పాక్ కు ఆతిథ్యం ఆనందం ఆవిరి!

సుదీర్ఘ కాలం త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాక్ క్రికెట్ కు ఆ ఆనందం ఎక్కువ‌సేపు నిలుస్తున్న‌ట్టుగా లేదు. ఎప్పుడో ద‌శాబ్దాల క్రితం ఐసీసీ ఈవెంట్ కు చివ‌రిసారి ఆతిథ్యం…

సుదీర్ఘ కాలం త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాక్ క్రికెట్ కు ఆ ఆనందం ఎక్కువ‌సేపు నిలుస్తున్న‌ట్టుగా లేదు. ఎప్పుడో ద‌శాబ్దాల క్రితం ఐసీసీ ఈవెంట్ కు చివ‌రిసారి ఆతిథ్యం ఇచ్చింది పాక్. 2008లో శ్రీలంక జ‌ట్టుపై ఉగ్ర‌దాడి త‌ర్వాత పాక్ లో దాదాపు ద‌శాబ్దం పాటు ఏ అంత‌ర్జాతీయ జ‌ట్టూ పర్య‌టించ‌లేదు. ఎలాగోలా ఒప్పించి వెస్టిండీస్ వంటి జ‌ట్ల‌ను త‌మ దేశంలో ప‌ర్య‌టింప‌జేసి… ఆ త‌ర్వాత ఇత‌ర జ‌ట్ల‌కూ భ‌ద్ర‌త విష‌యంలో భ‌రోసా ఇచ్చి చివ‌ర‌కు ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ వ‌ర‌కూ వ‌చ్చింది పాక్.

అయితే ఈ ట్రోఫీ ఆడ‌టానికి పాక్ కు వెళ్ల‌డానికి ఇండియా సుముఖం వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డంతో.. చాలా కాలం పాటు అది వాయిదా ప‌డింది. ఇండియా ఆడ‌క‌పోతే టీవీ రైట్స్ ద్వారా వ‌చ్చే ఆదాయం త‌గ్గిపోతుంది. దీని వ‌ల్ల నిర్వ‌హ‌ణ వ్య‌ర్థమ‌నే లెక్క‌లు ఐసీసీ వ‌ద్ద ఉంటాయి. అలాగే ఇండియా ఆడ‌కుండా ఈ ట్రోఫీని నిర్వ‌హించ‌డం వ‌ల్ల పాక్ కు కూడా అర్థికంగా లాభం ఏమీ కాదు. దీంతో ఇండియా ష‌ర‌తుల‌కు దాదాపుగా త‌లొగ్గి ఈ టోర్నీని నిర్వ‌హిస్తోంది పాక్. త‌మ లీగ్ మ్యాచ్ ల‌ను ఇండియా దుబాయ్ వేదిక‌గా ఆడుతూ ఉంది.

ఇక పాక్ సంగ‌తికి వ‌స్తే.. ఆతిథ్యం ఇస్తూ తొలి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ తో పాక్ ఓట‌మి పాలైంది. ఇక దుబాయ్ వేదిక‌గా ఇండియాతో జ‌రిగిన మ్యాచ్ లో కూడా పాక్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఇక బంగ్లాదేశ్ తో మాత్ర‌మే మ్యాచ్ మిగిలి ఉంది. అది గెలిచినా, ఓడినా పాక్ ప‌రిస్థితిలో తేడా ఉండ‌దు.

నాలుగు జ‌ట్లున్న ఏ గ్రూప్ లో ఇప్ప‌టికే ఇండియా తాన‌డిన రెండు మ్యాచ్ లు నెగ్గింది. మూడో మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడాల్సి ఉంది. పాక్ పై విజ‌యంతో న్యూజిలాండ్ తొలి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. బంగ్లా, ఇండియాల‌తో ఆ జ‌ట్టు మిగిలిన మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ ఫామ్ ను బ‌ట్టి చూస్తే.. బంగ్లాను చిత్తు చేయ‌వ‌చ్చు. ఇండియాకు కూడా న్యూజిలాండ్ గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంది. న్యూజిలాండ్ పై కూడా గెలిస్తే.. ఇండియా ఏ గ్రూప్ లో ఒక‌టో స్థానంలో నిలిస్తే.. దుబాయ్ వేదిక‌గా జ‌రిగే సెమిస్ ఆడే అవ‌కాశం ఉంది. లేదా ర‌న్ రేట్ ఆధారంగా తొలి స్థానంలో నిలిచినా చాలు! ప్ర‌స్తుతానికి అయితే ఫైన‌ల్ వేదిక‌గా లాహోర్ ఉంది.

