రివ్యూ: పేట
రేటింగ్: 2.75/5
బ్యానర్: సన్ పిక్చర్స్
తారాగణం: రజనీకాంత్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికీ, సిమ్రన్, త్రిష, బాబీ సింహా, శశికుమార్, సనంత్, మేఘా ఆకాష్, మాళవిక మోహనన్ తదితరులు
సంగీతం: అనిరుధ్
కూర్పు: వివేక్ హర్షన్
ఛాయాగ్రహణం: ఎస్. తిరునావక్కరసు
నిర్మాణం: సన్ పిక్చర్స్
రచన, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
విడుదల తేదీ: జనవరి 10, 2019
''నా పని అయిపోయిందనుకున్నార్రా?'' అని అడుగుతాడు రజనీకాంత్ ఓ పవర్‌ఫుల్ ఫైట్ సీన్‌తో ఎంట్రీ ఇచ్చాక. ఆయన అడిగిన ప్రశ్న అక్కడ రౌడీలని కాదు… ఇటీవల ఆయన ఫ్లాపులు చూసి రైట్ ఆఫ్ చేసేస్తున్న వారిని, ఆయన తర్వాత రాజ్యమేలుతున్న హీరోలని అడిగాడా ప్రశ్న. 'పేట' చిత్రం ఈ ప్రశ్నకి సమాధానంగా తీసినట్టే అనిపిస్తుంది. వయసైపోయిన రజనీలో మునుపటి చురుకు లేదు, ముప్పయ్‌లలో వున్న ఎనర్జీ అరవైలలో కనబడడం లేదు, మోషన్ క్యాప్చర్‌కి మినహా సాలిడ్ యాక్షన్‌కి ఆయన సూట్ కావడం లేదు… అని విమర్శించే వారందరికీ మునుపటి రజనీని మళ్లీ గుర్తు చేసి, ఇప్పటి రజనీలో ఇంకా ఫైర్ వుందని తెలియజేయడానికి ఆయన వీరాభిమాని కార్తీక్ సుబ్బరాజ్ తీసిన చిత్రమిది.
రజనీ నడక, నవ్వు, నాట్యం, తల వెనుక చేతులు పెట్టుకునే స్టయిల్, కూర్చునే పోస్చర్… ఇలా ఆయనలో అభిమానులు మెచ్చినవన్నీ తన సినిమాలో క్యాప్చర్ చేసేలా కార్తీక్ సుబ్బరాజ్ సీన్స్ డిజైన్ చేసుకున్నాడు. ఒక వీరాభిమాని తన అభిమాన హీరోతో కెమెరా ద్వారా రొమాన్స్ చేస్తే ఎలా వుంటుందనేదానికి 'పేట' ఫస్ట్ హాఫ్ ఒక మంచి ఉదాహరణ. అడుగడుగునా హీరోయిజం, అపరిమితమైన వినోదం, అలుపెరుగని రజనీయిజంతో నిండిన 'పేట'తో రజనీ పనైపోలేదింకా అని ఒప్పేసుకోవాలి ఎవరైనా. అయితే… అక్కడికి సినిమా సగమే అయింది. రజనీకాంత్‌ని నిలబెట్టి, నడిపించి, నవ్వించి, కవ్వించి అభిమానుల దిల్ ఫుల్‌గా ఖుష్ చేసేసిన కార్తీక్ సుబ్బరాజ్ వడ్డించిన 'పిజ్జా' మరో సగం బ్యాలెన్స్ వుంది.
ఇక్కడి వరకు రజనీ సినిమా చూసారుగా, ఇక నా సినిమా చూడండి అనుకున్నాడో ఏమో, సడన్‌గా ట్రాక్ మార్చేసి వినోదాన్ని సైడ్‌కి నెట్టేసి, రజనీ చేతిలో తుపాకీ పెట్టేసి ఒక గ్యాంగ్‌స్టర్ సినిమాగా మార్చేసాడు. పేట అంటూ పరిచయం చేస్తే 'బాషా' రేంజ్ ఫ్లాష్‌బ్యాక్ ఏదో వుంటుందని అనుకుంటే, ఒక సాదాసీదా ఫ్లాష్‌బ్యాక్‌లో పేట ఎవరనేది తెలియజేస్తాడు. అటు తర్వాత 'పగ' తీర్చుకోవాలంటూ 'ప్రేమ'కి టైమ్ లేదని, ఇక అద్భుతాలు చూపిస్తానంటూ బయలుదేరతాడు. ఇక అక్కడ్నుంచీ పేట దారి తప్పిపోయి, అంతవరకు అలరించిన కాళి కనుమరుగైపోయి యాక్షన్ ఓవర్‌డోస్‌తో, ఏమీ లేని కథలో ఏదో వుందనే భ్రమ కల్పించే ప్రయత్నం బెడిసికొట్టడంతో ద్వితియార్ధం కిచిడీ అయిపోతుంది.
