పగ్గాలు లేని పారితోషికాలు

సినిమా తీయాలంటే ఏం కావాలి? ఇది ఓ బేసిక్ క్వశ్చను. దీనికి ఎవరైనా ఏం సమాధానం చెప్పగలరు? చాలా రకాలుగా చెప్పగలరు. డబ్బులు కావాలి. అదే బేసిక్ సమాధానం కూడా. కానీ టాలీవుడ్ లో…

సినిమా తీయాలంటే ఏం కావాలి? ఇది ఓ బేసిక్ క్వశ్చను. దీనికి ఎవరైనా ఏం సమాధానం చెప్పగలరు? చాలా రకాలుగా చెప్పగలరు. డబ్బులు కావాలి. అదే బేసిక్ సమాధానం కూడా. కానీ టాలీవుడ్ లో ఓ సినిమా తీయాలంటే కావాల్సింది డేట్ లు. అయితే హీరో లేదా డైరక్టర్. ఓ మంచి హీరో లేదా మంచి డైరక్టర్ డేట్ లు. సినిమా తీయాలంటే ముందుగా కావాల్సింది అవే.

నిజంగా సినిమాను ప్రేమించి, మంచి సినిమా తీయాలనుకుంటే హీరో, డైరక్టర్ల డేట్ లు కన్నా, మంచి కథ, కాస్త డబ్బులు వుంటే తీయొచ్చు. కానీ మాంచి వ్యాపారం చేసుకోవాలి, మాంచి లాభాలు కళ్ల చూడాలి అంటే మాత్రం కావాల్సింది డబ్బులు కాదు. హీరోలు, డైరక్టర్ల డేట్ లు. అవి వుంటే డబ్బులు అవే పుట్టుకువస్తాయి. 

ఇదో సర్కిల్. హీరో డేట్ లు వుంటే డైరక్టర్ ల డేట్ లు వస్తాయి. డైరక్టర్ డేట్ లు వుంటే హీరోల డేట్ లు వస్తాయి. ఈ రెండింటిలో ఏది వున్నా సినిమా వస్తుంది. సినిమా వస్తే చాలు డబ్బులు పుట్టుకు వస్తాయి. కానీ ఇలా డబ్బులు పుట్టుకురావాలంటే డబ్బులు జల్లేయాలి.

అవును…డబ్బులు జల్లేయాలి. హీరోలకు, డైరక్టర్లకు డబ్బులు జల్లేస్తేనే పెద్ద సినిమా చేతిలోకి వస్తుంది. కానీ ఈ డబ్బులు జల్లేయడం అన్నది కేవలం పెద్ద సినిమాలకే పరిమితం కావడం లేదు. రానురాను మీడియం హీరోలు, డైరక్టర్ల వరకు పారితోషికాల కోసం డబ్బులు జల్లేయడం అన్న పాయింట్ కామన్ పాయింట్ గా మారిపోతోంది.

కాలం మారుతోంది. బడ్జెట్ లు మారుతున్నాయి. సినిమా ప్రొడక్షన్ లో చాలా కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటే రెమ్యూనిరేషన్ విధానాల్లో మార్పులు వస్తున్నాయి. చిన్న వాళ్లకు చిరుతిళ్లు, పెద్ద వాళ్లకు ఫలహారాలు అన్నట్లు మారుతోంది వ్యవహారం. కాస్త పేరు తెచ్చుకుంటే చాలు..డిమాండ్ లు ఒక లెక్కలో వుంటున్నాయి. 

చాలా వరకు హీరోలు, డైరక్టర్ల డిమాండ్ డబ్బు దగ్గర ఆగిపోతోంది. కానీ కొందరు హీరోలు, డైరక్టర్ల డిమాండ్ లాభాల్లో వాటా వరకు వెళ్లిపోతోంది. కొందరు అయితే అసలు నిర్మాతను జస్ట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ కు తగ్గించేస్తున్నారు. ప్రొడక్షన్ రెమ్యూనిరేషన్ టైపులో రివర్స్ లో నిర్మాతలకు కొంత ఇచ్చి చేతులు కడిగేస్తున్నారు.

టాప్ రెమ్యూనిరేషన్లు

తెలుగు సినిమా రంగంలో ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లు ముగ్గురూ టాప్ రెమ్యూనిరేషన్ లెవెల్ లో వున్నారు. యాభై నుంచి అరవై అయిదు కోట్ల రేంజ్ లో పవన్, మహేష్ రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వుంది. తమ సినిమాలకు వచ్చే నాన్ థియేటర్ హక్కుల అమౌంట్ కు సరి సమానంగా రెమ్యూనిరేషన్ కాలుక్యులేషన్లు వుంటున్నాయని బోగట్టా. 

