కన్నీళ్లకూ టైమింగు..?

ఓ యిల్లాలి శీలం కేంద్రంగా ఆంధ్ర రాజకీయం జరుగుతోంది. దాన్ని ఖండిస్తూనే జరిగిన సంఘటనలను ఆవేశరహితంగా చర్చించుకోవాలి. నిజానికి యిలాటివి చర్చించకూడదు. గాలిపోగు కబుర్లను గాలిలోనే వదిలేయాలి. వల్లభనేని వంశీ విశృంఖలంగా మాట్లాడినప్పుడు మీడియా…

ఓ యిల్లాలి శీలం కేంద్రంగా ఆంధ్ర రాజకీయం జరుగుతోంది. దాన్ని ఖండిస్తూనే జరిగిన సంఘటనలను ఆవేశరహితంగా చర్చించుకోవాలి. నిజానికి యిలాటివి చర్చించకూడదు. గాలిపోగు కబుర్లను గాలిలోనే వదిలేయాలి. వల్లభనేని వంశీ విశృంఖలంగా మాట్లాడినప్పుడు మీడియా అదే పని చేసింది. కానీ బాబు మాత్రం గాల్లో పోనివ్వ దలచుకోలేదు. తాజాగా వరదబాధితుల దగ్గరా అసందర్భంగా ఆ ప్రస్తావన చేసి, తన యిల్లాలిపై వచ్చిన నిందను ప్రజలెవరూ మర్చిపోకుండా శ్రమిస్తున్నారు. అనుకోకుండా మచ్చ పడితే దాన్ని తుడిచేసుకుందామని చూస్తాం. కానీ యిక్కడ పడినది మరకైనా కాదు. మసి పూద్దామని ప్రయత్నించిన మనిషికి, అతని నోటికి వున్న గతచరిత్ర కారణంగా దాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ అందరూ దాన్ని సీరియస్‌గా తీసుకోవాలని బాబు తాపత్రయం. అందుకే అసెంబ్లీలో చేసిన వేరే వ్యాఖ్యలకు, దీనికి లింకు పెట్టి, మూసిపెట్టిన దాన్ని బయటకు తెచ్చి డిస్‌ప్లేకు, డిస్కషన్‌కు పెట్టారు. మూడు రాజధానుల బిల్లు రివర్స్ చేసిన సందడిలో పడి ప్రజలు మరిచిపోతారేమోనన్న భయంతో పదేపదే గుర్తు చేస్తున్నారు.

ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే పబ్లిగ్గా ఎన్నడూ ఏ ఎమోషనూ కనబరచని బాబు రోదించడం, అది కూడా కావలసిన టైములో, షెడ్యూల్ చేసుకున్న ఘడియలో కన్నీరు తెప్పించడం. అక్టోబరు 22న వంశీ అవాచ్యాలు పలకగానే పౌరుషం పొడుచుకుని వచ్చి, బయటకు ఉబికి రావలసిన కన్నీరు దాదాపు నెల రోజులు ఆగి, స్థానిక ఎన్నికల ఆశలు ‘కుప్ప’కూలాక జరిగిన నవంబరు 19నాటి అసెంబ్లీ సమావేశంలో చర్చ ముగించుకుని బయటకు వచ్చిన తర్వాతనే, ప్రెస్‌మీట్‌లో టీవీ కెమెరాల ముందు మాత్రమే – తన్నుకు రావడం! ఇది అంతరంగం లోంచి పొంగిన పాతాళగంగ కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టేసి, అవసరమైనప్పుడు విప్పగల కొళాయి గంగ!

భువనేశ్వరిగారి వ్యవహారంలో మనం గమనించవలసిన దేమిటంటే – నందమూరి వారి ఆడపడుచు ఒక్కరే కాదు, ప్రపంచంలోని ఆడవారందరూ యీ తరహా బాధితులే. ఎవర్నయినా సరే తిట్టాలంటే వాళ్ల యింట్లో ఆడవాళ్ల జోలికి వెళతారు. మార్కులేయని టీచరు, ఆఫీసుకి ఆలస్యంగా వచ్చావేమని మందలించిన ఆఫీసరు, ఆశలు వమ్ము చేసిన అభిమాన హీరో, వేగంగా వెళ్లడానికి వీలు లేకుండా అడ్డు వచ్చిన పాదచారి, వీరే కాదు, ఏ నరమానవుడైనా సరే అవతలివాడి నోట్లో అతని తల్లి, చెల్లి, భార్య శీలానికి గ్యారంటీ లేదు. మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని.. ఎంత ఉన్నతి పదవిలో ఉన్నా సరే యీ ‘సత్కారం’ తప్పదు. వారి కుటుంబసభ్యులకు యీ ‘అక్యుపేషనల్ హజార్డ్’ తప్పదు. చిత్రమేమిటంటే ఆడవాళ్లు కూడా తిట్టడానికి యిదే ధోరణి అవలంబిస్తారు – లం-కొడుకు, లం-కూతురు.. యివి సర్వసాధారణంగా వాడే పదాలు. ఏ దేశమెళ్లి చూసినా భాష మారుతుంది కానీ భావం యిదే! తిట్లను సరిదిద్దకపోతే మనుషుల సంస్కారంలో మార్పు తేలేము.

