ప్రపంచ పాలకులకు సోకుతున్న అంటువ్యాధి నియంత బుద్ధి!

ప్రజాస్వామ్యం అనే పదం కింద చెలామణీలో ఉన్న మన దేశంలో ప్రజల చైతన్యం ఒక్కటే రక్ష గా నిలువగలుగుతుంది.

జి జిన్ పింగ్ తనను తాను చైనాకు మరణించేవరకు ప్రెసిడెంట్ గా 2018లోప్రకటించుకున్నాడు. 72 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ తనను తాను 2036 వరకు, అనగా ఆయనకు సుమారు 84 ఏళ్ల వయసు వచ్చేవరకు, రష్యాకు అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఉత్తరకొరియా కిమ్ జోంగ్ సంగతి చెప్పక్కర్లేదు. అక్కడ ఎన్నికలు జరిగినా జరక్కపోయినా ఒక్కటే. మరణించే దాకా తామే రాజ్యాం చేయాలని, అధికారం వెలగబెట్టాలని ప్రకటించుకున్న ఆ ఇద్దరు నేతలు అందుకు అనుగుణంగా ఆ దేశ రాజ్యాంగాన్నే సవరించేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వంతు వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా పీఠం మీదకు రాగానే.. ఆయనకు ఈ అంటు వ్యాధి సోకింది. రాజ్యాంగసవరణ దిశగా ఆలోచనలు సాగిస్తున్నారు. నియంతలాగా స్థిరపడాలని అనుకుంటున్నారు.

నెమ్మది నెమ్మదిగా ప్రపంచంలోని పాలకులందరూ కూడా ఇలాంటి ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నారా? అనే భయం కలుగుతోంది. ఆల్రెడీ నియంతృత్వమే విధానంగా బతుకుతున్న దేశాల సంగతి వేరు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన దేశాలు కూడా.. ఇప్పుడు భిన్నంగా మారుతున్నాయి. చూడబోతే.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ లోనే కాస్త భద్రమైన పరిస్థితి కనిపిస్తోంది. నిజమేనా? మనదేశంలో ప్రజాస్వామ్యం భద్రంగా ఉందా? ప్రమాదం లేదా? ప్రపంచ పాలకుల పోకడలతో పోల్చుకుంటూ సాధికార విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.. ‘‘ప్రపంచ పాలకులకు సోకుతున్న అంటువ్యాధి.. నియంత బుద్ధి!’’

జొహాన్ వోల్ఫ్‌గ్యాంగ్ వోన్ గోతె 17వ శతాబ్దకాలం నాటి ఒక జర్మన్ రచయిత. ఆయన 1774లో ది సారోస్ ఆఫ్ యంగ్ వెర్దర్ అనే నవల రాశారు. ఆ నవలలో వెర్దర్ కథానాయకుడు. ఆ నవలలో వెర్దర్ ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు. ఆ సంగతి బహిరంగం అవుతుంది. దాని వెంబడి అనేక మంది అతడి ఆత్మహత్యను అనుకరిస్తూ.. తాము కూడా ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తారు.

ఆత్మహత్యకు సంబంధించి పత్రికలలో ఒక కథనం ప్రచురితం అయిన తర్వాత.. అదే తరహా ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుండడాన్ని సాధారణంగా కాపీ క్యాట్ ఆత్మహత్యలు అని వ్యవహరిస్తుంటారు. అమెరికాలో ఇలాంటి వరుస ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో 1974లో మొదటిసారిగా ఫిలిప్స్ అనే మానసిక శాస్త్రవేత్త మొదటి సారిగా గోతె నవలలోని పాత్రను దృష్టిలో ఉంచుకుని వెర్దర్ ఎఫెక్ట్ అనే పదం ఈ ఆత్మహత్యలకు వాడారు. సైకాలజీలో వీటిని ఆ పేరుతో వ్యవహరిస్తారు. అంటే ఆత్మహత్యలు కూడా ఒక అంటు వ్యాధిలాగా ప్రబలుతాయన్నమాట. సైకాలజీ వీటిని సూసైడ్ కంటాజియన్ అని కూడా వ్యవహరిస్తారు.