పవన్ తన వకీల్ సాబ్ కు 65 కోట్లు తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ వుంది. మహేష్ రెమ్యూనిరేషన్ సినిమా సినిమాకు మారుతూ వుంటుంది. పెరగడమే తప్ప తగ్గడం అయితే ప్రస్తుతానికి లేదు. ప్రభాస్ వీళ్లిద్దరి మీద ఓ మెట్టు పైనే వున్నారు. ప్రభాస్ కు హిందీ మార్కెట్ బాగుండడం అన్నది ఓ యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. వీళ్లు ముగ్గురు తరువాత బన్నీ రెమ్యూనిరేషన్ వుంది. అది మొన్న మొన్నటి వరకు కానీ పుష్ప సినిమాతో బన్నీ కూడా వీళ్ల సరసన చేరిపోయినట్లే.  

ఇప్పటి వరకు బన్నీ రెమ్యూనిరేషన్ తీసుకుంటూ, తన వాళ్లయిన ఎవరో ఒకరికి ఇంత శాతం వాటా అంటూ తీసుకుంటూ వస్తున్నారు. కానీ పుష్ప సినిమా రెండో భాగం నుంచి ఈ విధానానికి స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇప్పటి వరకు ఇలాంటి సిస్టమ్ లు అంటూ పెట్టుకోలేదు. కేవలం రెమ్యూనిరేషన్ తీసుకోవడమే. ఏదేమైనా ఇఫ్పటి వరకు 35 కోట్ల వరకు బన్నీ లెక్కలోకి సినిమా నుంచి వెళ్తోంది. పుష్ప పార్ట్ 2 కు ఇది యాభై కు చేరినట్లు వినిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు 35 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాకు మాత్రం ఇరవై కోట్లు మాత్రమే తీసుకున్నట్లు బోగట్టా. ఎన్టీఆర్ విషయానికి వస్తే మిగిలిన హీరోల కన్నా ఉదారంగానే వుంటూ వస్తున్నారు. అరవింద సమేత సినిమా టైమ్ లో ఎన్టీఆర్ రెమ్యూనిరేషన్ పాతిక కోట్లకు కాస్త అటు ఇటుగానే వుంది. ఆర్ఆర్ఆర్ కు ముఫై అయిదు కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇకపై ఎన్టీఆర్ కూడా లాభాల్లో వాటా తీసుకోబోతున్నారు. తన సోదరుడి కళ్యాణ్ రామ్ బ్యానర్ ను యాడ్ చేయాలన్నది సంకల్పం. ఎన్టీఆర్ స్వంత బ్యానర్ పెడతారని వార్తలు వున్నాయి కానీ అవి నిజం కాదని తెలుస్తోంది. మొత్తం మీద ఎన్టీఆర్ యాభై కోట్ల రేంజ్ దాటాలంటే ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సి వుంటుంది.

టాలీవుడ్ కే టాప్ సీట్ లో వున్నారు మెగాస్టార్ చిరంజీవి.  ఒకప్పుడు ఆయన పీక్ డేస్ లో ఏమో కానీ ఇప్పడు మాత్రం ఇంకా టాప్ రెమ్యూనిరేషన్ కు చేరలేదు. రీ ఎంట్రీ తరువాత చేసినవి రెండూ స్వంత సినిమాలే. ఆచార్య సినిమాకు 35 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ  సినిమా తరువాత ఏమయినా ఫిగర్ అటు ఇటు మారుతుందేమో చూడాలి.

అలాగే సీనియర్ హీరోలు వెంకీ, నాగ్ మొన్నటి వరకు అయిదారు కోట్ల రేంజ్ లోనే వున్నారు. వెంకీ ప్రాజెక్టు ను బట్టి డీల్ లు వుంటాయి. రవితేజ మాత్రం పది నుంచి పన్నెండు కోట్లు తీసుకుంటున్నారట. బాలయ్య మార్కెట్ ఎలా వున్నా, ప్రస్తుతం ఆయన కూడా పది కోట్ల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

మిడ్ రేంజ్ హీరోల విషయానికి వస్తే నాని, విజయ్ దేవరకొండ లీడ్ లో వున్నారు. తొమ్మిది నుంచి పది కోట్ల రేంజ్ లో తీసుకుంటున్నారు. అయిదారు కోట్ల రేంజ్ లో శర్వానంద్, నితిన్, గోపీచంద్ వున్నారు. హిట్, ప్లాపులు వీళ్ల రెమ్యూనిరేషన్ ను పెద్దగా ప్రభావితం చేయడం లేదు.  సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇంకా బిలో ఫైవ్ క్రోర్స్ లోనే వున్నారు. ఎఫ్ 3 మాత్రం మినహాయింపు.