ఈ తిట్లు ఆలోచనారహితంగా వాడేవి కాబట్టి, ఎవరూ పట్టించుకోరు. కానీ స్పెసిఫిక్‌గా ఒక వ్యక్తిని ఉద్దేశించి వేసే నిందలు సంబంధీకులకు బాధ కలిగిస్తాయి. మహా సాధ్వి, అయోనిజ సీతామ్మవారికి కూడా యిది తప్పలేదు. ఇటీవల జాతీయనాయకుల వ్యక్తిగత జీవితాలపై నిరాధారంగా నిందలు వేయడం ఎక్కువై పోయింది. ముఖ్యంగా నెహ్రూ గురించి ఒక వర్గం పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది. ఆయన తండ్రి, తల్లి ఎవర్నీ వదిలిపెట్టడం లేదు. ఈ మధ్య గాంధీని కూడా పట్టించారు. ఆయన తల్లిని కొంతకాలం ఒకరి దగ్గర తాకట్టు పెట్టారనే కట్టుకథ కూడా వాట్సాప్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక వెబ్‌సైట్‌లలో సినిమా సమీక్షకుల, వ్యాసకర్తల భార్యల గురించి కొందరు పాఠకులు చేసే వ్యాఖ్యలకు అడ్డూ, అదుపూ లేదు. సోషల్ మీడియా చూడబోతే పాతాళమే హద్దురా అన్నట్లుంది. ఇక్కడ గమనించ వలసిన దేమిటంటే, నింద దారి నిందదే, వ్యక్తులు పొందే గౌరవం దారి గౌరవందే. సీత గురించి ఒక తాగుబోతు ఏదో అన్నాడని తెలిసినా, మనం తరతరాలుగా సీతను కొలుస్తూనే వున్నాం. గాంధీ, నెహ్రూలను గౌరవిస్తూనే వున్నాం. ఇప్పుడేదో ఒక వదరుబోతు ఒక యిల్లాలి గురించి నిరాధారంగా మాట్లాడాడని ఆవిణ్ని గౌరవించకుండా వుండము.

జీవితంలో అన్ని రంగాల్లో వున్న యీ రొచ్చు రాజకీయాల్లోనూ వుంది. రాజకీయ ప్రత్యర్థి భార్యపై బురద చల్లడం1969 తెలంగాణ ఉద్యమంలోనే కనబడింది. విభజనోద్యమాన్ని కట్టడి చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిగారి భార్య రాఘవమ్మ గారి గురించి బూతులు హైదరాబాదు గోడలపై కనబడ్డాయి. ఆవిడే కాదు, ఆంధ్ర మహిళలందరినీ ఏం చేయాలో కూడా గోడల మీద రాశారు. ఉద్యమనేత, బ్రహ్మానందరెడ్డికి అప్పటిదాకా సహచరుడు ఐన చెన్నారెడ్డి కానీ, వేరెవరు కానీ ఆ రాతలను ఖండించలేదు. కెసియార్ నడిపిన మలి ఉద్యమంలో ఆంధ్రుల రాక్షసమూలాల గురించి, తిండి క్వాలిటీ గురించి చాలా మాట్లాడాడు కానీ ఆడవాళ్ల జోలికి వెళ్లలేదు. దశాబ్దాలు గడుస్తున్నకొద్దీ అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కానీ లైబ్రరీలో చదువుకుని వచ్చి ఏ విషయంపైనయినా సాధికారంగా మాట్లాడేవారికి గిరాకీ లేకుండా పోయింది. మైకులు విరిచేవారికి, వెల్‌లో దూసుకుపోయేవారికి, బిల్లు కాగితాలు చింపి స్పీకరు మీద పోసేవారికి, తిట్టేవారికి, తీవ్ర ఆరోపణలు చేసేవారికి కవరేజి రాసాగింది. దాంతో ఎవరెంత రౌడీయిజం చూపితే వారే నాయకులుగా గుర్తింపు పొందసాగారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే యీ జబ్బు 40 ఏళ్ల క్రితమే కనబడింది. నాదెండ్ల భాస్కరరావు వర్గంలోకి చేరిన నన్నపనేని రాజకుమారి, గ్రంధి మాధవి, మరో మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీ ఫ్లోర్‌పై ఎన్టీయార్‌పై తిట్లు వర్షించారు. వీళ్లంతా ఎన్టీయార్ స్వయంగా ఎంపిక చేసినవారే! తర్వాత నన్నపనేని కాంగ్రెసులో చేరి, చంద్రబాబుపై అసెంబ్లీ బయట తిట్ల వర్షం కురిపించారు. భువనేశ్వరిని ఉద్దేశించి ‘ఎలా భరిస్తున్నావు నీ భర్త దుర్గంధాన్ని?’ అంటూ బహిరంగంగా మాట్లాడారు. పార్టీలన్నీ ఒక త్రాటిపై నిలిచి అలాటి నోటిదురద బ్యాచ్‌ని రాజకీయాల్లో నుంచి తప్పించి వుంటే, తక్కినవారికి హెచ్చరికగా వుండేది. కానీ ఆమెను బాబు టిడిపిలో చేర్చుకుని పార్టీ ప్రతినిథిగా ప్రోత్సహిస్తూ వచ్చారు. తను ఆంధ్రకు ముఖ్యమంత్రి అయ్యాక మహిళా కమిషన్ చైర్‌పెర్శన్‌ను చేశారు! వీళ్లకు దక్కిన ప్రాధాన్యత చూసి, అసెంబ్లీలోనూ, బయటా అవతలి పార్టీ వాళ్లని ఎంత దుర్భాషలాడితే అధినాయకుడి దగ్గర అంత మెప్పు దొరుకుందని మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారు. వద్దని వారించిన నాయకుడు లేడు.