ఇక పాక్ సెమిస్ కు చేరాలంటే ఆ జ‌ట్టు చేతిలో ఉన్న‌ద‌ల్లా బంగ్లాపై భారీ విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం! ఇప్ప‌టికే వ‌ర‌స ఓట‌ముల‌తో పాక్ నెట్ ర‌న్ రేటు మైన‌స్సుల్లోకి వెళ్లి ఉంటుంది. దాన్ని మెరుగుప‌రుచుకునే స్థాయి విజ‌యం బంగ్లాపై సాధించాలి.

అలాగే న్యూజిలాండ్ పై బంగ్లా నెగ్గాలి! కివీస్ పై ఇండియా నెగ్గాలి! అప్పుడు బంగ్లా, కివీస్, పాక్ ల‌లో నెట్ ర‌న్ రేటు మెరుగ్గా ఉన్న జ‌ట్టు సెమిస్ రేసులో నిలుస్తుంది. కానీ బంగ్లాతో మ్యాచ్ లో కివీస్ నెగ్గితే.. బంగ్లా, పాక్ లు టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన‌ట్టే! ఇక వేరే లెక్క‌లు ఉండ‌వు! కివీస్, పాక్ ల‌పై నెగ్గితే బంగ్లాదేశ్ సెమిస్ కు చేరుతుంది!

ఇక ఇండియా పాక్ ల మ్యాచ్ కు త‌గిన హైప్ తోనే మ్యాచ్ ఆరంభం అయ్యింది. గ‌తంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఇండియాను పాక్ మూడు సార్లు ఓడించింది. ఈ ట్రోఫీల్లో ఇండియా పాక్ పై రెండు సార్లే నెగ్గింది. ఈ నేప‌థ్యంలో మొద‌లైన మ్యాచ్ లో ఇండియాకు ఏ ద‌శ‌లోనూ పాక్ గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది.

ముందుగా బ్యాటింగ్ ప్రారంభించి… ప‌ర‌మ జిడ్డుగా బ్యాటింగ్ చేసింది. ప‌ది ఓవ‌ర్ల‌లోపే రెండు వికెట్ల‌ను కోల్పోయిన త‌ర్వాత అతి జాగ్ర‌త్త‌గా ఆడి చాలా కాలం త‌ర్వాత వ‌న్డేల్లో జిడ్డు బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో పాక్ చూపించింది. చివ‌ర‌కు 242 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భారత్ ముందుంచింది. పిచ్ తీరు ఎలా ఉన్నా.. ఎదురుదాడితో ఇండియన్ బ్యాట‌ర్లు పాక్ కు స‌మాధానం ఇచ్చారు.

రోహిత్ మొద‌ట్లోనే ఔట్ అయినా గిల్ చూడ‌చ‌క్క‌ని షాట్లు ఆడాడు. ప్ర‌త్యేకించి ష‌హీన్ షా అఫ్రిదీ ఓవ‌ర్లో గిల్ ఆట‌తీరు అతడి బ్యాటింగ్ నైపుణ్యాన్ని చాటింది. ఆ త‌ర్వాత గిల్ ఔట్ అయినా, విరాట్- శ్రేయ‌స్ అయ్య‌ర్ ద్వ‌యం టీమిండియాను విజ‌య‌పుటంచుల వ‌ర‌కూ తీసుకొచ్చింది. ఆ ద‌శ‌లో అయ్య‌ర్ ఔట్ అయినా, విరాట్ విన్నింగ్ షాట్ తో టీమిండియా విజ‌య‌పు లాంఛ‌నాన్ని పూర్తి చేశాడు.

కెరీర్ లో విరాట్ కు ఇది 51వ సెంచ‌రీ. అలాగే ఈ మ్యాచ్ తో వ‌న్డేల్లో 14 వేల ప‌రుగుల‌ను పూర్తి చేసుకోవ‌డంతో పాటు అత్య‌ధిక ప‌రుగుల విష‌యంలో రికీ పాంటింగ్ ను విరాట్ దాటేశాడు. ఇక శ్రీలంక‌న్ బ్యాటర్ సంగ‌కర‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ మాత్ర‌మే విరాట్ క‌న్నా ముందున్నారు అత్య‌ధిక ప‌రుగుల విష‌యంలో. వీరిలో సంగ‌క‌ర రికార్డును విరాట్ అధిగ‌మించే అవ‌కాశం ఉంది. స‌చిన్ అత్య‌ధిక ప‌రుగుల రికార్డు మాత్రం విరాట్ కు అందక‌పోవ‌చ్చు ఇత‌డి వ‌య‌సు, ఫామ్ ను బ‌ట్టి చూస్తే!

4 Replies to “పాక్ కు ఆతిథ్యం ఆనందం ఆవిరి!”

Comments are closed.