తిరుపతి వెంకన్న అంటే విపరీతమైన భయభక్తులు చాలా మందికి వున్నాయి. టాలీవుడ్ జనాలు అంతా సినిమా విడుదల అంటే చాలు తిరుపతి వెళ్లి వస్తూనే వుంటారు. అయితే వీరిలో దిల్ రాజుది ఓ ప్రత్యేకత. ఆయన ఏకంగా వెంకన్నకు ఓ మాంచి ఆలయమే నిర్మించారు. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వహణ కూడా ఆయనే చూసుకుంటున్నారు.
తిరుపతి వెంకన్న అంటే అంత భక్తి వున్న దిల్ రాజును టీటీడీ బోర్డు మెంబర్ షిప్ వరిస్తోందని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. బహుశా ఇలా వార్తలు రావడానికి దీనికి రెండు కారణాలు వుండొచ్చు. ఒకటి ఇటీవలే రాయలసీమ జిల్లా వైకాపా ఎమ్మెల్యేలతో దిల్ రాజుకు దగ్గరి బంధుత్వం కలిసింది. అలాగే జగన్ ప్రమాణ స్వీకారానికి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారానికి దిల్ రాజు వెళ్లి వచ్చారు. ఇదంతా ఓ కారణం.
ఇక తెలంగాణలో తెరాస కీలకనేత కెటిఆర్ తో దిల్ రాజుకు మాంచి సంబంధాలు వున్నాయి. అందువల్ల తెలంగాణ కోటాలో ఆయనకు అవకాశం వస్తుందనే అంచనా కావచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం దిల్ రాజు టీటీడీ సభ్యుడు అయితే బాగానే వుంటుంది. గతంలో ఇండస్ట్రీకి చెందిన కొందరు టీటీడీలో ప్రాపకం సంపాదించి తన సంపాదనకు బాటలు వేసుకున్నారు అని విమర్శలు వున్నాయి. కానీ దిల్ రాజు అలా చేయరు. అది పక్కా. అందులో సందేహంలేదు.