గతంలో టికెట్ రేట్ల విషయంలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ అందరికీ గుర్తే. ఆయన చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల టికెట్ రేట్ల అంశం మరింత వివాదాస్పదమైంది. ఇప్పుడిప్పుడే అది ఓ కొలిక్కి వస్తోంది. అంతలోనే మరోసారి కెలికారు పవన్. ఈసారి తన సినిమాతో రిలీజ్ డేట్స్ విషయంలో సందిగ్దత నెలకొనేలా చేశారు. అదే భీమ్లానాయక్.
భీమ్లానాయక్ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకున్నారు. కుదరకపోతే ఏప్రిల్ 1కి వస్తామన్నారు. అదే 25వ తేదీకి ఆడవాళ్లు మీకు జోహార్లు, గని సినిమాల్ని కూడా షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు. భీమ్లా రాకపోతే వద్దామనేది వీళ్ల ఆలోచన. ఎప్పటికప్పుడు భీమ్లా నిర్మాతలతో వాళ్లు టచ్ లో ఉన్నారు కూడా.
మరోవైపు ఏపీలో కర్ఫ్యూ ఎత్తేశారు. థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీ కూడా వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత కూడా శర్వానంద్, వరుణ్ తేజ్ నిర్మాతలు, భీమ్లా యూనిట్ తో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గని నిర్మాతలైతే పూర్తి స్పష్టత తీసుకున్న తర్వాతే మరోసారి నిన్న ఉదయం పోస్టర్ రిలీజ్ చేశారు.
కానీ ఆశ్చర్యకరంగా రాత్రికిరాత్రి నిర్ణయం మారిపోయింది. భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25కే వస్తోందంటూ, రాత్రికిరాత్రి పోస్టర్ వదిలారు. దీంతో గని నిర్మాతలు షాక్. వరుణ్ తేజ్, పవన్, గని నిర్మాత అల్లు బాబి అంతా కుటుంబ సభ్యులే. అయినా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటో అర్థం కాదు.
వీళ్లకే ఇలా ఉందంటే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' యూనిట్ పరిస్థితి మరీ దారుణం. వాళ్లు డేట్ వేయడంతో పాటు ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఏకంగా హీరో శర్వానంద్ రంగంలోకి దిగి ప్రచారం స్టార్ట్ చేశాడు. వీళ్లందరి ప్లానింగ్స్ ను ఒక్క రాత్రితో మార్చేశాడు భీమ్లానాయక్.
గని సినిమా ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మరో వాయిదా అంటే వాళ్లకు నరకప్రాయమే. కానీ తప్పదు. అటు శర్వాకు అర్జెంట్ గా హిట్ కావాలి. ఇలాంటి టైమ్ లో కోరి భీమ్లాకు పోటీగా తమ సినిమాను వదల్లేరు. రాత్రి వచ్చిన ఒకే ఒక్క పోస్టర్ తో అంతా అస్తవ్యస్థమైంది.