ఈ సైకాలజీ శాస్త్రీయమైన పరిభాష ఏదీ మనకు తెలియకపోవచ్చు గానీ.. ఇలాంటి ఆత్మహత్యలు మాత్రం మనకు మన చుట్టూ ఉన్న సమాజంలో పుష్కలంగా, పుంఖాను పుంఖాలుగా కనిపిస్తుంటాయి. ‘అప్పుల బాధతో రైతు ఆత్మహత్య’ అనే వార్త పత్రికల్లో ప్రముఖంగా వస్తుంది. దాని వెంబడి అనేక మంది రైతులు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకోవడం చాలా సాధారణంగా జరిగిపోతుంది. అత్తింటి ఆరళ్లు తాళలేక నవవధువు ఆత్మహత్య, ఇద్దరు పిల్లల సహా తల్లి ఆత్మహత్య.. ప్రత్యేకించి.. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. ఆత్మహత్యలు కూడా అంటువ్యాధిలాగా వ్యాపిస్తాయి.

సూటిగా చెప్పాలంటే.. ‘వెర్దర్ ఎఫెక్ట్’ అనే పదం కేవలం ఆత్మహత్యల నేపథ్యంలో పుట్టి ఉండవచ్చు. కానీ.. ఒక వ్యవహారానికి సంబంధించి.. ఒకరి పోకడ బహుళ ప్రచారంలోకి వచ్చిన తర్వాత.. ఇంకా అనేక మంది అదే పోకడను అనుసరించే మోజులో ఉంటే వాటన్నింటినీ కూడా మనం వెర్దర్ ఎఫెక్ట్.. కాపీ క్యాట్ సిండ్రోమ్ అనే అనవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల పాలకులను అంటువ్యాధిలాగా ఆవరిస్తోన్న సిండ్రోమ్ ఇది.

పాలకుడిగా అవకాశం చిక్కిన వెంటనే అందరిలోనూ తాము శాశ్వతంగా అధికార పీఠం మీదనే ఉండిపోవాలనే ‘నియంత బుద్ధి’ పొడసూపుతోంది. తమకు శాశ్వతాధికారం దక్కడం కోసం ఏమేం చేయవచ్చునో వారు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు.. ఇదే తరహా పోకడలతో చెలరేగిపోతున్నారు. తాజాగా.. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన వెంటనే.. అమెరికా రాజ్యాంగంలో మార్పుచేర్పులు చేసి అయినా సరే.. తనకు శాశ్వతాధికారం దక్కించుకోవాలని అనుకుంటున్న ట్రంప్ వైఖరి.. మనకు ఇలాంటి అభిప్రాయం కలిగిస్తోంది.

డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అమెరికాలో ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్షుడిగా పోటీచేయకూడదనేది చట్టంలో ఉంది. ఈ చట్టసవరణ 1947లో జరిగింది. అదివరలో అది కేవలం సాంప్రదాయంగా మాత్రమే ఉండేది. ఫ్రాంక్లిన్ డి.రూజ్ వెల్ట్ 1933 నుంచి 1945లో మరణించే వరకు వరుసగా నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్షుడు రెండు పర్యాయాలు మాత్రమే ఆ పదవిలో ఉండాలనే సాంప్రదాయాన్ని, చట్టబద్ధమైన నిబంధనగా మార్చాలనే ప్రయత్నం ఆయన మరణానంతరమే జరిగింది. 1947 లో ఆమేరకు రాజ్యాంగ సవరణ చేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా అందరూ దానినే అనుసరిస్తున్నారు.

ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కు కొత్త ఆలోచన వచ్చింది. ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న 79 ఏళ్ల ట్రంప్ పదవీకాలం 2029లో ముగుస్తుంది. అప్పటికి ఆయనకు 83 ఏళ్ల వయసుంటుంది. అప్పుడు తాను మూడోసారి కూడా అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు వీలుగా, అవసరమైన రాజ్యాంగ సవరణ ప్రక్రియ చేపట్టాలనే ఆలోచనను ఆయన ప్రకటించారు. ఊహాజనితమే అయినప్పటికీ.. ఒకవేళ అలాంటి చట్టసవరణ జరిగి, ఆ మూడోసారి పోటీచేసిన ఎన్నికల్లో ఆయన నెగ్గితే.. 87 ఏళ్ల వయసు వరకు అధ్యక్షుడగానే ఉంటారు. లేదా ఆ రాజ్యాంగ సవరణ అనేది ఇంకా ఏ రూపంలో చేస్తారో తెలియదు గనుక.. ఆ తర్వాత కూడా తానే అధ్యక్షుడు కాదలచినా ఆశ్చర్యం లేదు. స్థూలంగా గమనించినప్పుడు.. అమెరికా అధ్యక్షపీఠంపై మరణించే వరకు తానే ఉండిపోవాలని ట్రంప్ కోరుకుంటున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ప్రజాస్వామిక లక్షణం కాదు. రాజరికపు, నియంత బుద్ధుల పోకడ!