మహిళాగౌరవం గురించి యీరోజు యింత మాట్లాడుతున్న బాబు లక్ష్మీపార్వతి విషయంలో ఏం చేశారు? ఆవిడ తనకు సవతి అత్తగారు, కుటుంబ సభ్యురాలు, తన నాయకుడి భార్య, 1994 ఎన్నికలలో తన పార్టీ గెలవడానికి ప్రచారం చేసిన మనిషి. ఆవిడ గురించి తన వర్గం ఎమ్మెల్యేలు ఎన్ని రకాలుగా మాట్లాడారు? ఈయన వారించారా? నందమూరి వంశప్రతిష్ఠ గురించి యింత చెప్పుకుంటున్నారే! ఎన్టీయార్‌ని తిట్టిపోసిన, ఆయనపై చెప్పులు విసిరిన వారిని వెతికి పట్టుకుని దండించారా? వారి ఉనికి బయటపెట్టి పార్టీలోంచి బయటకు పంపారా? గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గర్నుంచి అందరూ యిప్పటికీ ‘చెప్పులు ఎవరో వేశారు, ఎవరో వేశారు’ అంటారు. ఎవరో ఒకరు వేశారనీ, అవి గాలిలో తమంతట తాము ఎగిరి రాలేదని అందరికీ తెలుసు. సమస్తవిషయాలు నాకు తెలుసు అని చెప్పుకునే బాబు, ఆంధ్రుల అభిమాన నాయకుడిపై యింతటి అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులను ఐడెంటిఫై చేయలేక పోయారా?

ఈనాడు రోజా నోటిదురుసు గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆమెకు దానిలో తర్ఫీదు యిచ్చినది బాబు కాదా? టిడిపిలో వుండగా మహిళా విభాగానికి అధినేతగా చేసి, ఫైర్ బ్రాండ్ అనే విశేషణాలు తగిలించి, చిరంజీవిపై, పవన్ కళ్యాణ్‌పై అసభ్యవ్యాఖ్యలు చేయించలేదా? చివరకు తొండ ముదిరి, ఊసరవెల్లి అయి, అటువైపు గెంతి చంద్రబాబునే కామ (కాల్ మనీ అని తన భావమని చెప్పుకుందావిడ) ముఖ్యమంత్రి అనేదాకా పోయింది. ఆమెను నానారకాలుగా టిడిపి ఎమ్మెల్యేలు గోల చేశారు. వారిని వారించలేదు కాబట్టి అది బాబుకి ఆమోదయోగ్యమే అనుకోవాలి. అసభ్యకర అపహాస్యానికి పేరుబడిన జబర్దస్త్ ప్రోగ్రాంకు నిర్ణేతగా వెళ్లినందుకే రోజాను గేలి చేస్తే, రోజూ ఆ ప్రోగ్రాంను ప్రేక్షకులకు చూపిస్తున్న టీవీ ఛానెల్‌ను ఏమనాలి? అది టిడిపివారికి తోచదు. ఎందుకంటే అది అస్మదీయ ఛానెల్.

పోసాని కృష్ణమురళి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు – ‘నాకు బాబు చేసిన డెవలప్‌మెంట్ చూసి చాలా ముచ్చటేసింది. పార్టీలో చేరకపోయినా నా సొంత డబ్బుతో ఎన్నికల సమయంలో టిడిపికి ఓటేయమని యాడ్స్ యిచ్చాను. కానీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు బాబు అనుచరుడు కేశినాని నాని చిరంజీవి కుటుంబంలోని ఆడవాళ్ల గురించి చెడుగా మాట్లాడినపుడు బాబు వారించకపోవడం నాకు బాధ కలిగించింది. ఈయన్నా నేను సమర్థించింది అని బాధపడ్డాను.’ అని. చిరంజీవి కుటుంబంలోని మహిళలు రాజకీయాల్లో లేరు కదా, ఎందుకలా మాట్లాడడం అని బాబు వారించి వుంటే, పరిస్థితులు యింత భ్రష్టు పట్టేవి కావేమో! ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లనవసరం లేదు, పట్టాభి వాడిన తిట్టుకు అర్థం ఫలానా అని జగన్ వివరించగానే ‘అది పలకరింపు అనుకున్నాను, కాదు మీరు చెప్పిన అర్థమే అయితే నా సహచరుడు ఆ పదం వాడకుండా వుండాల్సింది.’ అని వుంటే హుందాగా వుండేది కదా. అలా అనలేదు. అదే మాటను వంశీ యిప్పుడు తన కొడుకు విషయంలో వాడేటప్పటికి భార్యకు అవమానం జరిగింది అని గగ్గోలు పెడుతున్నారు. మరి పట్టాభి జగన్ తల్లిని అవమానించడం న్యాయమా? కాదా? బాబే చెప్పాలి.

తోటకూర నాడే.. కథ ఎప్పటికీ రిలెవంటే! బాబు అనుభవం బట్టి జగన్ కూడా తెలుసుకోవాలి. ఈనాడు తన మంత్రులు టిడిపి వాళ్లను అనరాని మాటలంటూ వుంటే మౌనంగా వుండి వినోదిస్తున్న జగన్ రేపు యీ నాయకులే తనపై కూడా యిలాటి భాష ఉపయోగించే ప్రమాదం వుందని గుర్తెరగాలి. బొత్స వంటి వాళ్లు కాంగ్రెసులో వుండగా జగన్‌పై ఎన్ని అవాకులు, చెవాకులు మాట్లాడారు! రేపు ఓడలు బళ్లయి, వైసిపికి ఆదరణ తగ్గి అలాటివాళ్లు బయటకు వెళితే ఎలా మాట్లాడతారో ఊహించుకునే చూస్తే యిప్పుడే జాగ్రత్తపడవచ్చు. బైబిల్‌లో చెప్తాడు – ‘కత్తితో వ్యవహరించువాడు, కత్తితోనే మరణించును’ అని. ఈ డేంజరస్ గేమ్ ఆడినవాళ్లందరూ ఆ గేమ్‌కు ముందో వెనకో బలికాక తప్పదు. తను అనుకున్న రీతిగా జరగకపోతే జగన్‌పై తిరగబడిన రోజున రోజా ఎలా మాట్లాడతారో ఊహించుకోవాలంటే యీనాటి వల్లభనేని వంశీని చూస్తే చాలు. ఇలాటి దుస్థితి తనకు పట్టకూడదనుకుంటే జగన్ యిప్పణ్నుంచే తన సైన్యాన్ని అదుపులో పెట్టుకోవాలి.

