టీడీపీ యువ నాయకుడు తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నా, తమ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన రగిలిపోతున్నారు. దీంతో అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన కార్యకర్తను విడిపించుకుని వెళ్లడం విశేషం.
ఉమ్మడి అనంతపురం జిల్లా బత్తలపల్లి పోలీసులు టీడీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్‌కు తెలిసింది. వైసీపీ, జనసేన నాయకుల ఒత్తిడితోనే టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారని పరిటాల శ్రీరామ్ భావించారు.
దీంతో ఆయన అర్ధరాత్రి వేళ బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌కు హడావుడిగా వెళ్లారు. అధికార పార్టీకి చెందిన తమ కార్యకర్తను అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. సొంత పూచీకత్తుపై కార్యకర్తను విడిపించుకెళ్లారు. ఈ ఘటన చర్చనీయాంశమైంది.
టీడీపీ నాయకులు పరిటాల శ్రీరామ్ తీరును ప్రశంసిస్తుండగా, ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. కార్యకర్త కోసం పరిటాల ఎందాకైనా వెళ్తానని నిరూపించారని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే అధికార పార్టీ కావడంతో, చట్టాల్ని లెక్క చేయకుండా పరిటాల వ్యవహరించారని ప్రత్యర్థుల ఆరోపణ.