అదే జరిగితే ఇక సంపూర్ణ పతనమే!

సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత… కాంగ్రెస్ సారథి రాహుల్ కు విపరీతమైన ఆగ్రహావేశాలు వచ్చేసినట్టుంది. కానీ, వాటిని ఎవరిమీద వ్యక్తం చేయాలో అర్థంకాక, ఆయన తన మీద తానే చూపించుకుంటున్నారు. పార్లమెంటరీ నేత…

సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత… కాంగ్రెస్ సారథి రాహుల్ కు విపరీతమైన ఆగ్రహావేశాలు వచ్చేసినట్టుంది. కానీ, వాటిని ఎవరిమీద వ్యక్తం చేయాలో అర్థంకాక, ఆయన తన మీద తానే చూపించుకుంటున్నారు. పార్లమెంటరీ నేత పదవిని కూడా తీసుకోలేదు. అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసేస్తానంటూ ఇవాళ్టిదాకా ఒకే పట్టుతో ఉన్నారు. చుట్టుపక్కల ఉండేవాళ్లంతా కలిసి పార్టీ సారథ్యానికి రాజీనామా చేయకుండా ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే ఏదో ఆవేశంలో రాజీనామా చేసేస్తానంటూ రాహుల్ బీరాలు పలకవచ్చు గానీ… వాస్తవంలో ఆయన ఆ పనిచేస్తే గనుక ఇక కాంగ్రెస్ పార్టీ సమూలంగా సర్వనాశనమై, దేశంలోనే అంతర్ధానమైపోయే రోజు ఎంతో దూరంలో ఉండదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఓడిపోయిన నాటినుంచి ‘నేను రాజీనామా చేస్తా’ అని రాహుల్ అనడమూ… ‘వద్దొద్దు మీరు అలా చేయొద్దు’ అని కాంగ్రెస్ నేతలు బతిమాలడమూ ఒక పెద్ద ప్రహసనంగా మారిపోయింది. తాను అధ్యక్షుడు అయిన తర్వాత సీనియర్ నాయకులు కొందరు సహకరించలేదని, అందువల్లనే పార్టీకి ఈ గతి పట్టిందని రాహుల్ అభిప్రాయం.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. తాను అధ్యక్షుడు కాకముందు ఆయన చేసిన పోరాటాలు కూడా పెద్దగా లేవు. పదవిలోకి వచ్చిన తర్వాతే.. కాస్త పార్టీకోసం ప్రభుత్వం మీద దాడిచేయడానికి కష్టపడ్డారు. అంతకుముందు ఆటవిడుపు రాజకీయమే నడిపారు. అందుకే ఆయన సారథ్యంలో తతిమ్మా నేతలు కూడా అలాగే పనిచేశారు. ఇప్పుడిక రాజీనామా కూడా చేసేస్తే పార్టీని కాపాడుకోవడం కాదు కదా… కప్పెట్టేయడం అవుతుందని ఆయనకు తెలియడం లేదు.

రాహుల్ తప్పుకుని సారథ్యం తమకు ఇచ్చినంత మాత్రాన… కష్టపడి పార్టీని గెలిపిస్తే తమను ప్రధానిని చేస్తారనే నమ్మకం ఆ పార్టీలో ఎవ్వరికీ లేదు. సోనియా కుటుంబం మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటే తప్ప… కాంగ్రెస్ తరఫున ప్రధాని కాగలమన్న ఆశ మరో నాయకుడికి కలగకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో.. రాహుల్ ఇప్పుడు కాడి పక్కన పడేస్తే.. ఇక ఆ పార్టీ గురించి ఎవ్వరూ పట్టించుకోరు. జరిగినంత కాలం జరుగుతుంది లెమ్మనుకుని… సీనియర్ నాయకులంతా టైంపాస్ రాజకీయం నడుపుతూ వస్తారు.

ఇది కాంగ్రెస్ పార్టీ సర్వనాశనానికి దారితీస్తుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ కు భవిష్యత్తు మీద ఆశ ఉంటే.. వాస్తవాల్ని అర్థం చేసుకుని, ఓటముల్ని దిగమింగుకుని ముందుకు సాగాల్సిందేనని పలువురు విశ్లేషిస్తున్నారు.

తండ్రీ కొడుకులు సాకులు వెతుకుతున్నారు