ఈనాటి వివాదానికి మూలకారకుడు వంశీ (‘మాధవరెడ్డి పేరును మొదటిసారి ప్రస్తావించిన వల్లభనేని వంశీ చరిత్ర ఎవరికి తెలియదు?’ అన్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ‘కొత్త పలుకు’లో, ‘బయట కనిపించిన ప్రతి స్త్రీని చెరబట్టాలనేవారు కూడా భువనేశ్వరిపై నిందలు వేయడమా?’ అని మరోచోట రాశారు. నింద వేసినది వంశీయే కాబట్టి, వంశీ పార్టీలోంచి బయటకు వెళ్లగానే టిడిపి సోషల్ మీడియాలో యిలాటి వ్యాఖ్యలే వచ్చాయి కాబట్టి రాధాకృష్ణ ఆయన్నే ఉద్దేశించారని అనుకోవాలా?) ఏ పార్టీ ద్వారా పైకి వచ్చాడు? 2014, 2019లలో ఏ పార్టీ ఆయనకు టిక్కెట్టిచ్చి గెలిపించుకుంది? టిడిపి పెంచి పోషించిన మొక్కే కదా యిది! తమ మందలో వున్నంతవరకు శభాష్ అంటూ వచ్చారు తప్ప ఎప్పుడూ మందలించలేదు కదా! ఈ రోజు గొడవకు మూలకారణం వంశీ. ఆ విషయం చెప్పకుండా అంబటి రాంబాబును, కొడాలి నానిని, అంతిమంగా జగన్‌ను పిక్చర్‌లోకి తీసుకురావడమేమిటి?

అక్టోబరు 22న క్రితం వంశీ ఒక దారుణమైన, తలాతోకా లేని, నిరాధారమైన, అసభ్యకరమైన ఆరోపణ చేశాడు. ఆయన ఏదైనా మాట్లాడగల సమర్థుడు. తనను రాజేంద్రప్రసాద్ తిట్టారని చెప్పి, అయ్యప్ప మాల వేసుకుని వుండగానే ‘తమరు పూజ్యులు, కుబేరులు…’ అంటూ మాట్లాడిన రకం. అక్టోబరు 22న మాట్లాడినప్పుడు కూడా లోకేశ్‌కు మాధవరెడ్డికి సంబంధం కలుపుతూనే ‘మీ నాన్న చంద్రబాబు..’ అంటూనే ఉన్నాడు. ఏ విధంగానూ పొసగని వాదన యిది. పట్టాభి తిట్టగానే వైసిపి శ్రేణులు తిరగబడినట్లు కాకపోయినా, మరో రకంగానైనా టిడిపి శ్రేణులు వంశీ వ్యాఖ్యలు నిరసన తెలిపి వుంటే మరెవరూ పరోక్షంగానైనా ఆ ప్రస్తావన తేవడానికి భయపడేవారు. నెల్లాళ్లు పోయాక కన్నీళ్లు పెట్టుకున్న బాబు ఆ రోజు స్పందించనైనా స్పందించలేదు.

స్పందించకపోవడంలో అసహజత్వం ఏమీ లేదు. ఇలాటి విషయాలు ఎవరూ రచ్చ చేసుకోరు. ఓ సినిమాలో ఒక అమాయకుడు పక్కింటావిడను పొరబాటున కౌగలించుకుంటాడు. ఆ తర్వాత భర్త దగ్గరకి వెళ్లి, ఆ విషయం చెప్పి ‘మీరేమీ అనుకోలేదు కదా’ అంటాడు. అనుకోలేదులే, మర్చిపో అన్నా వినకుండా ఆఫీసులో ప్రతీవాడికీ వెళ్లి ఆ విషయం చెప్పి ‘ఆయనేమైనా అనుకున్నారేమోనండి పాపం’ అంటూ తెలియకుండానే ప్రచారం కల్పిస్తాడు. ఇవతల భర్త తలపట్టుకుంటాడు – జరిగిందేదో జరిగింది, ఎందుకొచ్చిన పబ్లిసిటీ యిది అని! అలాగే యింకో సినిమాలో రవిక గుడ్డలమ్ముకునే బాబూ మోహన్ ఒకావిడ బట్టలు మార్చుకుంటూ వుంటే పొరబాటున చూస్తాడు. తర్వాత ప్రతీ వీధికి వెళ్లి ‘ఆ యింట్లో అలా జరిగిందండి, మీరు బట్టలు కట్టుకోవడం పూర్తయ్యాకే చెప్పండి, లోపలకి వస్తా’ అంటూ వుంటాడు. బాధితగృహిణి భర్త ‘నువ్వు చెప్పడం దేనికిరా?’ అంటూ మండిపడతాడు. ఏ భర్తయినా అదే చేస్తాడు. అబ్బే వాడు చెప్పినంత జరగలేదు, యింతే జరిగింది అంటూ వివరణ యిస్తూ కూర్చోడు. అది తన చెవిన పడనట్లు నటిస్తాడు. భార్య విషయమే కాదు, తల్లి, చెల్లి, కూతురు ఎవరి విషయంలోనైనా దాన్ని చర్చకు పెట్టడు. ఆ రోజు ఒక భర్తగా ఔచిత్యం పాటించిన బాబు నెల తర్వాత తనే ఆవిడ పేరుని స్వయంగా బజారు కెక్కించడం ఆవిడ పట్ల ద్రోహం చేసినట్లే కదా!