డొనాల్డ్ ట్రంప్ కు ఈ ఆలోచన హఠాత్తుగా తనకు తానుగా తన బుర్రలో పుట్టినదేనని అనుకోవడానికి వీల్లేదు. మనం ముందే చెప్పుకున్న వెర్దర్ ఎపెక్ట్ ద్వారా ట్రంప్ కు సోకిన అంటు వ్యాధి ఇది. ప్రపంచంలోనే అగ్రరాజ్యపు అధిపతికి.. నియంత బుద్ధుల అంటువ్యాది సోకింది. ఇతరత్రా అనేక విధాలుగా కూడా ఆయన దానిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అదే సమయంలో.. అది ఆయనకు ఎక్కడినుంచి వచ్చింది అనే సంగతిని కూడా గమనించాలి.

ప్రపంచంలో నియంతృత్వంమే తమ విధానంగా గల దేశాలు అనేకం ఉన్నాయి. ఆ దేశాల నియంత పాలకులు తమ ఇష్టానుసారం దేశాన్ని నడిపిస్తున్న తీరును కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ఆయా దేశఆలు ఎంతటి దుర్బల స్థితిలో కునారిల్లుతున్నాయో కూడా చూస్తుంటాం. విధానమే నియంతృత్వం అయిన వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజాస్వామ్యపు ముసుగులో.. ప్రజలు ఎన్నుకున్న ప్రజారక్షకుల ముసుగులో.. నియంతలా పాలించాలని అనుకోవడమే ఆలోచన పరులను ఇబ్బంది పెడుతుంది. ప్రపంచ యవనికపై అనేకమంది పాలకులు ఒకసారి పాలన అవకాశం దొరికిన తర్వాత.. ఈ బుద్ధిని ప్రదర్శిస్తున్నారు.

ఇటీవలి కాలంలో చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ తన మరణం వరకు తానే అధ్యక్షుడిగా ఉండేలా ప్రకటించుకున్నారు. ఆమేరకు చట్టసవరణ చేసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు వెర్దర్ ఎఫెక్ట్ ప్రకారం ఆ అంటువ్యాధి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సోకింది. ఆయన 2036 దాకా అధ్యక్షస్థానంలో తానే ఉండేలా రాజ్యాంగాన్ని సవరించేసుకున్నారు. అప్పటికి ఆయనకు 83 ఏళ్లు వస్తాయి. ఆతర్వాతి సంగతి గురించి.. అప్పటికప్పుడు మళ్లీ రాజ్యాంగాన్ని సవరించుకుంటారేమో తెలియదు. ఇలా ప్రపంచంలో చైనా, రష్యా వంటి రెండు పెద్ద దేశాల పాలకులు స్థిరీకరించుకుంటున్న నియంతబుద్ధులు అంటువ్యాధిలా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా ఇప్పుడు సోకినట్టుంది.

నియంతబుద్ధుల్లో కూడా ఆయన ఎంతో ఔదార్యంతో మూడోదఫా పోటీకి వీలుగా సవరణ జరగాలని మాత్రమే అంటున్నారు. ఇప్పుడు 78 ఏళ్ల ఈ కుర్రవాడు, అన్నీ అనుకూలిస్తే, చట్టసవరణ చేయగలిగితే.. అప్పటికి 82 ఏళ్ల వయసులో మళ్లీ పీఠం ఎక్కాలనుకుంటున్నాడు. పుతిన్ 83లో వయసు నాటికి ముగించేలా సవరణ చేసుకుంటే.. ట్రంప్ 82లో మళ్లీ మొదలయ్యేలా సవరణ ఆశిస్తున్నారు. ఇంకా నయం– అధ్యక్షపీఠంపై తాను శాశ్వతంగా ఉండిపోతాననే తరహాలో చట్టసవరణకు ప్రయత్నించడం లేదు. ఆ మాత్రం ఉదారవాదానికి ఆయనకు ఆ దేశ ప్రజలు రుణపడి ఉండాలి.

