ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు తగ్గించినా, చాలా ప్రాంతాల్లో పెద్ద సినిమాలు రిలీజైనప్పుడు రేట్లు పెంచి టిక్కెట్లు అమ్మారు. స్థానికంగా ఉన్న అధికారులు ఈ వ్యవహారానికి సహకరించగా.. ప్రభుత్వం కూడా చూసీచూడనట్టు వ్యవహరించింది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా మంత్రి పేర్ని నాని కూడా ప్రస్తావించడం విశేషం.
ఈ క్రమంలో త్వరలోనే టిక్కెట్ రేట్లు పెరుగుతాయని టాలీవుడ్ జనాలు భావించారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, రేపోమాపో టిక్కెట్ రేట్ల పెంపుపై నిర్ణయం వచ్చేస్తుందని, బెనిఫిట్ షోలపై కూడా సానుకూల ప్రకటన వస్తుందంటూ ప్రచారం జరిగింది. ఈ మొత్తం ప్రచారానికి ఈరోజు ఫుల్ స్టాప్ పడింది. ఇకపై చూసీచూడనట్టు సాగే వ్యవహారాలకు కూడా చెక్ పడబోతోంది. ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
తాజా సవరణ బిల్లు ప్రకారం, ఇకపై రాష్ట్రంలో అదనపు షోలు ఉండవు. మూవీ రిలీజైన మొదటి వారం అదనపు టికెట్ రేట్లు ఉండవు. ఇలా బెనిఫిట్ షో వ్యవహారానికి బ్రేకులేయడంతో పాటు.. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో, నిర్దేశించిన టికెట్ రేట్లకే సినిమాలు ప్రదర్శించాలని మంత్రి పేర్ని నాని విస్పష్టంగా ప్రకటన చేశారు. ఈ మేరకు ఆన్ లైన్ వ్యవస్థను తీసుకొచ్చారు.
“తెల్లవారకముందే షోలు వేస్తున్నారు. పేద-మధ్యతరగతి ప్రేక్షకుల నుంచి ఇష్టారాజ్యంగా 1500 రూపాయల వరకు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 4 షోలకు మించి వేస్తున్నారు. మాకు ఎదురుండకూడదు, చట్టాలు మమ్మల్ని ఆపకూడదు అనే రీతిలో పోకడ ఉంది. ప్రేక్షకుల బలహీనతల్ని సొమ్ము చేసుకోకుండా, టిక్కెట్ రేట్లను కట్టడి చేయడానికి ప్రభుత్వం ముందు ఉన్న మార్గం ఒకటే. అదే ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ.”
ఇంట్లో కూర్చొని ఎలాగైతే బస్సు, ట్రైన్ టిక్కెట్లు తీసుకుంటున్నారో.. సినిమా టిక్కెట్లు కూడా అలానే ఇంట్లో నుంచి బుక్ చేసుకునే పద్ధతి తీసుకొస్తామన్నారు మంత్రి. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా కౌంటర్ లో ఆన్ లైన్ వ్యవస్థ ఏర్పాటుచేసేలా సవరణ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు వల్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించే పద్ధతి పోతుందన్నారు.
“ప్రస్తుతం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన వసూళ్లకు, ప్రభుత్వానికి వచ్చిన పన్ను పోల్చి చూస్తే ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తే పారదర్శకత ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే పన్నును ఎగ్గొట్టే ఆస్కారం ఉండదు. ప్రభుత్వపై బురద చల్లడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కంటే ఓ రాజకీయ పార్టీ, టీవీ ఛానెళ్లు, పత్రికలు.. ఈ ఆన్ లైన్ టికెటింగ్ మీద బురదేస్తున్నాయి.”
ఆన్ లైన్ టికెటింగ్ పై సినీ జనాలకు లేని అభ్యంతరం టీడీపీ, జనసేన పార్టీలకు ఉందని విమర్శించారు నాని. వీళ్లకు కొన్ని ఛానెళ్లు, పత్రికలు వత్తాసు పలుకుతున్నాయన్నారు. తాజా బిల్లు ఆమోదంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ సినిమాలకు పెద్ద చిక్కొచ్చి పడింది.
పెద్ద సినిమాల పరిస్థితేంటి..?
దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఆంధ్రాలో గతంలో చేసిన బిజినెస్ ను కాస్త తగ్గించుకున్నప్పటికీ.. బ్రేక్ ఈవెన్ అయి, లాభాల్లోకి రావాలంటే మొదటి వారం రోజులు టిక్కెట్ ధరలు పెంచాల్సిందే. దీనికి తోడు అదనపు షోలు కూడా వేయాల్సిందే. ఇన్నాళ్లూ ఆర్ఆర్ఆర్ మేకర్స్ దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది.