నవంబరు 19న అసెంబ్లీలో నా భార్య పేరు యీడ్చారని బాబు అన్నారు. ఏదీ ఎక్కడన్నాం చెప్పండి అని అంబటి రాంబాబు అడిగారు. ఇక్కడ తమాషా ఏమిటంటే రాంబాబు మాధవరెడ్డి పేరు ఎత్తారు తప్ప బాబు భార్య పేరు ఎత్తలేదు. అందుకే ధైర్యంగా ఆవిడ పేరు ఎత్తానని నిరూపిస్తే కాళ్లు పట్టుకోవడానికి సిద్ధం అని ఛాలెంజ్ చేయగలిగారు. వ్యవసాయంపై చర్చ జరుగుతూంటే, అసందర్భంగా బాబు, టిడిపి సభ్యులు వివేకా హత్య గురించి మాట్లాడారు. దానికి సమాధానంగా రాంబాబు ‘అదొక్కటే ఎందుకు? మల్లెల బాబ్జీ హత్య, రంగా హత్య గురించి కూడా మాట్లాడదాం అంటూ దానితో బాటు మాధవరెడ్డి హత్యను కూడా చేర్చారు. అంతే! తన భార్య పేరు ఉచ్చరించారని బాబు ఏ విధంగా ప్రూవ్ చేయలేరు. రికార్డులలో ఎక్కడా లేదు.

రికార్డులు చెరిపివేశారు అని వాదించబోతే బాబు పక్కనే కూర్చుని ‘సిఎం అయ్యాకనే అసెంబ్లీలో అడుగుపెడతాను’ అని బాబు ప్రకటించడాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన సహచరుడు ఆ మాటలు రికార్డు చేసి వుండవచ్చుగా అని వాదించవచ్చు. ‘మైకులో ఎవరూ ఏమీ అనకపోయినా యిద్దరు వైసిపి ఎమ్మెల్యేలు బాబు దగ్గరకు వచ్చి నిలబడి లోకేశ్‌కు డిఎన్‌ఏ టెస్టు చేయించండి అంటూ గేలి చేశారు’ అంటూ కొన్ని చోట్ల వచ్చింది. అదే జరిగితే ఈ సెల్‌ఫోన్ రికార్డరు అది రికార్డు చేసి వుండేవారుగా! మాధవరెడ్డి పేరెత్తితే భువనేశ్వరి పేరు ఎత్తినట్లే అని అనబోతే బాబు తన భార్యపై తనే నింద వేసినట్లు అవుతుంది. అందువలన నా భార్యను అవమానించారు అంటున్నారు తప్ప ఏమన్నారో చెప్పలేదు. ఆయన అనుకూల మీడియా కూడా ఎన్టీయార్ కుమార్తెకు అవమానం, స్త్రీజాతికి అవమానం అంటూ గంటల తరబడి చర్చలు జరిపారు కానీ ‘ఇదిగో, యిలాటి మాట వాడారు’ అని యితమిత్థంగా అనలేక పోతున్నారు.

వంశీ ఆరోపణలకు లింకు కలపకపోతే మాధవరెడ్డి ప్రస్తావనకు ప్రాధాన్యమే లేదు. స్కూలులో నిక్‌నేమ్‌లు పెడతారు చూడండి. ఎవడికైనా వంకాయ్ అని నిక్‌నేమ్ ఉందనుకోండి. ఎవడో వంకాయలు చాలా ఖరీదై పోయాయిరా అంటాడు వాడి ఎదురుగా! వీడు పోట్లాటకు వెళితే ‘నీ పేరు వంకాయా?’ అని అడుగుతారు. కాదు అంటే అయితే నీకు సంబంధం లేదంటారు, ఔనంటే, నీ పేరు పెట్టే పిలిచాం, తప్పేముంది? అంటారు. ఇప్పుడు యీ గొడవ అలాగే తయారైంది. భువనేశ్వరి గారి పేరెత్తనే లేదు అని వైసిపి వాళ్లు వాదిస్తున్నారు. దాన్ని టిడిపి వాళ్లు ఖండించలేరు. గతంలో జగన్ మాట్లాడడానికి లేచి నిలబడగానే ‘లక్ష కోట్లు’ అని టిడిపి వారంతా కోరస్ పాడేవారు. జగన్ ఏమీ అనలేకపోయేవాడు. ‘అబ్బే లక్ష కోట్లెక్కడ? నేను ఏ1గా వున్నది 43 వేల కోట్ల కేసుల్లోనే కదా’ అని వాదించలేడు కదా! ఆ అరుపులు విననట్టుగా నటించేవాడు.

ఇప్పుడు బాబు కూడా అదే చేశారు. అందుకే 11.30 ప్రాంతంలో రాంబాబు అన్నా విననట్లు ఊరుకున్నారు. ఎందుకంటే సభలో లేని జగన్ కుటుంబసభ్యులను ప్రస్తావించింది ఆయనే! బాబాయి, తల్లి, చెల్లి.. అంటూ. గతంలో కూడా మోదీని తిట్టడానికి ఆయన భార్యను అసెంబ్లీ ఫ్లోర్‌పైకి లాక్కుని వచ్చిన వ్యక్తి ఆయనే. అసెంబ్లీ చర్చలు జరిగి, విరామమిచ్చిన తర్వాత బయటకు వచ్చి 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టేలోపున దీన్ని ఎన్‌క్యాష్ చేసుకోవచ్చన్న ఐడియా వచ్చి వుంటుంది. అందుకే రోదించారు. అదీ మొదట సైబరాబాదు, బిల్ గేట్స్ వగైరా దంపుళ్ల పాట అయిన తర్వాతనే!

