చిరుతిళ్ళ మీద రాతలేంటి… మరీ అంత చీప్ గా….?

పెదబాబు, చినబాబుల మీద ఒక రేంజిలో విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్. టీడీపీ ఏలుబడిలో  చిరు తిళ్ళకు పాతిక లక్షలు ఖర్చు అయిందని తప్పుడు రాతలు రాశారంటూ ఒక మీడియా మీద…

పెదబాబు, చినబాబుల మీద ఒక రేంజిలో విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్. టీడీపీ ఏలుబడిలో  చిరు తిళ్ళకు పాతిక లక్షలు ఖర్చు అయిందని తప్పుడు రాతలు రాశారంటూ ఒక మీడియా మీద ఆగ్రహించి పరువు నష్టం దావా వేశారు లోకేష్ బాబు. ఇక దాని మీద విశాఖ కోర్టుకు వచ్చిన తరువాత పనిలో పనిగా  వైసీపీ పెద్దల మీద కూడా ఘాటు విమర్శలు చేస్తున్నారు.

మరి దానికి ధీటుగా గుడివాడ బదులిచ్చారు. చిరుతిళ్ళ మీద రాతలేంటి, మరీ అంత చీప్ గానా అని చినబాబు తెగ ఫీల్ అవుతున్నట్లున్నారు అని గుడివాడ సెటైర్లు వేశారు. ఏకంగా ఏపీనీ లూటీ చేసిన వారిని పాతిక లక్షల చిరు తిళ్ళకే పరిమితం చేస్తే బాధగా ఉండదా అని ఎకసెక్కమాడారు. టీడీపీ పాలనలో ఏపీలో లక్షల కోట్ల లెక్కన భారీ ఎత్తున లూటీ జరిగితే మరీ బొత్తిగా పాతిక లక్షలు అంటూ రాయడం తమను తక్కువ చేసి చేయడమేంటనన్నదే టీడీపీ పెద్దల బాధని గ‌ట్టిగానే విరుచుకుపడ్డారు.

టీడీపీ వారు ఏపీని అన్ని విధాలుగా నాశనం చేశారని గుడివాడ విమర్శలు చేశారు. విశాఖ భూములను టీడీపీ ఏలుబడిలో కబ్జా చేశారని అన్నారు. ఇక విశాఖలో పెట్టుబడుల సదస్సుల పేరు చెప్పి జనాలను మభ్యపెట్టారని, దుబాయ్ సింగపూర్, దావోస్ అంటూ దేశాలు తిరిగి బాబులు ఇద్దరూ ఏపీకి తెచ్చిన పెట్టుబడులేంటని కూడా గుడివాడ  నిలదీశారు.

చంద్రబాబు, లోకేష్ ముఖాలు చూసి ఏపీలో పెట్టుబడులు ఎవరు పెట్టారో కూడా చెప్పాలని గుడివాడ డిమాండ్ చేశారు. ఇక చిరుతిళ్ళకు పాతిక లక్షల బిల్లు పెట్టారని ఒక పత్రిక రాస్తే అది తప్పుడు వార్త అని లోకేష్ కేసు పెట్టారని గుడివాడ అన్నారు. పైగా ఆ టైమ్ లో తాను దేశంలోనే లేనని ఎవరిని మభ్యపెట్టడానికి చెబుతున్నారని ప్రశ్నించారు. ఇక ఇలా తిని అలా బిల్లు పెట్టేయడానికి ఇదేమీ హెరిటేజ్ సూపర్ మార్కెట్ కాదని కూడా ఎద్దేవా చేశారు. అన్నీ చూసుకునే బిల్లులు పెడతారని, ఆ మాత్రం తెలియదా అని గుడివాడ ప్రశ్నించారు.

ఒక జగన్ కి విశాఖలో అరుదైన గౌరవం లభించిందని, ఏకంగా 39 దేశలకు చెందిన వారి నుంచి గొప్ప గౌరవం మిలాన్ సందర్భంగా దక్కిందని, ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ విమానాన్ని జగన్ జాతికి అంకితం చేశారని గుడివాడ చెప్పారు. పద్నాలుగేళ్ళ సీఎం అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇలాంటి గౌరవం ఎపుడైనా దక్కిందా కనీసం ఒక బోటును అయినా ఆయన జాతికి అంకితం చేశారా అని గుడివాడ అన్నారు.

పోనీ 39 దేశాలు కాదు, కనీసం 39 గ్రామాల వారి నుంచి అయిన గౌరవ వందనం బాబుకు దొరికిందా అని ప్రశ్నించారు. మొత్తానికి పరువు నష్టం దావా పేరిట వరసగా విశాఖ టూర్లు చేస్తూ వైసీపీ మీద కామెంట్స్ చేస్తున్న లోకేష్ బాబుకు గుడివాడ గట్టిగానే రివర్స్ పంచులు వేశారు. మరి దీనికి తమ్ముళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో మరి.