చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు చట్టం రూపం దాల్చకుండా నీరుగారిపోవడం దశాబ్దానికి పైగా అదే దుస్థితిలో పడి ఉండడం అనేది కేవలం కాంగ్రెసు పాపం. ఈ సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు. అయితే.. కాంగ్రెస్ పార్టీ ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేస్తున్నట్టుగా సరికొత్తగా మళ్లీ ఇదే హామీని రాయపూర్ ప్లీనరీ వేదికగా ప్రకటిస్తున్నది. చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉన్నదని కాంగ్రెస్ ప్రకటించింది.
రాజకీయ నాయకుల మాటలు ఎంత మాయగా, అబద్ధంగా ఉంటాయనడానికి ఇదొక ఉదాహరణ. గతంలో వారి చేతిలో అధికారం ఉన్నప్పుడు.. సభలోకి బిల్లు తీసుకువచ్చింది. తమ మిత్రపక్షాలే దానిని అడ్డుకుంటూ ఉండగా.. వారికి సర్ది చెప్పలేని అసమర్థత కాంగ్రెస్ పార్టీది. పార్టీ సర్వనాశనం అయిపోయాక.. మళ్లీ అధికారం మీద యావతో.. తాము తప్ప సంకీర్ణానికి కూడా సారథ్యం వహించగల మహానుభావులు మరొకరు లేరని టముకు వేసుకుంటున్న కాంగ్రెస్.. ఇప్పుడు అదే 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును తెరమీదకు తెస్తోంది.
‘కట్టుబడి ఉంటాం’ అంటే అర్థం ఏమిటి? ఇలాంటి సభలలో హామీలు దంచేప్పుడు చాలా తియ్యగా ఈ నాయకులు ప్రకటిస్తారు. తీరా తాము అధికారంలోకి రాగానే.. దాన్ని ఎగ్గొట్టడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్వేషిస్తారు. మా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరొకరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసి ఉంటే తప్పకుండా చట్టం తెచ్చేవాళ్లం.. ఇప్పుడు మా చేతులు కట్టేసినట్టుగా ఉంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు.
ఒకసారి ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత.. ఆ మాట నెరవేర్చేట్లయితేనే తాము సంకీర్ణంలో ఉంటాం అని.. లేకపోతే తమకు సంకీర్ణ అధికారం కూడా అక్కర్లేదని చెప్పగల ధైర్యం, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా అనేది పెద్ద ప్రశ్న. ఉంటే అలా చేయగలం అనే సంగతి ఇప్పుడే ప్రకటించాలి.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాజ్యాంగ సవరణకు సభ ఆమోదం పొందిన తర్వాత గానీ అమల్లోకి రాదు. కానీ కాంగ్రెసు పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే.. ఎన్నికల సమయంలోనే తమ పార్టీ తరఫున ఇచ్చే చట్టసభల టికెట్లలో 33 శాతం మహిళలకే కేటాయించాలి. వారు ఓడుతారా? గెలుస్తారా? అనేది తర్వాతి సంగతి. కనీసం ఆ బిల్లు పట్ల తమకు నమ్మకం ఉందని, దాన్ని పాటించే ఉద్దేశం ఉన్నదని ప్రపంచానికి చాటినట్టు ఉంటుంది.
పార్టీ పదవుల్లో, టికెట్లు పొందడంలో యాభయ్యేళ్లు దాటని వాళ్లు యాభై శాతం ఉండాలి.. లాంటి, వారు ఎప్పటికీ ఆచరించబోని, చిలకపలుకులు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ రకమైన నిబంధనతో మహిళా బిల్లు పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటుందా? చూడాలి. అలాచేయకుండా.. పసలేని హామీలు ఎన్ని గుప్పించినా ఆ పార్టీని ప్రజలు నమ్మరు. అందుకే.. ఎప్పటికీ తిరిగి కోలుకోలేనంత పాతాళంలోకి పడిపోయింది.