బాబు సాధారణంగా ఎమోషనల్ కారు. వరద బాధితులను, తుపాను బాధితులను చూసినపుడు కూడా కంట నీరు వచ్చేది కాదు. గంభీరంగా, మొహం గంటు పెట్టుకుని ‘ఇక్కడే నిద్రపోతా, మీ తాట తీస్తా’ అంటూ అధికారులను అదలిస్తూ వుండేవారు. (‘స్టోన్ ఫేస్‌తో భావాలు తెలియకుండా వుండే బాబు’ అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వర్ణన) తనకు రాజకీయంగా పునర్జన్మ నిచ్చిన ఎన్టీయార్ పోయినపుడు ఆయన కంట చుక్క రాలిన ఫోటోలు లేవు. అలాటాయన ఏడవడం వలన చర్చ జరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన దేమిటంటే – భువనేశ్వరి గారి పేరును రచ్చబండకు యీడ్చినది బాబే! వంశీ అన్నది ఎప్పుడో అణిగిపోయింది. అనుకూల, ప్రతికూల మీడియా దాన్ని తొక్కి పెట్టేసింది. దాన్ని పట్టుకుని వచ్చి బయట ఆరేసినది బాబే!

ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడానికి, నాదెండ్ల చెప్పిన ప్రకారం, భార్యను వాడుకున్నాడు. పార్టీ చేజిక్కించుకోవడానికి లక్ష్మీపార్వతిని వాడుకున్నాడు. ఎన్టీయార్‌ను గద్దె దింపడానికి ఆయన సంతానాన్ని, తోడల్లుడిని వాడుకున్నాడు. గద్దె దింపాక ఎన్టీయార్ యిమేజి లేకుండా పార్టీ నడపడం చేతకాక, ఆయన మరణానంతరం ఆయన బొమ్మను వాడుకున్నాడు. ఇప్పుడు భార్య ప్రతిష్ఠను వాడుకున్నాడు. భువనేశ్వరి ప్రజ్ఞావంతురాలు. ఒక వ్యాపారాన్ని చక్కగా నడుపుతున్న దక్షమహిళ. ఎన్నికల ప్రచారానికి కూడా ఎన్నడూ బయటకు రారు. హుందాతనం మూర్తీభవించిన వ్యక్తి. అలాటావిడ శీలం గురించి చర్చించడం అపరాధమే. కానీ ఆ చర్చ జరుపుతున్నది టిడిపి అనుకూల మీడియాయే! ఏదో గాలి ఆరోపణ తీసుకుని దాని సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడడం అనవసరం. గాలి మాటలను ఓ చెవితో విని, మరొక చెవితో వదిలేయాలి. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే ‘లోకేశ్ 1983 జనవరిలో పుట్టాడు, అప్పటికి మాధవరెడ్డి స్థానిక నాయకుడు మాత్రమే’ అంటూ వివరాలిచ్చారు. అవసరమా? ప్రజలేమైనా అడిగారా? 70వ పడిలో పడిన యిల్లాలి విషయంలో సాధ్యాసాధ్యాల చర్చ చేపట్టడం తగునా?

బాబు ఫక్తు రాజకీయనాయకుడు. ప్రతి సందర్భాన్ని అవకాశంగా వాడుకోవాలని చూసే వ్యక్తి. కానీ నందమూరి కుటుంబానికి ఏమైంది? వాళ్ల కుటుంబసభ్యులలో చాలామంది బయటకు వచ్చి యిచ్చిన రియాక్షన్ అతిగా వుంది. ఆ యింటి ఆడపడుచులకే కాదు, అందరింటి ఆడపడుచులకు మానమర్యాదలుంటాయని వారికి ఎందుకు తోచలేదో! ‘క్రమశిక్షణకు, విలువలకు మారుపేరైన ఎన్టీయార్ కుటంబసభ్యులపై నిందారోపణలు దుస్సాహసమే అవుతుంది’ అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉవాచ. ఎంతకాలమైనా భువనేశ్వరి గార్ని నందమూరి కుటుంబసభ్యురాలిగానే చూడాలా? నాలుగుదశాబ్దాల క్రితమే నారా వారి కుటుంబానికి కోడలుగా వచ్చారు కదా, నారా వారికి కూడా విలువలున్నాయని రాస్తే రాధాకృష్ణ సొమ్మేం పోతుందో! నందమూరి కుటుంబపు విలువల గురించి ఖితాబు నిచ్చి రాధాకృష్ణ అనేక జ్ఞాపకాలను అనవసరంగా రేప్పెట్టారు.

లోపాయికారీగా జరిగినవాటి సంగతి ఎవరికీ తెలియదు కానీ, బయటకు తెలిసిన విషయాలలో శోభస్కరంగా లేనివి చాలా వున్నాయి. తల్లి మరణం తర్వాత కుటుంబసభ్యులందరూ తండ్రిని నిరాదరించడం చేతనే ఎన్టీయార్ లక్ష్మీపార్వతిని చేరదీశారని లోకవిదితం. దంపతులిద్దరూ తన జీవితగాథ రాద్దామని వస్తే ఆ జంటలో భార్య చేత భర్తకు విడాకులు యిప్పించి, తను కట్టుకున్నారు ఎన్టీయార్. అదీ అందరికీ తెలుసు. ద్వితీయవివాహం మిషపై తండ్రిని పదవీభ్రష్టుణ్ని చేయడానికి యింటల్లుళ్లు పూనుకుంటే మద్దతిచ్చారు కుమార్తెలు. ఒక కుమారుడు మంత్రిగా కూడా అయిపోయాడు. అతని ద్వితీయ కళత్రాన్ని తక్కిన కుటుంబసభ్యులు ఎంత లక్షణంగా ఆదరించారో, తండ్రి ద్వితీయ కళత్రాన్ని, సవతితల్లి అని కూడా చూడకుండా, తండ్రి ఎదుటే ఎలాటి పదాలతో సత్కరించారో కూడా బయటకు వచ్చేసింది. ఒక కుమారుడి యింట్లో కాల్పులు, హత్య జరిగితే ఆయన డాక్టర్ల నుంచి ఎలాటి సర్టిఫికెట్ తెచ్చుకున్నాడో పేపర్లలోనే వచ్చింది. ‘‘పైసా వసూల్’’ సినిమాలో అతడి హావభావాల అర్థమేమిటో ప్రతి తెలుగు మహిళ అర్థం చేసుకుంది. అర్థం కానివాళ్లెవరైనా వుంటారేమోనని బయటి సభలో ‘..దగ్గరకు వస్తే కడుపు చేసేయడమే..’ అని వివరించారు కూడా. తల్లి తర్వాత తల్లిలాంటి అక్కగారి యింటి ముంగిటకు వెళ్లి తొడ గొట్టిన విలువల రక్షకుడాయన.

