తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మీటింగ్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లకు టెన్షన్ పట్టుకుంటోంది. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల గడువు ఉందనగా, జగన్ అప్రమత్తమయ్యారు. మూడేళ్ల పాటు పాలనపై దృష్టి పెట్టిన జగన్, ఇక రెండేళ్ల సమయాన్ని పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రతి పనీ చేయాలనే తలంపులో ఉన్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, పార్టీ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో పలు దఫాలు సమావేశమయ్యారు.
ఈ దఫా ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవని చెప్పారు. సర్వే నివేదికల ఆధారంగా టికెట్లు ఇస్తానని, ఇప్పటి నుంచైనా ప్రజల్లో బాగా తిరగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా గడపగడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని క్రియేట్ చేసి…. మూడేళ్ల పాలనలో ప్రజలకు కలిగిన లబ్ధిని అధికారికంగానే అందిస్తున్నారు. మరోసారి జగన్కు ఆశీస్సులు కావాలని ప్రజలను వైసీపీ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కొందరు సీరియస్గా తీసుకోలేదని గత సమావేశంలో జగన్ ఫైర్ అయ్యారు. 175కు 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆయన ఆదేశించారు. గెలుపే ప్రాతిపదికగా టికెట్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. తన అంచనాలకు తగ్గట్టు నడుచుకోని వారిని పక్కన పెడతానని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం మూడు గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యేల పనితీరు, గెలుపు అవకాశాలు, సర్వే నివేదికలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, మార్పు చేసుకోవాల్సిన అంశాలపై జగన్ మాట్లాడనున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై సర్వే నివేదికల్ని ఆధారంగా ఎమ్మెల్యేలతో జగన్ నేరుగా మాట్లాడనున్నారు. దీంతో వారిలో టెన్షన్ మొదలైంది. వ్యక్తిగతంగా తనకు దగ్గరి వారిని కూడా సర్వే నివేదికలో తేడా కనిపిస్తే పక్కన పెట్టడానికి జగన్ వెనుకాడరు.
అలాంటి ఎమ్మెల్యేల్లో సహజంగానే ఆందోళన కనిపిస్తోంది. జగన్తో వరుస భేటీల నేపథ్యంలో తమతో ఆయన పంచుకున్న అభిప్రాయాలను బట్టి …రానున్న రోజుల్లో టికెట్ విషయమై కొందరు క్లారిటీతో వున్నారు. తమకు టికెట్ ఇవ్వరనే అనుమానం వున్న నేతలు… సన్నిహితుల వద్ద జగన్ వైఖరిపై విమర్శలు చేస్తున్నారు. ఇవాళ్టి కీలక సమావేశంలో జగన్ ఏం చెబుతారో చూడాలి.