మనదేశంలో సంగతేంటి..?

నియంతబుద్ధులు అనేవి ఇలాంటి చట్ట సవరణలు జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తాయిన అనుకుంటే పొరబాటు! ఈ నియంతబుద్ధుల ప్రస్తావనలన్నీ మిగిలిన ప్రపంచపు దుర్మార్గాలు కదా.. ఆ ప్రపంచం ఎలా పోతే మనకేంటి? మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజాస్వామ్యం మాత్రమే పరిఢవిల్లుతున్నది.. పరిఢవిల్లుతూ ఉంటుంది.. అని మనం అనుకుంటే అది భ్రమే. సాంకేతికంగా మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే మాట మాత్రమే నిజం. కానీ ప్రపంచంలో ఇంతగా కుటుంబ, వారసత్వ రాజకీయాలకు నెలవైన దేశం మరొకటి ఉండకపోవచ్చు.

ముందు మన తెలుగు రాష్ట్రాల సంగతి చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తొలిప్రయత్నంలో ఆయనను ప్రజలు తిరస్కరించినప్పటికీ.. మలి ప్రయత్నంలో ముఖ్యమంత్రిగా అవకాశం కట్టబెట్టారు. జగన్ నిజంగానే విప్లవాత్మకమైన, దేశం మొత్తం అనుసరించి తీరవలసిన కొన్ని సరికొత్త సంక్షేమ ఆలోచనలకు తన పదవీకాలంలో శ్రీకారం చుట్టారు. ఆ సంక్షేమ పథకాల అంతిమ లబ్ధిదారులు– వాటిని అందించిన పాలకుడిని ఎప్పటికీ అభిమానించే, ప్రేమించే వాతావరణాన్ని కల్పించారు. అయితే పరిపాలనకు అదొక్కటే సరిపోదు అనే సంగతిని విస్మరించారు. ప్రజలు అభిమానాన్ని పొందడానికి మించి, ప్రభుత్వాధినేతగా చేయవలసిన పనులతో సమతుల్యత సాధించడంలో విఫలం అయ్యారు. మరో ముప్పయ్యేళ్లపాటు నిరంతరాయంగా తానే ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రం కోరుకున్నారు. ఎంచిచూస్తే ఆయన కలగన్న గడువు నాటికి ఆయనకు కూడా 82 ఏళ్లు నిండుతాయి.

రాజ్యాంగాన్ని సవరించలేడు గనుక సరిపోయింది గానీ, జగన్ ఆలోచన కూడా పుతిన్ లాగానే అదే వయోపరిమితికి సాగింది! ప్రభుత్వాధినేతగా నియంతగా సాగే చాన్స్ ఎటూ లేదు గనుక.. ఆయన తాను స్థాపించుకున్న తన సొంత పార్టీకి తనను శాశ్వత అధ్యక్షుడిగా చేసుకున్నాడు. కానీ.. ఎన్నికల సంఘం ఈ దేశంలో అలాంటివి చెల్లవని తేల్చి చెప్పడంతో.. మళ్లీ వెనక్కు తగ్గారు. స్పష్టంగా చెప్పాలంటే జగన్ కాస్త అత్యుత్సాహంతో తనలోని నియంత బుద్ధులను బయటపడి ప్రదర్శించేసుకున్నారు. కానీ, ఈ దేశంలో 80 శాతం పార్టీలు నడుస్తున్నది అలాంటి నియంతబుద్ధుల నాయకుల చేతుల్లోనే..!

చట్టబద్ధ అధికారంలో ఉండేలా చేసుకోవడం మాత్రమే నియంత బుద్ధి కాదు. పార్టీ మీద పెత్తనాన్ని కూడా శాశ్వతంగా తామే కలిగి ఉండాలని అనుకోవడం కూడా నియంత బుద్ధే. కుటుంబ రాజకీయాలనే పదం వినిపిస్తే మొట్టమొదటగా మనకు గుర్తు వచ్చేది కాంగ్రెస్ పార్టీ. తాము చాలా ప్రజాస్వామికంగా ఉంటున్నాం అని చెప్పుకోవడానికి ఆ పార్టీ అధ్యక్షులను ఇతర వర్గాలనుంచి ‘ఎన్నుకుంటూ’ ప్రస్థానం సాగిస్తోంది.