అవన్నీ పాత విషయాలు. ఈ రోజు బాబు కంట తడి పెడితే విలవిల్లాడిపోతున్న యీ కుటుంబం తమకు జన్మనిచ్చిన, సకల ఐశ్వర్యాలు, పేరుప్రతిష్టలు యిచ్చిన తండ్రి పదవీభ్రష్టుడై, ‘యీ దుర్మార్గుడు నన్నూ, నా కుటుంబాన్నీ వేరు చేశాడ’ని విలపించిన రోజున ఒక్కరు స్పందించారా? అసెంబ్లీలో తన వాదన వినిపించడానికి స్పీకరు అవకాశం యివ్వకపోతే కన్నీరు కారిస్తే, చెప్పులు వేశారని కుమిలిపోతే ఒక్క ఓదార్పు పలుకు పలికారా? బయటకు వచ్చి యీ రీతిలో ఖండించారా? తండ్రి పునర్వివాహాన్ని ఏ సంతానమూ హర్షించదు. కానీ ఆయన ఏరికోరి కట్టుకున్న భార్యను, సవతితల్లిని అనరాని మాటలతో ఆడవారితో సహా నిందించినపుడు లక్ష్మీపార్వతి గౌరవానికి, తద్వారా ఆమెను చేపట్టిన తండ్రి గౌరవానికి విఘాతం కలుగుతోందనే స్పృహ కలగలేదా వీరికి? ‘పేరుకే వీరు నందమూరి వంశీయులు. కానీ నారావారి కొమ్ముకాసే బోయీలు’ అనే అభిప్రాయం కలిగించలేదా?

తన భార్య పేర వచ్చిన నిరాధార వదంతి నుంచి పలురకాలుగా రాజకీయ లబ్ధి పొందుదామని బాబు చూస్తున్నారనే స్పష్టమౌతోంది. ఆయనకు ఆత్మీయుడైన సుజనా చౌదరి చెప్పినట్లు ‘వంశీ అన్నప్పుడే స్పందించి వుంటే అసెంబ్లీ దాకా వచ్చేది కాదు’. కానీ బాబు అభిమతం అది కాదు. నిజానికి అసెంబ్లీలో తన భార్య గురించి తన ఎదురుగా ఎవరైనా తప్పుగా మాట్లాడితే రోషమున్నవాడు అక్కడికక్కడే చెంప పగలగొడతాడు. బాబు అలా చేయలేదంటేనే తెలుస్తోంది, అది యిష్యూ కానే కాదని. అంబటి రాంబాబు మాధవరెడ్డి ప్రస్తావన తేగానే, ‘మధ్యలో మాధవరెడ్డి ఎందుకు వచ్చాడు? అతన్ని చంపినది మావోయిస్టులు కదా’ అని అడ్డు చెప్పాల్సి వుంది. లోకేశ్‌కి డిఎన్ఏ టెస్టు చేయించాలి అని కొందరు ఎమ్మెల్యేలు బాబు వద్దకు వచ్చి అన్నారని సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలో నిజముంటే అక్కడికక్కడే టిడిపి ఎమ్మెల్యేలు వారిని చావబాదాల్సి వుంది.

‘అలనాడు జయలలితకు తమిళ సభలో అవమానం జరిగింది, కొన్నాళ్లకు ఆమె సిఎంగా సభకు తిరిగి వచ్చింది, ఈనాడు బాబుకి ఆంధ్ర సభలో అవమానం జరిగింది, కొన్నాళ్లకు ఆయనా సిఎంగా సభకు తిరిగి వస్తారు’ అంటున్నారు కదా! జయలలిత ఘటనలో జరిగిన సీక్వెన్స్ ఏమిటి? కరుణానిధి ప్రసంగానికి జయ మాటిమాటికీ అడ్డు తగులుతూ ప్రశ్నలు వేస్తూంటే ఒళ్లు మండిన కరుణానిధి ‘వెళ్లి శోభన్‌బాబును అడుగు’ అన్నాడు దురుసుగా. వెంటనే జయ తన ఎమ్మెల్యేలతో ‘కొట్టండ్రా’ అంది. కొందరు ఎడిఎంకె సభ్యులు కరుణానిధిపై పడ్డారు, అతను వెనక్కి తూలాడు. దానికి ప్రతీకారంగా దురై మురుగన్ జయపై పడి పైట లాగాడు. శోభన్‌బాబు పేరెత్తగానే జయ రియాక్షనేమిటి? కొట్టండ్రా అనడం! అదే విధంగా లోకేశ్ పుట్టుకపై సందేహం వ్యక్తం చేయగానే బాబు అలా అనలేదేం? దీన్ని బట్టి అలాటి మాట రాలేదని అర్థమవుతోంది.

