చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ‘పుష్ప’

తమ కంటెంట్ లీక్ అయిందని తెలిసిన వెంటనే మేకర్స్ అప్రమత్తం అవుతారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయిస్తారు. తమ టెక్నికల్ టీమ్ ను కూడా రంగంలోకి దించుతారు. గంటల వ్యవధిలో లీక్ అయిన…

తమ కంటెంట్ లీక్ అయిందని తెలిసిన వెంటనే మేకర్స్ అప్రమత్తం అవుతారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయిస్తారు. తమ టెక్నికల్ టీమ్ ను కూడా రంగంలోకి దించుతారు. గంటల వ్యవధిలో లీక్ అయిన వీడియోను సోషల్ మీడియా నుంచి తొలిగిస్తారు. ఏ ప్రొడక్షన్ హౌజ్ అయినా ఇలానే చేస్తుంది. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం వెరైటీ. అంతా ఇంతా వెరైటీ కాదు.

అల్లు అర్జున్ హీరోగో పుష్ప సినిమాను నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ సినిమా నుంచి ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా లీకులు వచ్చాయి. వీడియోలు, ఫొటోలు అనే తేడా లేకుండా చాలా కంటెంట్ లీక్ అయింది. మైత్రీ సంస్థ మాత్రం లీకుల్ని అలా చూస్తూ ఉంది తప్ప ఏమీ చేయలేదు. ఎంతలా అంటే ఒక దశలో ఈ లీక్ అయిన వీడియోలు యూట్యూబ్ లోకి కూడా ఎక్కేశాయి.

ఎంత డ్యామేజీ జరగాలో అంత జరిగిన తర్వాత అప్పుడు తాపీగా రంగంలోకి దిగారు మేకర్స్. తమ కంటెంట్ లీక్ అవుతోందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎవ్వరూ లీక్ అయిన కంటెంట్ ను షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వీళ్ల నిర్లిప్తత ఎంత వరకు దారి తీసిందంటే.. ఒక దశలో పుష్ప యూనిట్టే ప్రమోషన్ కోసం కావాలని వీటిని లీక్ చేసిందనే ప్రచారం కూడా జరిగింది.

ఇక పుష్ప లీకులేంటో ఓసారి చూద్దాం. దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదలకు ఒక రోజు ముందు లీక్ అయింది. ఆ తర్వాత అదే పాటకు సంబంధించి మేకింగ్ వీడియో లీక్ అయింది. ఆ వెంటనే పుష్ప సైకిల్ చైన్ ఫైట్ లీక్ అయింది. అదే టైమ్ లో రష్మిక సాంగ్ బిట్ లీక్ అయింది. ప్రస్తుతం బన్నీ ఫైట్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఇవి కాకుండా.. పుష్ప ఇంట్రో సీన్ కు సంబంధించిన స్టిల్స్ కూడా లీక్ అవుతున్నాయి.

పుష్ప కంటెంట్ ను వాట్సాప్ తో పాటు మరికొన్ని ఫైల్ ట్రాన్స్ ఫర్ మెథడ్స్ ద్వారా షేర్ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అంతేకాదు, యూనిట్ లో వ్యక్తులే అవగాహనలేమితో ఈ పని చేసినట్టు తెలుస్తోంది.