రజనీకాంత్ 'బాషా' చిత్రం థీమ్‌నే తీసుకుని కార్తీక్ సుబ్బరాజ్ స్టయిలిష్‌గా ప్రెజెంట్ చేసాడు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ బాషాలో కనీసం పదో వంతు లేకపోయినా, అంతకుముందు కనిపించే వార్డెన్ క్యారెక్టర్ మాత్రం ఎన్నో రెట్లు వినోదాన్నిస్తాడు. రజనీకాంత్‌ని స్టయిలిష్‌గా చూపించాలి, ఆయన మేనరిజమ్స్‌ని ఇంత బాగా క్యాప్చర్ చేయాలి వంటి ఆలోచనలని మించి కార్తీక్ సుబ్బరాజ్ కథ, కథనాల గురించి ఆలోచించనట్టున్నాడు. అందుకే రజనీకాంత్ మినహా మిగిలిన పాత్రధారులు ఎవరికీ సరిగ్గా డెవలప్ చేసిన క్యారెక్టరే రాయలేదు. హీరోయిన్లు ఇద్దరూ అతిథి పాత్రధారుల్లా అనిపిస్తారు. విలన్‌గా నవాజుద్దీన్ సిద్ధికీ బాలీవుడ్‌లో ఎన్నో మరపురాని క్యారెక్టర్లు చేసాడు. అతను విశ్వప్రయత్నం చేసినా కానీ ఇందులోని సింహాచలం పాత్రని కేవలం ఓకే అని మాత్రం అనిపించగలిగాడు.
అజయ్ లేదా సుబ్బరాజు చేసే పాత్రలాంటిది విజయ్ సేతుపతికి ఎందుకు ఆఫర్ చేసాడో కార్తీక్‌కే తెలియాలి. ఎలాంటి పాత్రలోకి అయినా ఈజీగా పరకాయ ప్రవేశం చేసేసే సేతుపతి ఈ చిత్రంలో తన అయోమయం నవ్వులానే ఏమి చేయాలో తెలియని అయోమయంలో వుండిపోయాడు. జిగరదండాలో బాబీ సింహాని అద్భుతంగా చూపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్ ఈసారి అతడికీ డమ్మీ క్యారెక్టరే ఇచ్చాడు. శశికుమార్‌దీ అదే పరిస్థితి. యువ జంటగా మేఘా ఆకాష్, సనంత్ చేసినదీ ఏమీ లేదు. కేవలం రజనీకాంత్‌ని 'ఎలా చూపించాలి' అనే దానిపై పెట్టిన దృష్టి 'ఎందులో చూపించాలి' అనే దానిపై సగమైనా పెట్టినట్టయితే ఈ పేట నిజంగానే రజనీకాంత్ ఈజ్ బ్యాక్ అనిపించేది.
ఒక్కసారి ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి రజనీకాంత్ సీరియస్‌గా రివెంజ్‌లోకి వెళ్లిన తర్వాత ఇక స్టఫ్ లేక ఈ చిత్రం దారుణంగా తేలిపోయింది. అంతవరకు వున్న హుషారు మొత్తం హరించేసి ఎప్పుడవుతుందా అని ఎదురుచూసేంతలా విసిగిస్తుంది. దానికి తోడు త్వరగా ముగించేసి పంపాల్సినది కాస్తా అనవసరంగా సాగదీసి ఇంకాస్త అసహనం పెంచేస్తుంది. మళ్లీ పతాక సన్నివేశంలో రజనీ మెరిసినా కానీ అంతకుముందు అలముకున్న చీకటిని మరిపించలేకపోతుంది.
రజనీకాంత్ తన పాత్రని చాలా ఎంజాయ్ చేస్తూ నటించారు. ఆయన నడకలో, కదలికల్లో మునుపటి చురుకు తగ్గినా కానీ చాలా వరకు మేనేజ్ చేసేసారు. అభిమానులకి మాత్రం ఒకప్పటి రజనీని మళ్లీ కళ్ళముందుకి తెచ్చారు. ఇటీవల ఆయనతో పని చేస్తోన్న దర్శకులు ఏ ఎలిమెంట్స్ మిస్ చేస్తున్నారో ఎత్తి చూపించారు. రజనీని 'హీరోలా' చూపించాలనే దర్శకుడి తపనకి సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు తోడొచ్చారు. అనిరుధ్ తన అద్భుతమైన నేపథ్య సంగీతంతో అలరిస్తే, వెలుతురు-చీకటి మిశ్రమంతో ఛాయాగ్రాహకుడు ఇచ్చిన ఎలివేషన్స్ నెక్స్‌ట్ లెవల్ అనిపిస్తాడు.
రజనీకాంత్ ఈజ్ బ్యాక్ అని ఇంటర్వెల్‌కి అనిపించేసిన 'పేట' ఆ తర్వాత మాత్రం 'నో… హీ వెంట్ బ్యాక్' అనుకునేలా చేస్తుంది. ఒక మంచి అవకాశాన్ని సగమే వినియోగించుకుంటే ఎలా వుంటుందో, ఒక మంచి వినోదాన్ని సగమే ఇచ్చి శాటిస్‌ఫై అవమంటే ఏమనిపిస్తుందో 'పేట' అలా వుంది.
బాటమ్ లైన్: రజనీ ఈజ్ బ్యాక్, కానీ…!
– గణేష్ రావూరి