అగ్ని కీల‌ల్లో భార‌తీయ వార‌స‌త్వ క్ల‌బ్‌…

సికింద్రాబాద్‌లో బ్రిటీష్ కాలం నాటి క్ల‌బ్‌లో ఇవాళ తెల్ల‌వారుజామున భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ క్ల‌బ్‌కు చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. ప‌ది అగ్నిమాప‌క యంత్రాల ద్వారా మంట‌ల‌ను ఆర్పేందుకు దాదాపు మూడు గంట‌ల…

సికింద్రాబాద్‌లో బ్రిటీష్ కాలం నాటి క్ల‌బ్‌లో ఇవాళ తెల్ల‌వారుజామున భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ క్ల‌బ్‌కు చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. ప‌ది అగ్నిమాప‌క యంత్రాల ద్వారా మంట‌ల‌ను ఆర్పేందుకు దాదాపు మూడు గంట‌ల పాటు ప్ర‌య‌త్నించినా అదుపులోకి రాలేదు. దీంతో కోట్లాది రూపాయ‌ల ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్టు స‌మాచారం.

సికింద్రాబాద్‌లో 20 ఎక‌రాల స్థ‌లంలో ఈ క్ల‌బ్‌ను నిర్మించారు. అది కూడా బ్రిటీష్ పాల‌న‌లో కావ‌డం గ‌మ‌నార్హం. 1878లో మ‌న‌ల్ని బ్రిటీష్ పాల‌కులు ప‌రిపాలించే కాలంలో మిల‌ట‌రీ అధికారుల కోసం ఈ క్ల‌బ్ నిర్మాణాన్ని చేప‌ట్టారు. అనంత‌ర కాలంలో దీన్ని భార‌త ప్ర‌భుత్వం వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తించింది. ఈ నేప‌థ్యంలో 2017లో పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

ఈ క్ల‌బ్‌లో దాదాపు 5 వేల మంది స‌భ్య‌త్వం తీసుకున్నారు. అలాగే 300 మంది సిబ్బంది ప‌నిచేస్తున్న ఈ క్ల‌బ్‌లో ఆదివారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు.

ప‌ది అగ్నిమాప‌క యంత్రాల‌తో వ‌చ్చి మూడు గంట‌ల పాటు మంట‌ల‌ను ఆర్పేందుకు శ్ర‌మించినా ఫ‌లితం లేక‌పోయింది. అగ్ని కీల‌ల్లో భార‌త వార‌స‌త్వ సంప‌దైన క్ల‌బ్ పూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ.20 కోట్ల ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్టు స‌మాచారం. ఘ‌ట‌న‌కు కార‌ణ‌లేంటో తెలియాల్సి వుంది.