కాస్టింగ్ కౌచ్ మరోసారి తెరపైకొచ్చింది. మీ-టూ ఉద్యమం తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిందనుకున్న ఈ సంస్కృతి మరోసారి బయటపడింది. ఓ రాత్రి పడుకుంటే, విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని ఓ దర్శకుడు తనకు “ఆఫర్” ఇచ్చాడంటూ ఆరోపణలు చేసింది తమిళ నటి షమ్ము. ఆ దర్శకుడు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ దేవరకొండతో సినిమాలు చేయబోతున్న దర్శకుల లిస్ట్ లో అతడి పేరు కూడా ఉందని చెప్పిన షమ్ము, ఆ పేరును మాత్రం బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. దీంతోపాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. దీంతో పాటు మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై హీరో అనే మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
షమ్ము ఆరోపణల ప్రకారం చూసుకుంటే.. ప్రస్తుతం ఈ ముగ్గురిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ముగ్గుర్లో ఒకరు షమ్ముతో అనైతికంగా ప్రవర్తించి ఉంటారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా విజయ్ దేవరకొండ పేరును వాడుకుందనే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది ఈ హీరోయిన్.
జరిగిన ఈ ఘటనపై తను ఎలాంటి ఫిర్యాదులు చేయబోవడం లేదని స్పష్టంచేసింది షమ్ము. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటి చేదు అనుభవాలు సహజమని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని ప్రకటించింది. దీనిపై ఎవరికీ ఎలాంటి ఫిర్యాదు మాత్రం చేయనని అంటోంది.