నవంబరు 19న అసెంబ్లీకి వచ్చినపుడే బాబు ఒక ప్లానుతో వచ్చి వుంటారు. తాజా స్థానిక ఎన్నికలలో వైసిపి అఖండ విజయం తర్వాత టిడిపి క్యాడర్ డీలా పడ్డారని గ్రహించారు. ‘మీరు టిడిపికి ఓటేస్తే, లోకేశ్ సిఎం అవుతాడు, చూసుకోండి’ అని వైసిపి కార్యకర్తలు ఓటర్లకు చెప్తూండడంతో ఓటర్లు టిడిపిని నిరాదరిస్తున్నారని టిడిపి కార్యకర్తలు వాపోతున్నారని, వారిలో ఉత్సాహం నింపాలంటే, తనే సిఎం కాండిడేటు తప్ప లోకేశ్ కాదని ఘంటాపథంగా చెప్పాలనుకున్నారు. కుప్పం ఓటమి తర్వాత అసెంబ్లీలో వుంటే, ప్రతీ కుర్ర వైసిపి ఎమ్మెల్యే కుప్పం మాట ఎత్తి తనను గేలి చేస్తారు కాబట్టి, అసెంబ్లీలో ఏదో రగడ చేసి గతంలో జగన్ తరహాలో అసెంబ్లీని బహిష్కరించ దలచుకున్నారు. పోతూపోతూ ‘సిఎంగానే తిరిగి వస్తా’ అని చెప్తే తన క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపడంతో బాటు తన సిఎం కాండిడేచర్‌ను కూడా నిర్ధారించవచ్చనుకున్నారు. బాబాయి-గొడ్డలి, తల్లి చెల్లి అంటూ రగడ చేయడం వరకు బాగానే జరిగింది కానీ ఆ తర్వాత స్పీకరు మైకు కట్ చేయడంతో తన సిఎం ప్రకటన చేయడానికి సాటి ఎమ్మెల్యే సెల్‌ఫోన్ రికార్డింగు ఉపయోగించుకున్నారు.

అసెంబ్లీ బహిష్కరణకు యీ రగడ సరిపోదని విరామసమయంలో తట్టింది. అందుకని 3 గంటల ప్రెస్‌మీట్‌లో రోదనబాబు అవతారం ఎత్తారు. ఆ వీడియోను అనుకూల మీడియాలో రోజుల తరబడి ప్రసారం చేయించి, సింపతీ ద్వారా రెచ్చగొడదామని చూస్తున్నారు. దీనితో పాటు పార్టీలో లోకేశ్‌ ఎదుగుదలకు అడ్డు లేకుండా చూద్దామని కూడా ప్లాను రచించారు. దానిలో భాగమే నందమూరి కుటుంబం చేత చెప్పించి, దానికి జూనియర్ రియాక్షన్‌తో పోలిక తెచ్చి, తన ఆత్మీయల చేత విమర్శలు చేయించడం! లోకేశ్ వలన ఏమీ లాభం లేదని, పార్టీ బతకాలంటే జూనియర్‌ను తేవాల్సిందేనని టిడిపి నాయకులలో, కార్యకర్తల్లో దృఢాభిప్రాయం వుందని బాబుకి తెలుసు. జూనియర్‌కు బాబు పట్ల గౌరవం లేదని,  పార్టీ అతీగతీ పట్టించుకోడని, అతన్ని అడిగి లాభం లేదని వాళ్లు అర్థం చేసుకోవాలని బాబు ప్రయత్నం.

జూనియర్ మాట్లాడిన దానిలో తప్పేమీ లేదని ఎవరైనా అంటారు. అవి సర్వామోదం పొందే హితవాక్యాలు. అయితే వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నల వంటి బాబు ఆత్మీయులకు దానిలో దోషం కనబడింది. మేనత్త పట్ల అగౌరవం కనబడింది. అసలు ఆ మేనత్త యీ మేనల్లుణ్ని ఆదరంగా చూసిన ఘట్టాలున్నాయో లేదో వాళ్లకే తెలియాలి. అతను, తల్లి భంగపడిన సందర్భాలుంటే వాటిల్లో ఆవిడ ప్రవర్తన ఎలా వుందో తెలుసుకోవాలి. కొడాలి నాని, వల్లభనేని వంశీల ప్రేలాపనను కూడా జూనియర్ నెత్తిన కట్టే ప్రయత్నం మరీ చోద్యం. ఇది శ్రుతి మించి జూనియరే వాళ్ల చేత అనిపించాడనే ప్రమాదం వస్తుందని భయపడి కాబోలు వంశీ, నాని ‘మాకూ జూనియర్‌కు సంబంధం లేదు’ అని ప్రకటించారు.

ఈ కథ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. రాజకీయ ప్రయోజనాలు సాధిద్దామని చూస్తూన్నంతకాలం దానంతట అది ముగింపుకి రాదు. నాయకులే దానికి ముగింపు పలకాలి. లేకపోతే సమాజంలో సంస్కారం, మహిళల పట్ల గౌరవం అనేవి క్షీణించి, మృగ్యమై, కానరాకుండా పోతాయి. ఒకర్ని మించి మరొకరు వాచాలత ప్రదర్శిస్తూ పోతే యిది పెచ్చుమీరుతుంది. ఒక పక్షం ‘మీరు ఎంత రెచ్చగొట్టినా మేము నెల రోజుల పాటు శాంతంగా వుంటాం.’ అని ప్రకటించి, దాన్ని పాటించి చూపించాలి. విజేతలకే ఔదార్యం వుండాలి. అందువలన అధికారపక్షమే యీ విషయంలో ముందుకు వచ్చి ఆ పని చేయాలి.