బాబ్బాబు.. అసెంబ్లీకి వెళ్లండి.. బతిమిలాడుకున్న బాబు

నేను సీఎంగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానంటూ సవాల్ విసిరారు బాబు. మేము కూడా మా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలోకి వస్తామంటూ వంత పాడారు టీడీపీ ఎమ్మెల్యేలు. తీరా ఇప్పుడు బాబు సీఎం…

నేను సీఎంగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానంటూ సవాల్ విసిరారు బాబు. మేము కూడా మా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలోకి వస్తామంటూ వంత పాడారు టీడీపీ ఎమ్మెల్యేలు. తీరా ఇప్పుడు బాబు సీఎం కాలేదు, ఎన్నికలు కూడా దగ్గర్లో లేవు, కానీ అసెంబ్లీకి టీడీపీ బ్యాచ్ వస్తానంటోంది. 

అవమాన భారం తగ్గలేదు కాబట్టి బాబు రానంటున్నారు. మీరు రాకపోతే మేమెందుకు దండగ అంటూ టీడీపీ బ్యాచ్ మారాం చేస్తోంది. అయితే బతిమిలాడి మరీ వాళ్లని అసెంబ్లీకి పంపుతున్నారట బాబు. పోలిట్ బ్యూరోలో తెగేసి చెప్పినా.. టీడీపీఎల్పీ నాటికి నిర్ణయం మారడం వెనక కారణం అదే.

గత పొలిట్ బ్యూటో మీటింగ్ నాటి సంగతి

చంద్రబాబు అసెంబ్లీకి రారు, కానీ ప్రభుత్వాన్ని సభలో ఇరుకున పెట్టే అవకాశాన్ని టీడీపీ వదులుకోకూడదు. ఇదీ ఆ పార్టీ స్ట్రాటజీ. అందుకే చంద్రబాబు లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేందుకు రెడీ అయ్యారు. వాస్తవానికి బాబు లేకుండా టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. వెళ్లినా పెద్ద ఉపయోగం లేదనేది వారి ఆలోచన. 

సభలో వైసీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేరు, అలాగని  బాబు పోరు తట్టుకోలేరు. అందుకే పోలిట్ బ్యూరో మీటింగ్ లో బాబు లేకుండా సభకు వెళ్లబోమని తెగేసి చెప్పారు. ఒక దశలో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ.. పోలిట్ బ్యూరో మీటింగ్ లో ఎవ్వరూ ఆయన మాట వినలేదు.

కానీ తర్వాత టీడీఎల్పీ మీటింగ్ నాటికి పరిస్థితి చక్కబడింది. పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు సభ్యుల్ని బుజ్జగించారట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  సభకు రావాల్సిందేనన్నారట. బాబుగారు లేరు కదా మేమెందుకు అనేది వారి దగ్గర్నుంచి వచ్చిన సమాధానం. కానీ చివరకు బాబే అందర్నీ బుజ్జగించారట.

హైకోర్టు తీర్పుని అడ్డు పెట్టుకుని చెలరేగిపోండి, వివేకా హత్య కేసు విషయంలో రచ్చ చేయండి అంటూ నూరిపోశారు చంద్రబాబు. అలా బాబు బుజ్జగింపులతో టీడీపీ సైన్యం అసెంబ్లీకి చేరుకుంటోంది. బడ్జెట్ సమావేశాలయ్యేంత వరకు ఓపిక పడతారా.. లేక ఎవరి దారి వారు చూసుకుని వాకవుట్ లతో నెట్టుకొస్తారో చూడాలి.