కానీ పెత్తనం మొత్తం ఒకే కుటుంబం చేతిలో ఉందనేది అందరికీ తెలుసు. ప్రాంతీయ పార్టీల సంగతి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. అంతో ఇంతో దక్షిణ భారతదేశంలో ఎంతో విప్లవాత్మకమైన భావజాలాలనుంచి పుట్టినవి ద్రవిడ పార్టీలు. అలాంటివాటిలో ఒకటైన డీఎంకే పార్టీని కూడా కరుణానిధి.. హేయంగా ఒక కుటుంబ పార్టీలాగా మార్చేశారు. కరుణ తరువాత స్టాలిన్, ఆ తరువాత ఉదయనిధి.. ఇలా! అధికారం ఎప్పటికీ, అది పార్టీ మీదనే కావొచ్చు గాక, మా చేతిలోనే ఉండాలి.. అనే భావనే నియంత బుద్ధి గా మనం గుర్తించాలి. చంద్రబాబు–లోకేష్, కేసీఆర్–కేటీఆర్ తెలుగు నాట ఈ కాంబినేషన్లు అన్నీ ఇలాంటివే.

ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో సైతం అనేక ప్రాంతీయ పార్టీలు ఇదే సంకుచిత ధోరణులతో అలరారుతున్నవే. తనకంటూ కుటుంబం కూడా లేని.. ఎంతో ఉదారవాద నాయకురాలిగా, ఆవేశ పూరితురాలైన మంచి నాయకురాలిగా కనిపించే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా వారసుడిగా మేనల్లుడిని రంగంలోకి తీసుకువచ్చారు. ‘అయితే నేను– లేకపోతే నా కుటుంబం’ అనే ధోరణి లేకుండా ఇప్పటికి మనకు కనిపిస్తున్న నాయకులు ఒదిశా సీఎం నవీన్ పట్నాయక్ వంటి అతి కొద్ది మంది మాత్రమే. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ వర్గానికి చెందవలసిన వారే గానీ.. ఆయన ఎప్పటికీ తాను మాత్రమే సీఎంగా ఉండాలనే కాంక్షతో ఒక సిద్ధాంతమూ, నియమమూ ఏదీ లేకుండా అవకాశవాదంతో కుదుర్చుకునే పొత్తులు.. ఆ క్రెడిట్ దక్కకుండా చేసేస్తాయి.

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలకుల పరిస్థితి చిత్రమైనది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, విలువలు, ఆదర్శాలకు విలువ ఇచ్చే పార్టీ ఇలాంటి నిర్వచనాలన్నీ నరేంద్ర మోడీ అనే సుడిగాలి ఉధృతికి చెల్లాచెదరు అయిపోయాయి. ఆపార్టీలో ఒకప్పుడు ఎలాంటి నియమాలు, సిద్ధాంతాలు ఉన్నాయో ఇప్పుడు ఎవరికీ గుర్తు లేదు కూడా. ‘శాశ్వతంగా మోడీ మాత్రమే ఈ దేశానికి ప్రధానిగా ఉండాలి’ అంటూ రాజ్యాంగ సవరణ వారు చేయలేదు. కానీ.. ఎప్పటికీ మోడీ మాత్రమే ఉండేలా వాతావరణాన్ని మొత్తం అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఒక కోణంలోంచి చూసినప్పుడు జమిలి ఎన్నికలు కూడా.. మోడీ నియంతృత్వ పోకడలకు నిదర్శనం అనే వాదన కూడా ఉంది. మోడీ ఎప్పుడూ కూడా తాను నియంత కావాలని ఉన్నట్టుగా చెప్పుకోరు.. కానీ, నియంతపట్ల ఉండగల భయభక్తులకు మించి అందరూ తన పట్ల ప్రదర్శించాలని కోరుకుంటారు.

మంచి నియంతల లక్షణం ఇది. వారికి స్వార్థం ఉండదు. స్వలాభాపేక్ష ఉండదు. కేవలం దేశ సమగ్ర, సమున్నత ప్రయోజనాలు మాత్రమే లక్ష్యంగా ఉంటాయి. తప్పులు చేయరు. కానీ, దేశాభ్యున్నతికి తాను అనుకున్న మార్గం ఒక్కటే సరైనదని, ఎవ్వరి అభిప్రాయాన్నీ స్వీకరించాల్సిన అవసరం లేదని వారు భావిస్తారు.