మరికొంతమంది హైకోర్టుకు వెళ్లి మొదటి వారం రోజులకు టికెట్ రేట్లు పెంచుకునేలా ఆర్డర్స్ తెచ్చుకున్న సందర్భాలున్నాయి. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో అలాంటివి కూడా జరగవు. ఎందుకంటే, ఏకంగా అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపి చట్టంగా తీసుకొస్తున్నారు. చట్టం అమల్లోకి వస్తే, అధికారులు కూడా లైన్లో పడతారు. చూసీచూడనట్టు వ్యవహరించే పరిస్థితి ఉండదు.
ఆర్ఆర్ఆర్ తో పాటు రాధేశ్యామ్, భీమ్లానాయక్ సినిమాలకు కూడా తాజా చట్టంతో ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. అయితే వీటన్నింటి కంటే ముందు దెబ్బ తినే సినిమా ఒకటుంది. అదే అఖండ. బాలయ్య నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా వచ్చేనెల్లోనే థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే అంచనాకు మించి బడ్జెట్ పెట్టానని నిర్మాత రవీందర్ రెడ్డి బాధపడుతున్నాడు. ఇప్పుడు ఉరుములేని పిడుగలా ఈ చట్టం అఖండ మెడకు చుట్టుకుంది. ఆ తర్వాత దెబ్బ పుష్ప సినిమాపై పడనుంది. సంక్రాంతి తర్వాతొచ్చే ఆచార్య సినిమాపై కూడా ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
భవిష్యత్ ముఖచిత్రం ఇదే..!
ఇకపై టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమాకు ప్లాన్ చేసేముందు, ఏపీలో టిక్కెట్ రేట్లు దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. పైగా లేనిపోని లెక్కలు చెప్పే రోజులు కూడా పోతాయి. ఒకప్పుడు 50 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాకు 100 కోట్లు ఖర్చయినట్టు చెప్పుకునేవారు. 50 కోట్లు వసూళ్లు సాధించిన చిత్రానికి వంద కోట్ల షేర్ అంటూ పోస్టర్లు వేసుకునేవారు. ఏపీకి సంబంధించి ఇకపై అలాంటి పప్పులుడకవు.
ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఆన్ లైన్ వ్యవస్థతో ఎవరైనా కలెక్షన్ల చూసుకోవచ్చు. ఏపీలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న థియేటర్లోనైనా ఆక్యుపెన్సీ ఎంత ఉంది.. ఎంత కలెక్షన్ వచ్చింది.. ప్రభుత్వానికి టాక్స్ ఎంత వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా చూడొచ్చు.
సో.. ఏపీ థియేట్రికల్ బిజినెస్ కు సంబంధించి నిర్మాతలు, హీరోలు ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి ఉండదు. బిజినెస్ ఎంత జరిగింది, వసూళ్లు ఎంత అనేది ఉన్నదున్నట్టు మాట్లాడే పరిస్థితి వస్తుంది. దీంతో హీరోల మార్కెట్ కూడా డిసైడ్ అవుతుంది. కరోనా/లాక్ డౌన్ టైమ్ లో కూడా తమ పారితోషికాలు పెంచేసిన హీరోలు కొండదిగే సూచనలున్నాయి. మరోవైపు నల్లధన ప్రవాహం కూడా తగ్గే అవకాశం ఉంది.
చిన్న సినిమాలకు పెద్ద పండగ
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న థియేట్రికల్ బిజినెస్, సినిమా పెద్దల లాబీయింగ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇష్టారాజ్యంగా వీళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల చిన్న సినిమాకు ప్రేక్షకుడు రావడం మానేశాడు. కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ.. 200 రూపాయలు పెట్టి ఓ చిన్న సినిమా చూడడం అవసరమా అనే భావనకు వచ్చేశాడు.
కొత్త చట్టం వల్ల టికెట్ రేట్లు అందుబాటులోకి వచ్చాయి. చిన్న సినిమాలకు కూడా ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి కల్పించింది ప్రభుత్వం. నిజంగా కంటెంట్ బాగుంటే, ఆ చిన్న సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు.
మొత్తమ్మీద తాజా సవరణ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ బిజినెస్ లో నూతన మార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దీని వల్ల మరోసారి బ్లాక్ టికెట్ల సంస్కృతి పెరుగుతుందని కొందరు విమర్శిస్తున్నప్పటికీ.. పూర్తి ఫలితాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.