్రపంచకప్ లోనూ చూపనంత తెగువన, అంతటి ఫామ్ ను టీమిండియా ఇప్పుడు చూపుతోంది! 1983లో ఇండియా హాట్ ఫేవరెట్ కాదు. అంచనాలకు మించి రాణించి, సంచనల స్థాయిలో విజేతగా నిలిచింది. 1987 నాటికి భారీ అంచనాలే ఉన్నా, సెమిస్ లో ఇండి ముఖం పట్టింది. 1992, 1996 ప్రపంచకప్ లలో ఓటములే గుర్తుండిపోతాయి! 99 ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శన! పేరుకు సూపర్ సిక్స్ కు చేరినా.. అది గుడ్డిలో మెల్ల!
2003 ప్రపంచకప్ లో ఆరంభంలో టీమిండియా ప్రదర్శనపై ఆగ్రహావేశాలు చెలరేగాయి. హాలెండ్ తో గెలిచినా, ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఓటమితో తీవ్ర స్పందనను ఎదుర్కొంది టీమిండియా. ఆ తర్వాత వరసగా ఎనిమిది మ్యాచ్ లలో నెగ్గి ఫైనల్ వరకూ వెళ్లి ఓటమి పాలైంది. అప్పుడు జట్టు బలీయంగానే కనిపించింది. ఆ తర్వాత 2007లో చిత్తుగా ఓడి ఇంటికి చేరింది. 2011లో స్వదేశంలో టీమిండియా ఒక స్థాయిలో ఆడింది. అయితే అప్పటి కంటే కూడా.. ఇప్పుడు స్వదేశంలో టీమిండియా ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండటం గమనార్హం.
2011 ప్రపంచకప్ విజేతగా నిలిచినప్పటికీ.. ఆ టోర్నీలో ఇండియాతో మ్యాచ్ అంటే ప్రతర్థి జట్లు తర్జనభర్జనలు పడింది లేదు! భయపడిపోయింది లేదు! అయితే ఈ ప్రపంచకప్ లోనే ఇండియా అంటే ప్రత్యర్థి జట్లు భయపడే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వరసగా 9 లీగ్ మ్యాచ్ లలో విజయాలు, సెమిస్ తో విజయంతో ఇండియా 10 మ్యాచ్ లలో వరస విజేతగా నిలిచింది. 2003లో ఎనిమిది మ్యాచ్ లలో వరస విజయాలు సాధ్యం అయ్యాయి.
ఇప్పటి వరకూ ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా రెండు పర్యాయాలు 11 మ్యాచ్ లలో వరస విజయాలను సాధించింది. మరి ఫైనల్లో ఇండియా విజయం సాధిస్తే ఆ రికార్డు కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇండియా ఖాతాలో వరసగా 11 వరస విజయాలు నమోదవుతాయి. అదే సమయంలో ప్రపంచ విజేతగా మూడో సారి నిలుస్తుంది.
ఈ ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ సాధించిన 10 విజయాలూ ఒక ఎత్తు అయితే, 11ది మాత్రం మరో ఎత్తు అని వేరే చెప్పనక్కర్లేదు. ఈ పది విజయాలకూ 11 వ విజయంతో సార్థకత లభిస్తుంది. ఆస్ట్రేలియాను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని వేరే చెప్పనక్కర్లేదు! ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా తన సర్వశక్తులనూ ఒడ్డుతుంది! అంతకు మించిన స్థాయిలో రాణించడమే ఇండియా క్రికెట్ టీమ్ ముందు లక్ష్యం!