చిన్న హీరోల రెమ్యూనిరేషన్ కోటి దగ్గర ప్రారంభమై, రెండు కోట్ల వరకు వుంటోంది. నాగశౌర్య రెండుకోట్లకు కాస్త అటుగానే డిమాండ్ చేస్తున్నారు. నిఖిల్, రాజ్ తరుణ్ ల రెమ్యూనిరేషన్లు ఒకప్పుడు బాగానే వుండేవి కానీ, ప్రస్తుతం ఒప్పుకున్నవి తక్కువలోనే వున్నాయి. విష్వక్ సేన్ కూడా రెండుకోట్ల మేరకు తీసుకుంటున్నారు. కార్తికేయ ఇంకా ఈ రేంజ్ కు రాలేదు.

డైరక్టర్లు కూడా

సినిమాకు డైరక్టర్ నే కీలకం. అయితే రెండు మూడు హిట్ లు పడితే తప్ప డైరక్టర్లకు సరైన రెమ్యూనిరేషన్ పడదు. అది కూడా వరుస హిట్ లు వస్తేనే. టాప్ రేంజ్ కు చేరుకున్న డైరక్టర్ల రెమ్యూనిరేషన్ ఓ రేంజ్ లో వుంటుంది. డైరక్టర్లలో రాజమౌళి లెక్క వేరు. ఆయన తరవాత త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ లైన్ లో వున్నారు. వీళ్లు పాతిక కోట్ల రేంజ్ లో తీసుకుంటున్నారని వార్తలు అయితే వున్నాయి.

నిర్మాతలతో వీళ్లకు వుండే ఒప్పందాలు వేరు. అవి చాలా క్లోజ్డ్ వాలెట్ లోనే వుంటున్నాయి. సుకమార్ లాభాల్లో కొంత శాతం వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది కొరటాల శివ దాదాపుగా సినిమాకు ముఫై నుంచి ముఫై అయిదు కోట్లు కిట్టుబాటు అయ్యేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

అనిల్ రావిపూడి ప్రస్తుతం పది కోట్ల కు కాస్త అటుగానే వున్నారు. మిడ్ రేంజ్ లో దర్శకుడు మారుతి టాప్ లో వున్నారు. ఆయన ఏడు కోట్లకు కాస్త అటు ఇటుగా తీసుకుంటున్నారు. మారుతితో సినిమా చేస్తే ఖర్చు చాలా కలిసి వస్తుందని, సినిమాకు లాభాలు అన్నది గ్యారంటీ అనీ ఓ టాక్ వుంది. 

అందువల్లే ఆయనకు రెమ్యూనిరేషన్ స్పెషల్ గా మారింది. ఆ తరువాత మిడ్ రేంజ్ డైరక్టర్లు చాలా మందే వున్నారు కానీ ఎవ్వరి రెమ్యూనిరేషన్ ఇంకా అయిదు కోట్లు క్రాస్ చేయలేదు. చాలా మంది మిడ్ రేంజ్ డైరక్టర్ల రెమ్యూనిరేషన్ రెండు నుంచి అయిదు కోట్ల మధ్యనే దోబూచులాడుతోంది.

పూజ, రష్మిక టాప్

హీరోయిన్ల విషయానికి వస్తే, పూజాహెగ్డే, రష్మిక, లేటెస్ట్ గా ఉప్పెన ఫేమ్ కృతిక శెట్టి డిమాండ్ లో వున్నారు. వీళ్లంతా కోటి నుంచి రెండు కోట్ల రేంజ్ లో వున్నారు. మిగిలిన వారంతా సినిమాలు చేస్తూనే వున్నారు కానీ మరీ కోటి దాటేసిన పారితోషికాలు అయితే లేవు. 

అది రాశీ ఖన్నా, అయినా రకుల్ అయినా కూడా. సమంత సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోంది. అందువల్ల ఆమె కూడా పూజా, రష్మిక ల మాదిరిగా రెండు కోట్ల రేంజ్ లో వున్నారు. నయన తార భారీగా డిమాండ్ చేస్తారు. అందుకే తెలుగులో మరీ తప్పకపోతే తప్ప తీసుకోవడానికి జంకుతారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు

హీరోలు, హీరోయిన్ల సంగతి అలా వుంచితే మిగిలిన నటులు రోజుల లెక్కలోనే తీసుకుంటారు. రోజుకు పది వేల నుంచి మూడు లక్షల వరకు తీసుకునే నటులు మనకు వున్నారు. డిమాండ్ లో వున్న రావు రమేష్ లాంటి వాళ్లు లక్షల్లో తీసుకుంటారు. 

