డిసెంబర్ 31 రాత్రి.. అంతా గప్ చుప్

డిసెంబర్ 31 రాత్రి.. కుర్రకారుకు సందడే సందడి. హైదరాబాద్ లో పబ్స్, రెస్టారెంట్స్ కిటకిటలాడుతాయి. ట్యాంక్ బండ్ తో పాటు దాదాపు అన్ని హ్యాంగ్-అవుట్స్ కళకళలాడుతాయి. రిసార్ట్స్ అన్నీ అడ్వాన్స్ గా ముందే బుక్…

డిసెంబర్ 31 రాత్రి.. కుర్రకారుకు సందడే సందడి. హైదరాబాద్ లో పబ్స్, రెస్టారెంట్స్ కిటకిటలాడుతాయి. ట్యాంక్ బండ్ తో పాటు దాదాపు అన్ని హ్యాంగ్-అవుట్స్ కళకళలాడుతాయి. రిసార్ట్స్ అన్నీ అడ్వాన్స్ గా ముందే బుక్ అయిపోతాయి. కానీ ఈసారి అవన్నీ కట్. మరో 6 రోజుల్లో రాబోతున్న న్యూ ఇయర్ వేడుకల్ని పూర్తిస్థాయిలో నిషేధించినట్టు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

కేవలం పబ్స్, రిసార్ట్స్, మల్టీప్లెక్సులు మాత్రమే కాదు.. చివరికి గేటెడ్ కమ్యూనిటీస్, చిన్న చిన్న అపార్టమెంట్లలో కూడా సంబరాలు నిషిద్ధం అంటూ విస్పస్టంగా ప్రకటించారు పోలీసులు. 31 రాత్రి సిటీ అంతా పోలీసులు పహారా కాస్తారని, ఎక్కడైనా న్యూ ఇయర్ వేడుకలు జరిగినట్టు తెలిస్తే వెంటనే సదరు పబ్ లేదా అపార్ట్ మెంట్ పై కేసు పెడతామని హెచ్చరికలు జారీచేశారు.

హైదరాబాద్ లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదతున్నాయి. దీనికితోడు కొత్త రకం కరోనా వైరస్ (కరోనా స్ట్రెయిన్) ఒకటి అధికారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిటన్ లో జన్యుమార్పిడికి గురైన ఈ కొత్త రకం కరోనా వైరస్ ను కనుగొన్న తర్వాత.. అక్కడ్నుంచి హైదరాబాద్ కు ఏకంగా 800 మంది వచ్చారు.

వీళ్లందరికీ ఇంకా పూర్తిస్థాయిలో పరీక్షలు చేయలేదు. కొంతమంది జాడ కూడా కనుక్కోలేకపోయారు.

మరోవైపు పరీక్షల్లో మ్యూటెటెడ్ వైరస్ అవునా కాదా అనే విషయం కూడా తేలలేదు. ఇలాంటి టైమ్ లో న్యూ ఇయర్ పార్టీలకు అనుమతి ఇస్తే, కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. అందుకే తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు.

సో.. ఈసారి డిసెంబర్ 31 రాత్రికి హైదరాబాద్ అంతా గప్ చుప్. ఎవరింట్లో వాళ్లు తిని పడుకోవడం మంచిది. తెగించి ఎవరైనా బయటకొస్తే మాత్రం ఉపేక్షించేది లేదని పోలీసులు గట్టిగా చెబుతున్నారు.