ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం గురించి బీజేపీ నేతలు చెబితేనే వినాలి. అరచేతిలో వైకుంఠం చూపడం అంటే ఎట్లా వుంటుందంటే ఏపీ అభివృద్ధికి కేంద్ర సాయం చేసినట్టుగా అనే వ్యంగ్య కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనట్టు, వైజాగ్ స్టీల్ పరిశ్రమను ప్రైవేట్‌పరం చేసినట్టు, వైజాగ్‌కు రైల్వేజోన్ ఇవ్వనట్టు, ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనట్టు, ఏపీకి గుండెకాయ లాంటి పోలవరం నిర్మాణానికి తగినన్ని నిధులు ఇవ్వనట్టు….ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీకి మోదీ సర్కార్ చేసిన ద్రోహ చిట్టా చాలా పెద్దదే.
కానీ ఏపీ బీజేపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఇవే ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న బీజేపీ, మరోవైపు అందుకు విరుద్ధంగా అభివృద్ధి మాటలతో మభ్య పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మదనపల్లిలో నిర్వహించిన రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఏపీని ప్రధాని మోదీ తన పుత్రికగా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. అందుకే తన దత్త పుత్రికైన ఏపీని కేంద్రం అభివృద్ధి చేస్తోందన్నారు. రూ.8.16 లక్షల కోట్లతో ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను మాత్రం నెరవేర్చడానికి ప్రధానికి ఎందుకు మనసురాలేదో మరి!