సమంత ఇప్పుడు స్టార్ హీరోయిన్ మాత్రమే. ఇప్పుడామె స్వేచ్ఛాజీవి. తన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని సోషల్ మీడియా వేదికగా నిర్భయంగా పంచుకుంటున్నారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె అభిప్రాయాలు, ఆలోచనల్లో తాత్వికత కనిపిస్తోంది. అన్నిటికీ మించి మనుషులను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న భావన సమంత పోస్టుల్లో ప్రతిబింబిస్తోంది.
ఇటీవల పెళ్లి గురించి తనవైన స్వతంత్ర భావాలను వెల్లడించడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. తాజాగా ఒత్తిడి గురించి సమంత ఓ ప్రముఖుడి కొటేషన్‌ను తీసుకొచ్చి మరీ చెప్పుకొచ్చింది. ఇన్‌స్టా స్టోరీలో సమంత షేర్ చేసిన తాజా ఎమోషనల్ పోస్టు గురించి తెలుసుకుందాం.
“మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే మనమేంటో తెలియజేస్తాయి” అంటూ తట్టుకోలేని ఒత్తిడికి గురైన సమయంలోనే మనిషి అసలు స్వభావం బయటపడుతుంది అని ప్రముఖ రచయిత రాబర్ట్ కొటేషన్‌ను అభిమానులతో సమంత పంచుకుంది.
ఇటీవల తన వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న అలజడి ఆమెను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందనే అభిప్రాయాలున్న సంగతి తెలిసిందే. ఒత్తిడి గురించి ఇప్పుడే ప్రత్యేక పోస్టు షేర్ చేయడం వెనుక ఆమె దానికి గురి కావడమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.