పవన్ కళ్యాణ్ వెండి తెర వేలుపు. సాధారణంగా సినిమా వారు సున్నితమని చెబుతారు. వారు హిట్లను ఆస్వాదించినంత సులువుగా ఫ్లాప్స్ ని జీర్ణించుకోలేరు అంటారు. ఇక పవన్ అతి సున్నితమని ఏడేళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానం చూసిన వారికి అర్ధమవుతోంది.
గాజువాకలో 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేశారు. నామినేషన్ కి వెల్లువల్లా జనాలు వచ్చారు. దాంతో పవన్ గెలుపు ష్యూర్ అని అంతా అనుకున్నారు. అయితే పవన్ ఆ తరువాత గాజువాకలో పెద్దగా తిరగకపోవడం, రాజకీయంగా చేసిన కొన్ని తప్పిదాలు, వ్యూహాలు అన్నీ కలసి ఆయన ఓటమికి దారి తీశాయి.
అయితే పవన్ మాత్రం గాజువాక అంటే చాలు బాగా గుచ్చుకుంటున్నారులా ఉంది. ఇప్పటికి రెండున్నరేళ్ళు అయినా పవన్ కి ఆ ఓటమే గుర్తుకువస్తోంది అంటే నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఆ మధ్యన మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మాట్లడుతూ విశాఖ వాసులు నన్ను ఓడించారు అంటూ ఆవేదన చెందారు. అయినా స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటం చేస్తానంటూ చెప్పుకున్నారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కరెక్ట్ గా లొకేట్ అయిందే గాజువాకలో. దాంతో ఈసారి ఇంకా బాగా గాజువాక మదిలో మెదిలినట్లుంది. నిజానికి పవన్ ఉక్కు కార్మికులకు మద్దతుగా మాట్లాడాలి, కానీ ఆయన గాజువాకలో నన్ను ఓడించారు అంటూ మరో మారు మాట్లాడారు, దాంతో పవన్ని ఈ ఓటమి ఎంతలా బాధిస్తోందో అర్ధమైంది అంటున్నారు.
అయితే ఇపుడు రాజకీయాలు, గెలుపోటముల గురించి మాట్లాడాల్సిన సందర్భం కాదని ఉక్కు కార్మిక నాయకులు అంటున్నారు. పవన్ మాత్రం ఉక్కు పోరటం పేరిట ఎక్కువ రాజకీయాలే మాట్లాడారని వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పవన్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేస్తారా. ఏమో.. చెప్పలేమనే అంటున్నారు.