ఎన్నికలు ముగిసిన తర్వాత.. నాయకులు ఎవరికివారు గెలుపు ధీమాను వ్యక్తంచేస్తూ.. ఫలితాలు వచ్చేదాకా రోజులు వెళ్లబుచ్చడంలో ఆశ్చర్యం ఎంతమాత్రమూ లేదు. కానీ, గెలుపు గురించి కొందరు మాట్లాడడం చాలా కామెడీగా అనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. ‘మనం గెలుస్తున్నాం’ అని పదేపదే ఊదరగొడుతూ చంద్రబాబు, పార్టీ నాయకుల్లో ధైర్యం నింపడానికి పాట్లు పడుతోంటే… దానికి రివర్స్ గేర్ లో ‘నేను గెలుస్తున్నా’ అని సొంత అనాలిసిస్ చెబుతూ.. సోమిరెడ్డి అధినేతలో ధైర్యం నింపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
మంత్రివర్గ సమావేశానికి ముందు చంద్రబాబునాయుడు మంత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అనుకున్న దానికంటె బంపర్ మెజారిటీతో గెలుస్తాం అని సెలవిచ్చేశారు. దీనికి ప్రతిగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నుంచి పోటీచేసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన గెలుపు గురించి ఓ ఘనమైన లెక్క చెప్పారు. ‘‘నా నియోజకవర్గంలో 1.10 లక్షల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. ఎన్నికలకుముందు మూడునెలల్లోనే వారికి 98 కోట్ల రూపాయలు అందాయి. ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నేను గెలుస్తాను’’ అని ఆయన చెప్పుకున్నారు.
సోమిరెడ్డి లెక్కల ప్రకారం.. ఆయన నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు మూడునెలల్లో 1.10 లక్షల మంది ఓటర్లకు సగటున 8181 రూపాయల వంతున పథకాల రూపంలో పంచిపెట్టారన్న మాట. ఇలా ప్రభుత్వం నుంచి సేవలు అందుకున్న ప్రతి ఒక్కడూ అదే పార్టీకి ఓటు వేసేట్లయితే.. ఈ దేశంలో నిత్యం ఏకపార్టీ పాలనే బహుశా నడుస్తుండేదేమో. కాగితాల మీద, గణాంకాల్లో సంక్షేమం విషయంలో తీసిపోయిన పార్టీలు ఏమీలేవు.
ప్రజలు- పథకాలతో పాటు ప్రభుత్వ పనితీరు, చిత్తశుద్ధి, సామర్థ్యం, కేవలం సంక్షేమం పేరిట తమకు బిస్కట్ లు వేయడం మాత్రమే కాకుండా.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే సత్తా… తదితర కారణాలన్నీ గమనించే ఓటు వేస్తారనే ప్రాథమిక సత్యం కూడా సోమిరెడ్డికి తెలియకపోతే ఎలాగ? సోమిరెడ్డి చెప్పిన విశ్లేషణ నిజమయ్యేట్లయితే.. రాష్ట్రంలో తెలుగుదేశానికి 175 సీట్లు దక్కుతాయి. ఆ పార్టీ చారిత్రాత్మకమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుంది అని అనుకోవాల్సిందే కదా!