సన్నాలు, మసూరాలు, మొలకొలుకులు.. ఇలా వరిలో చాలా రకాలున్నాయి. మరి గంజాయిలో కూడా ఇలాంటి రకాలుంటాయా? గంజాయిలో కూడా మేలు రకం పంటను పండిస్తేనే.. విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని గంజాయి స్మగ్లర్లకు మాత్రమే తెలుసు.
ఇటీవల గంజాయి అక్రమ రవాణాపై దాడులు పెరిగిపోవడంతో పోలీసులు కూడా ఈ రకాలేంటో తెలుసుకుంటున్నారు. వాసన చూసి ఇది శీలావతా లేకపోతే.. రాజహంస, కాళపత్రి రకమా అనేది అంచనా వేస్తున్నారు.
శీలావతి కేరాఫ్ ఏఓబీ..
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో పండించే శీలావతి రకానికి చెందిన గంజాయికి ఇప్పుడు జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్. ఇటీవల ఏపీ పోలీసుల దాడుల్లో దొరుకుతున్న రకం శీలావతి అని తేలింది. దీంతో పోలీసులు ఈ రకంపై ఫోకస్ పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ఏరియాల్లో కూడా శీలావతి రకం ఎక్కువగా పెంచుతున్నట్టు నిర్థారించుకుని, దాడులు చేస్తున్నారు.
దీంతోపాటు.. రాజహంస, కాళపత్రి అనే రకాలు కూడా సాగులో ఉన్నా.. వాటికి విదేశాల్లో పెద్దగా డిమాండ్ లేదు. దీంతో.. పొరుగు రాష్ట్రాల్లో ఈ కల్తీ రకాన్ని అమ్మేస్తున్నారు. మేలు రకమైన శీలావతిని ఎక్స్ పోర్ట్ క్వాలిటీగా పేర్కొంటారు.
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) లెక్కల ప్రకారం భారతదేశంలోని మొత్తం 17 రాష్ట్రాల్లో 41 జిల్లాల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు తేలింది.
పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకుని.. గంజాయి సాగుని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాల పోలీసులు రెడీ అయ్యారు. డ్రోన్ కెమెరాలు, శాటిలైట్ చిత్రాలు, జీపీఎస్ ద్వారా కరెక్ట్ లొకేషన్ తెలుసుకుని మరీ గంజాయి సాగుని ధ్వంసం చేస్తున్నారు.