మంచి నియంతలు తొలిసారిగా అలాంటి నియంత అవతారం ఎత్తినప్పుడు.. ఇలా దేశం కోసమే పాటుపడతారు. కానీ.. వారి తదనంతరం ఆ నియంత పోకడ అలాగే మిగిలిపోతుంది. దానిని అందిపుచ్చుకున్న వారి వారసులు.. అంతే మంచి వారై ఉంటారనే గ్యారంటీ లేదు. అక్కడినుంచి దేశం, పరిస్థితులు భ్రష్టమార్గం పట్టిపోతాయి. మనకు అలాంటి ప్రమాదం ఎంత మేరకు పొంచిఉన్నదో ఇదమిత్థంగా తేల్చిచెప్పలేని పరిస్థితి. కుటుంబ ప్రాధాన్యం ఇసుమంతైనా కనిపించని కమ్యూనిస్టు పార్టీలు చెప్పుకోడానికి మనదేశంలో ఘనంగానే ఉన్నాయి. కానీ వాటి బలం, ప్రాబల్యం చాలా తక్కువ. అదొకరకం దుస్థితి.

పాలకులలో పుడుతున్న నియంత బుద్ధులను మార్చడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కనీసం ప్రజాస్వామ్యం అనే పదం కింద చెలామణీలో ఉన్న మన దేశంలో ప్రజల చైతన్యం ఒక్కటే రక్ష గా నిలువగలుగుతుంది. నాయకుల ధోరణులను గమనిస్తూ వారికి బ్రేకులు వేయగలిగే తెలివిడిని ప్రజలు అలవరచుకోవాలి. నాయకుల మాటల, మాయల సమ్మోహకత్వంలో పడి ఒళ్లు మరచిపోకూడదు. ఉన్మాదంలోకి దిగిపోకూడదు. అవన్నీ వ్యక్తులుగా క్షణికోద్వేగాలను సంతృప్తి పరుస్తాయి. కానీ, అంతిమంగా దేశానికి చేటు చేస్తాయి.

.. ఎల్. విజయలక్ష్మి

16 Replies to “ప్రపంచ పాలకులకు సోకుతున్న అంటువ్యాధి నియంత బుద్ధి!”

  1. ఇక్కడ.. బోడి గాడు.. 2014 నుంచి… అంతే గా? అప్రకటిత.. నియంత లా… 2014 కే యంత్రాల కుతంత్రాలు… గుప్పుమనగా.. 2019 కి.. కర్ణాటక ఎన్నికలలో.. కోలారు జిల్లా లో.. రోడ్డుపక్కన దొరికిన.. యంత్రాలకు.. లెక్కలే చెప్పలేదు.. ఇక.. 2024 ఎన్నికలకు.. కరెక్ట్ గా యంత్రాలను తిప్పుకుని.. కావలసిన.. మెజారిటీ తెచ్చుకుని.. లీగల్ గా.. ఇల్లీగల్ పనులతో గెలుస్తూ.. 2029 కి మళ్ళి జమిలి అని ఇదే ఆట ఆడేయటానికి రెడీ అవ్వటం … నియంతృత్వానికి నిదర్శనమే గా? అతి పెద్ద ప్రజాస్వామ్యా దేశానికీ పట్టిన.. పీడ రాష్ట్రము లో దేశం లో ఉండగా.. కొత్త గా పక్క దేశాలను వేలెత్తి చూపించటమెందుకు?!

  2. విడిపోయిన ప్రత్యర్దులని కలిసేలా చేసుకుని ..తన ౩౦ ఏళ్ళ కల తానే చెడగొట్టుకున్న ….

  3. జగన్ రెడ్డి అవినీతి ని మహా మేత , కవిత కేటీఆర్ గాడి అవినీతిని దుబాయ్ శేఖర్ ముక్కోడు , అదానీ అవినీతిని మోడీ కాపాడుకుంటున్నంత కాలం మనదేశానికి అభివృద్ధి ఉండదు , రూపాయి పడిపోక తప్పదు

  4. ఆత్రం ఎక్కువ అయి కేసులు మీద వేసుకుని లాకోలేక పీకోలేక ఉన్నోళ్లు హీరోలు ఇప్పటి జమానా లో ..

Comments are closed.