ఏపీలో కాపు… కాక రేపుతోంది!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను రానున్న ఎన్నిక‌ల్లో కాపు కాయ‌డంపై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీలో రాజ‌కీయంగా కాపు సామాజిక వ‌ర్గం బ‌ల‌మైన ప్ర‌భావం చూపుతోంది. ఈ నేప‌థ్యంలో గ‌త రాత్రి మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఇంట్లో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను రానున్న ఎన్నిక‌ల్లో కాపు కాయ‌డంపై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీలో రాజ‌కీయంగా కాపు సామాజిక వ‌ర్గం బ‌ల‌మైన ప్ర‌భావం చూపుతోంది. ఈ నేప‌థ్యంలో గ‌త రాత్రి మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఇంట్లో బీజేపీ నేత‌, కాపు నాయ‌కులైన క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు భేటీ కావ‌డం కాక రేపుతోంది.

ఈ నెల 26న విశాఖ‌లో కాపుల స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌లు కావ‌డంతో ప్ర‌తి స‌మావేశం ఆ కోణంలోనే చూసే ప‌రిస్థితి. గంటా, బొండా టీడీపీ నేత‌లు. అయిన‌ప్ప‌టికీ గంటా శ్రీ‌నివాస్ రాష్ట్రంలో అధికారం మారిన‌ప్ప‌టి నుంచి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మ‌ళ్లీ యాక్టీవ్ అవుతున్నారు. బుధ‌వారం సాయంత్రం క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌తో జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ భేటీ కావ‌డం రాజ‌కీయ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

రాజ‌కీయంగా ఇంపార్టెన్స్ లేద‌ని క‌న్నా చెప్పిన‌ప్ప‌టికీ, ఆ త‌ర్వాత కాపు ముఖ్య నాయ‌కులు స‌మావేశం కావ‌డం వెనుక ఎత్తుగ‌డ ఏదో వుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. రానున్న ఎన్నిక‌ల్లో కాపులు అనుస‌రించాల్సిన వ్యూహంపై విశాఖ కాపునాడు స‌భ‌లో చర్చ జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు. ఆ స‌భ‌కు అన్ని రాజ‌కీయ పార్టీల్లోని కాపు నేత‌ల‌ను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఆ స‌మావేశానికి విశేష ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ఏపీ స‌ర్కార్ కాపు నేత‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వారి కోసం ప్ర‌త్యేక కార్పొరేష‌న్‌, నిధుల‌తో పాటు ప‌ద‌వుల్లో కూడా అగ్ర‌స్థానం క‌ల్పించింది. వైసీపీలో కాపు నేత‌లు బ‌లంగా ఉన్నారు. అయితే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎలాగైనా త‌న సామాజిక వ‌ర్గంలో ప‌ట్టు సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

అందుకే ఆయ‌న ప‌దేప‌దే త‌న సామాజిక వ‌ర్గం గురించి బ‌హిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో కాపు నేత‌లు వ‌రుస భేటీల‌పై అన్ని రాజ‌కీయ పార్టీలు చురుగ్గా గ‌మ‌నిస్తున్నాయి. వారి అడుగులను బ‌ట్టి త‌మ పంథా మార్చుకునేందుకు రాజ‌కీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.