సాఫ్ట్ మూవీస్ చేసిన ప్రతిసారి సుమంత్ సక్సెస్ అయ్యాడు. గోదావరి, మళ్లీ రావా సినిమాలు అతడి కెరీర్ లో బెస్ట్ మూవీస్ గా నిలిచాయి. అలాంటి సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కిన తాజా చిత్రం “మళ్లీ మొదలైంది”తో మరోసారి హిట్ కొట్టాడు ఈ హీరో. అవును.. జీ5 లో నేరుగా స్ట్రీమింగ్ కొచ్చిన ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది.
బాక్సాఫీస్ లో విడుదలైన సినిమా హిట్టయిందో లేదో చెప్పడానికి కలెక్షన్లు కొలమానంగా ఉంటాయి. అయితే నేరుగా ఓటీటీలో రిలీజైన సినిమాకు మాత్రం ఇలాంటి లెక్కలు లేవు. ఎంతమంది చూశారు, సబ్ స్క్రైబర్లు ఎంతమంది పెరిగారనేదే కొలమానం. ఈ లెక్కల్ని ఇప్పుడిప్పుడే ఓటీటీ సంస్థలు బయటపెడుతున్నాయి. అలా 'మళ్లీ మొదలైంది' సినిమాను విడుదలైన తొలి రోజు 5 కోట్ల నిమిషాల పాటు నెటిజన్లు చూశారంటూ ప్రకటన విడుదల చేసింది జీ5.
సుమంత్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చిన రోజు నుంచి చూసుకుంటే.. జీ5కు సబ్ స్క్రైబర్లు తెలుగు మార్కెట్ నుంచి 2 లక్షల మందికి పైగా పెరిగారంట. ఇలా చూసుకున్నా సుమంత్ సినిమా ఓటీటీలో సక్సెస్ అయినట్టే లెక్క.
ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను అటుఇటుగా 4 కోట్ల 60 లక్షల రూపాయలకు దక్కించుకుంది జీ గ్రూప్ సంస్థ. ఎన్ని గంటల పాటు నెటిజన్లు ఈ సినిమాను చూశారు, ఎంత మంది వినియోగదారులు పెరిగారు అనే లెక్కల్ని చూసుకుంటే.. ఆ ఛానెల్ కు ఇది ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకుంది.