అరుదైన హోదా.. అయినా తీరని బాధ…?

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అందరికీ గౌరవం ఉంది. గొప్ప పరిశ్రమ అన్న మర్యాద కూడా ఉంది. అందుకే వరసబెట్టి ప్లాంట్ కి అవార్డులు వస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చినవి ఒక ఎత్తు అయితే కేంద్రం…

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అందరికీ గౌరవం ఉంది. గొప్ప పరిశ్రమ అన్న మర్యాద కూడా ఉంది. అందుకే వరసబెట్టి ప్లాంట్ కి అవార్డులు వస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చినవి ఒక ఎత్తు అయితే కేంద్రం ప్రైవేటీకరణ అంటూ ప్రకటనలు చేస్తున్న తరుణంలో కూడా ఎన్నో మన్ననలు ప్లాంట్ కి దక్కడమే విశేషం.

ఒక వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ తనను తాను రుజువు చేసుకుంటూ గతంలోని తన రికార్డులను తానే బద్ధలు కొడుతూ ఉత్పత్తిలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇపుడు వాణిజ్యపరంగా కూడా కొత్త గౌరవం స్టీల్ ప్లాంట్ కి దక్కింది. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఫోర్ స్టార్ ఎక్స్ పోర్ట్ హౌస్ హోదా లభించింది. ఈ హోదా దక్కడానికి కారణం ప్లాంట్ కనబరచిన ఉత్తమ పనితీరు. రెండేళ్ల పాటు వరసగా విశాఖ  ప్లాంట్ 500 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఎగుమతులు చేసింది. దాంతో ఈ హోదాను అందుకుంది.

ఈ విధంగా దేశంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ అరుదైన హోదాను దక్కించుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి లేఖను పంపించారు. ఈ హోదా 2026 అక్టోబర్ 21 వరకూ విశాఖ ప్లాంట్ కి ఉంటుందని ఆ లేఖలో అధికారులు పేర్కొన్నారు.

మరి ఇన్ని అవార్డులు హోదాలు దక్కుతున్నాయి, వీటిని చూసైన ప్రైవేటీకరణ బాధ నుంచి విశాఖ ప్లాంట్ ని తప్పించాలని కార్మిక సంఘాలు కేంద్ర పెద్దలను కోరుకుంటున్నాయి. ప్రైవేట్ కత్తి మెడ మీద వేలాడుతున్నంతసేపూ ఇలాంటి హోదాలు ఎన్ని వచ్చినా ఆ ఆనందాన్ని తాము అనుభవించలేమని కూడా కార్మిక నేతలు చెబుతున్నారు. 

అసలైన హోదా ఏంటి అంటే ప్రభుత్వ రంగంలోనే ప్లాంట్ ని కొనసాగించడమే అని చెబుతున్నారు. మరి మోడీ సర్కార్ కి ఈ మాటలు వినిపిస్తాయా.