బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ వ్యవహారం సస్పెన్స్ సినిమాను తలపింపజేస్తూ ఉంది. గత వారం రోజులుగా ఈ వ్యవహారం రసకందాయకంలో పడింది.
రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ దొరకగానే ఎన్సీబీ ముంబై జోనల్ ఆఫీసర్ వాంఖడే భారీ మొత్తం డబ్బును డిమాండ్ చేశాడని, ఎనిమిది కోట్ల రూపాయలు తనకు, మొత్తంగా 25 కోట్ల రూపాయల బేరానికి ప్రయత్నించాడని, సంఘటనా స్థలంలో ఉన్న ఒక వ్యక్తి ఆరోపించడంతో వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. అతడు కోర్టుకు వాంగ్మూలానికి రెడీ అయ్యాడు. ఇంకోవైపు ఈ కేసులో బెయిల్ పై విచారణ సాగుతూనే ఉంది.
ఇప్పటికే రెండు రోజుల పాటు ఈ కేసు బాంబే హై కోర్టులో విచారణకు రాగా, రేపు మరోసారి ఈ అంశంపై కోర్టు విచారణకు రానుంది. రేపు ఈ ఈ బెయిల్ పిటిషన్ విచారణను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామంటూ హైకోర్టు తెలిపింది. మరి రేపు ఆర్యన్ కు బెయిల్ దక్కుతుందా? లేదా? అనే మిస్టరీ ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది.
ఆర్యన్ ఖాన్ తరఫు లాయర్ ముఖుల్ రోహత్గీ ఈ కేసులో పలు పాయింట్లను ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. తన క్లైంట్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదనే పాత వాదననే ఈ కేసులో కొత్తగా రంగంలోకి దిగిన ఈ లాయర్ వినిపించారు. కింది కోర్టుల్లో కూడా ఆర్యన్ తరఫు న్యాయవాదులు ఇదే వాదన వినిపించారు.
ఇక దీనికి కొనసాగింపుగా.. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్ ను ఎన్సీబీ అధికారులు ఓపెన్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఈ లాయర్ వాదించారు. దీనికి తగిన పర్మిషన్ తీసుకోలేదన్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని ఇది వరకూ కోర్టులు పలు తీర్పుల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు.
అలాగే ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ వ్యవహారంలో అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఎన్సీబీ అభియోగాలను కూడా ఆయన కొట్టి పడేశారు. అవి కేవలం తప్పుడు వాదనలన్నారు. ఆర్యన్ ఖాన్ పై ఎన్సీబీ మోపిన అభియోగాలకు గరిష్టంగా ఏడాది పాటు శిక్ష పడే అవకాశం ఉందని, అలాంటి సెక్షన్లలో కస్టడీకి అవసరం లేదని, తన క్లైంట్ కు బెయిల్ కేటాయించవచ్చునని ఆ లాయర్ వాదించారు.
ఇక రేపు ఎన్సీబీ మరోసారి తన వాదనలను వినిపించనుంది. బెయిల్ ను నిరాకరిస్తూ ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసిన ఎన్సీబీ.. రేపు ఏ ఆధారాలను సమర్పించి, బెయిల్ ను ఆపగలుగుతుందనేది ఆసక్తిదాయకంగా మారింది.