రెగ్యులర్ గా ప్రతి సినిమాలో చిన్న చితక పాత్రల్లోకనిపించేవారు రోజుకు పది వేల నుంచి పాతిక వేల వరకు తీసుకుంటారు. కమెడియన్ కమ్ హీరోలు సప్తగిరి, సునీల్ మాత్రం సినిమాను బట్టి లక్ష నుంచి మూడు లక్షల వరకు రోజుకు తీసుకుంటారు. లేదా ఒక్కోసారి ప్యాకేజ్ కింద తీసుకుంటారని టాక్.

టెక్నీషియన్లు

నటీనటుల తరువాత రెమ్యూనిరేషన్ గురించి ఆలోచించాల్సింది సినిమాటోగ్రాఫర్లు, మ్యూజిక్ డైరక్టర్లు. దేవీశ్రీప్రసాద్ రెమ్యూనిరేషన్ రెండు నుంచి మూడు కోట్లు రేంజ్ లో కాస్త భారీగానే వుంటుందని తెలుస్తొంది. 

థమన్ కొన్నాళ్ల క్రితం వరకు యాభై లక్షలకు వచ్చేసారు కానీ, తొలిప్రేమ నుంచి టర్న్ తీసుకున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో ఆయన లెక్క ఫుల్ గా మారిపోయింది. అనిరుధ్ కూడా భారీ రెమ్యూనిరేషన్ నే. కానీ తెలుగులో తీసుకునేవారు తక్కువ. పైగా మ్యూజిక్ డైరక్టర్ల రెమ్యూనిరేషన్ అన్నది ప్యాకేజ్ ల లెక్కన వుంటుంది. సినిమా సైజ్, క్వాలిటీ ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి.

సినిమాటోగ్రాఫర్లు కూడా ఈ మధ్య గట్టిగానే తీసుకుంటున్నారు. టెక్నాలజీ పెరిగింది. క్వాలిటీ డిమాండ్ పెరిగింది. అందువల్ల టాప్ సినిమాటోగ్రాఫర్ల రెమ్యూనిరేషన్ కోటిన్నర దాటేసింది. ఇక ఆపైన వాళ్ల వాళ్ల డిమాండ్, డేట్ లు బట్టి నడుస్తోంది.

ఖర్చులు అదనం

నటీనటులు అయినా, టెక్నీషియన్లు అయినా రెమ్యూనిరేషన్ ఇస్తే సరిపోదు. ఖర్చులు చాలా వుంటాయి. హీరో హీరోయిన్ల పర్సనల్ స్టాఫ్ ఖర్చులు అన్నీ ఎప్పటికప్పుడు చేసే సినిమా ఖాతాలోనే పడతాయి. 

బయట నుంచి వచ్చేవారికి హోటల్ ఖర్చులు భరించాల్సిందే. ఇక కేరవాన్ అన్నది చాలా చిన్న విషయం. ఇవన్నీ కాక జి ఎస్ టీ ని కూడా నిర్మాతే భరించాలి. వాళ్ల రెమ్యూనిరేషన్ మీద పడే జి ఎస్ టి ని నిర్మాత కట్టాల్సిందే. ఇది కాక డైరక్టర్లు కొందరికి స్వంత ఆఫీసులు వుంటాయి. సినిమా టైమ్ లో వాళ్ల ఆఫీసు ఖర్చులు కూడా భరించాల్సిందే.

డిమాండ్ ..సప్లయ్

ఏదేమైనా రెమ్యూనిరేషన్ అన్నది డిమాండ్ సప్లయ్ సూత్రం మీదే వుంటుంది. నాన్ థియేటర్ ఎంత వస్తుంది. థియేటర్ మార్కెట్ ఎంత అవుతుంది. టోటల్ ఎంత వర్కవుట్ అవుతుంది అన్నవి అన్నీ లెక్కలు కట్టే నిర్మాతలు ముందుకు వెళ్తారు. 

అంతే తప్ప గుడ్డిగా అడిగారని ఇచ్చేసేంత అమాయకులు కూడా లేరు. కానీ కొంత ర్యాట్ రేస్ అయితే టాలీవుడ్ లో వుంది. అదే హీరోలకు రక్ష. వారి రెమ్యూనిరేషన్లకు శ్రీరామ రక్ష.

ఆర్వీ