వలస కూలీలపై కేంద్రం చిన్నచూపు

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ ప్రాంత విద్యార్థులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బస్సు సర్వీసులు నడుపుతున్నవేళ, వలస కూలీలపై మాత్రం ఎవ్వరికీ ఎలాంటి దయ లేకపోవడం బాధాకరం. కేంద్రం కూడా కూలీలు రాష్ట్ర సరిహద్దులు…

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ ప్రాంత విద్యార్థులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బస్సు సర్వీసులు నడుపుతున్నవేళ, వలస కూలీలపై మాత్రం ఎవ్వరికీ ఎలాంటి దయ లేకపోవడం బాధాకరం. కేంద్రం కూడా కూలీలు రాష్ట్ర సరిహద్దులు దాటడానికి వీల్లేదని మరోసారి కరాఖండిగా చెప్పేసింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు.. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఎక్కడివారక్కడే ఉండాలని తాజాగా స్పష్టం చేసింది.

ఈరోజు నుంచి హాట్ స్పాట్ లు కాని ప్రాంతాల్లో నిబంధనలు సడలిస్తున్నట్టు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. వ్యవసాయ పనులు, నిర్మాణ పనులను కూడా ఇందులో చేర్చడంతో వలస కూలీలు తమ ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం దొరికిందని సంబరపడ్డారు. ఊరుకాని ఊరులో మగ్గిపోతున్న తమకు సొంత ఊరికి, లేదా పనిచేసే ప్రాంతానికి వెళ్లే వెసులుబాటు కల్పించాలని వారు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు వారి జీవితాల్ని మరింత దుర్బరం చేశాయి.

వలస కూలీలు ఏ రాష్ట్రంలో చిక్కుకుపోతే అక్కడే ఉండిపోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్ లోనే ఉండాలి. వీలైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం దాటకుండా వారికి రవాణా సౌకర్యం కల్పించి, పనులకు వెళ్లే అవకాశం ఇవ్వొచ్చు. అంటే షెల్టర్ హోమ్స్ లోనే ఉండి కూలీలు పనులు చేసుకోవాలన్నమాట.

ఈ పద్ధతి కాస్త ఆశాజనకంగానే ఉన్నా.. నిబంధనలు సడలిస్తే తమ సొంత ఊళ్లకు వెళ్లాలని చాలామంది వలస కూలీలు ఆశ పెట్టుకున్నారు. ఏప్రిల్ 14 తర్వాత మరోసారి లాక్ డౌన్ పొడిగించడంతో వీరంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రవాణా సౌకర్యం లేక, కాలి నడకను నమ్ముకున్నవారిని ఆకలి కబళిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉన్నచోట ఉండలేక, సొంత గూటికి చేరుకోలేక వలస కూలీలు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు. 

బర్త్ డే విషెస్ ఇలాక్కూడా చెప్పొచ్చా సాయిరెడ్డి గారూ