పరుగుపందెంలో సెకెండ్ వచ్చా అన్నాడట వెనకటికి ఒకడు. ఎంతమంది పోటీ చేసారు అంటే ఇద్దరు అన్నాట్ట. అలాగ్గా వుంది. తెలుగుదేశం పార్టీ లోక్ సభ విప్ వ్యవహారం. మొత్తం సభ్యలు ముగ్గురు. అందులో ఒకరు లోకసభలో తెలుగుదేశం పక్ష నాయకుడు. మిగిలింది ఇద్దరు. వారిలో ఒకరు విప్ అంట. ముచ్చటగా మిగిలిన మూడో మెంబర్ ఎలాగూ డిప్యూటీ విప్ అవుతారు. అంటే గెలిచిన ముగ్గురికీ మూడు పోస్టులు అన్నమాట.
బహుశా అందుకే కావచ్చు. ఆ పదవికి బాబుగారు ఎంపిక చేసిన కేశినేని నాని, దానిని తిరస్కరించారు. అంతేకాదు..''‘‘నాకు లోక్‌సభలో విప్ పదవి అప్పగించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు. నాకంటే సమర్ధుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని కోరుతున్నా. అంత పెద్ద పదవికి నేను అనర్హుడినని భావిస్తున్నా. విప్ పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమించమని కోరుతున్నా’’ అంటూ సెటైర్ వేసారు. అంత పెద్దపదవి, సమర్థుడు అంటూ భలే పదాలు వాడారు తెలివిగా.
గల్లా జయదేవ్ కు లోకసభలో దేశం పక్ష నాయకుడు పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత నుంచి కాస్త అంటీ ముట్టకుండా వున్న కేశినేని నాని దీంతో మరింత అలిగి పార్టీకి దూరంగా వున్నారు. భాజపాలోకి వెళ్తారని, వాళ్లతో టచ్ లో వున్నారని టాక్ వుంది. ఇప్పుడు బాబు ఇచ్చిన పదవికి నో చెప్పడంతో వ్యవహారం ముదురుతోందని అర్థం అవుతోంది.