సినిమా తారలు చాలామంది సినిమాల్లో టైమింగ్ అవసరమని అంటుంటారు. టైమింగ్ అంటే సమయం కలిసి రావడం కాదు. నటనలో టైమింగ్ ఉండటమని అర్ధం. ఇది పాత్ర పోషణకు సంబంధించిన పదం. ఇది రాజకీయ నాయకులకూ అవసరం అవుతుంది. ముఖ్యంగా పార్టీ అధినేతలకు ఇంకా అవసరం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు పార్టీ టైం నాయకుడిగా వ్యహరిస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. నిలకడైన అభిప్రాయాలు లేవనే అభిప్రాయమూ కలిగింది. ఇప్పటికీ అవే విమర్శలు, అభిప్రాయాలు కొనసాగుతున్నాయి. రాజకీయ నాయకులకు ప్రజా సమస్యల పట్ల, ప్రజల ఇబ్బందుల, ఇక్కట్ల పట్ల స్పందించడం చాలా ముఖ్యం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి భరోసా ఇవ్వడం, ధైర్యం చెప్పడం నాయకుల కర్తవ్యం.
కానీ పవన్ కళ్యాణ్ ఆ పని చేయడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లోకి వచ్చి అండగా నిలవాల్సిన సమయంలోనూ ఆయన కేవలం ఇంటికే పరిమితం కావడం ఇప్పుడు విమర్శలకు కారణమైంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటే చాలు అనేది ఆయన సినిమాల్లోని డైలాగే. కానీ రాజకీయాల్లో మాత్రం అది పనికి రాదన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది.ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చామని.. ప్రజలకు అండగా ఉంటామని జనసేన ఎప్పుడూ చెబుతుంటుంది.
కానీ ఆచరణ విషయానికి వచ్చే సరికే అది కనిపించడం లేదనే విమర్శలున్నాయి. ఎప్పుడో ఓ సారి ప్రజల్లోకి వచ్చి ఓ రెండు సభల్లో మాటలతో ఊగిపోయి ఆ తర్వాత పవన్ కనిపించరని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. తాజాగా వరద బాధితులను పరామర్శించేందుకు పవన్ తాను రాకుండా నాదెండ్ల మనోహర్‌ను పంపాడు. ముఖ్యంగా చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది.
ఆ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కానీ పవన్ మాత్రం తాను రాకుండా.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పంపాడు.కానీ నాదెండ్ల మాటలు సూటిగా ప్రభుత్వానికి తగలడం లేదని.. ప్రజల్లోకి వెళ్లడం కూడా లేదని అంటున్నారు.
ఇప్పుడు పవన్ షూటింగ్‌లకు కూడా గ్యాప్ ఇచ్చి ఖాళీగానే ఉన్నట్లు సమాచారం. మరి ఈ సమయంలో వచ్చి వరద బాధితుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుండేదన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. స్వయంగా తాను చేయాల్సిన పనులను కూడా ఇలా పార్టీ నేతలకు అప్పగిస్తున్నారని అంటున్నారు.
రాజకీయాల్లో నాయకులకు సరైన టైమింగ్ అవసరం. ఛాన్స్ దొరికితే చాలు అల్లుకుపోవాలి. కానీ ఇంత మంచి అవకాశాన్ని పవన్ ఎందుకు వృథా చేసుకుంటున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు.