కమలం నేతలకు మరోసారి మొండి చేయి

రెండవ విడత నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. 59 కార్పోరేషన్ చైర్మన్ పోస్టులను ఈసారి తీసారు. అయితే అందులో బీజేపీకి దక్కినవి మూడంటే మూడు అని చెబుతున్నారు. అవి కూడా ఉత్తరాంధ్ర దాకా రాలేదు.…

రెండవ విడత నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. 59 కార్పోరేషన్ చైర్మన్ పోస్టులను ఈసారి తీసారు. అయితే అందులో బీజేపీకి దక్కినవి మూడంటే మూడు అని చెబుతున్నారు. అవి కూడా ఉత్తరాంధ్ర దాకా రాలేదు. విశాఖ జిల్లాలో బీజేపీకి చెందిన కీలక నేతలు ఎంతో మంది ఉన్నారు.

వారంతా టీడీపీ కూటమి విజయానికి కృషి చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించిన వారే తరువాత పొత్తు ధర్మంతో పూర్తి స్థాయిలో సహకరించారు. ఇపుడు వారిలో ఒకరిద్దరికి అయినా నామినేటెడ్ పదవులు ఇచ్చినా న్యాయం జరిగి ఉండేదని అంటున్నారు.

విశాఖ సిటీలో అయితే ఎక్కువ మంది బీజేపీ నాయకులు ఉన్నారు. వారిలో దశాబ్దాలుగా పార్టీకి విధేయులుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో వీరిలో కొంతమంది ఆశ పెట్టుకున్నారని ప్రచారం సాగింది.

కానీ విశాఖ బీజేపీ నేతల ముంగిటకు రాకుండానే పదవుల పందేరం పూర్తి అయింది. జనసేన వరకూ చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నాయకులకు పదవులను ఇచ్చారు. బీజేపీకి ఈ దఫా కచ్చితంగా న్యాయం జరుగుతుందని భావించిన వారికి మొండి చేయి చూపించారని అంటున్నారు.

ఉత్తరాంధ్రలో కూటమి అంటే టీడీపీ జనసేనగానే భావిస్తూ నామినేటెడ్ పందేరాన్ని పూర్తి చేస్తున్నారు అని అంటున్నారు. ఇక మూడవ విడత చివరి విడత ఒకటి ఉంటుందని అంటున్నారు. అందులో కూడా అవకాశం లేకపోతే బీజేపీ నేతలు కూటమి పల్లకీకి బోయీలుగా ఉండడమే మిగులుతుందని అంటున్నారు. విశాఖ జిల్లా బీజేపీకి బలం ఉన్న ప్రాంతం. అక్కడ పార్టీకి జోష్ తేవాలీ అంటీ నామినేటెడ్ పదవులు చివరి విడతలో అయినా ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు.

One Reply to “కమలం నేతలకు మరోసారి మొండి చేయి”

Comments are closed.