జల్లికట్టు విషయంలో తమిళ సమాజం అంతా ఏకమయ్యింది. అది సంప్రదాయమన్నది వారి వాదన. కేంద్రం దిగొచ్చింది.. సుప్రీంకోర్టు తీర్పు సైతం అటకెక్కింది. తమిళ సమాజం జల్లికట్టు ఉద్యమంలో అద్భుత విజయాన్ని సాధించింది. కానీ, తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి సంబంధించి తమిళ సమాజం 'జల్లికట్టు' తరహాలో స్పందించలేదన్న విమర్శలున్నాయి. ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు మళ్ళీ తమిళనాడు వార్తల్లోకెక్కింది. ఈసారి శీతల పానీయాలు.. అదేనండీ ’కూల్ డ్రింక్స్‘ మీద 'బ్యాన్' విధించడం ద్వారా.
డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు.. ఇలా ఏదన్నా అనారోగ్యంతో డాక్టర్ దగ్గరకి వెళితే, ముందుగా 'కూల్ డ్రింక్స్' మానెయ్యమనే సలహా లాంటి హెచ్చరిక విన్పిస్తుంది. ఆరోగ్యానికి అంత హానికరం అవి. కానీ, కూల్ డ్రింక్‌ని చూస్తే నోరూరాల్సిందే. అలాంటిది, తమిళనాడులో 'కూల్ డ్రింక్స్'పై బ్యాన్ ఎంతవరకు ఫలితాన్నిస్తుందట.? అన్న అనుమానాలు కలగడం సహజమే. అయితే, తమిళనాడులో గత కొంతకాలంగా కూల్ డ్రింక్స్‌పై అనధికారిక బ్యాన్ కొనసాగుతోంది. దాదాపు 20 లక్షల మంది వ్యాపారులు, కూల్ డ్రింక్స్ అమ్మకాల్ని నిలిపేశారు. నమ్మగలమా.? నమ్మి తీరాల్సిందే.
మార్చి 1వ తేదీ నుంచి ఈ ఉద్యమం మరింత ఉధృతం కానుంది. పెప్సీ, కోకాకోలా.. దేశంలో అత్యంత ప్రజాదరణ వున్న కూల్ డ్రింక్స్ కంపెనీలు. ఒకప్పుడు దేశీయ సంస్థలు ఈ కూల్ డ్రింక్స్ తయారీ, అమ్మకాల్ని నిర్వహించేవి. ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్లు, దేశీయ సంస్థల్ని ఓవర్ టేక్ చేసేశాయి. దాదాపుగా దేశీయ కూల్ డ్రింక్స్ సంస్థలు అంతరించిపోయినట్లే. అన్నట్టు, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో 'ఆర్టోస్' అనే ఓ బ్రాండ్ కూల్ డ్రింక్ ఇప్పటికీ, అక్కడివారి మన్ననలు అందుకుంటుందన్న విషయం ఎంతమందికి తెలుసు.?
ఇక, తమిళ తంబిలు కూల్ డ్రింక్స్ బ్యాన్ గురించి చెబుతున్న విషయమేంటంటే, ఆయా సంస్థలపై తమకెలాంటి కక్షా లేదనీ, కేవలం దేశీయ సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతోనే వాటిని బ్యాన్ చేశామనీ చెబుతున్నారు. అదే సమయంలో, కూల్ డ్రింక్స్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నది వారి వాదన. చిత్రంగా వ్యాపారులే కాదు, కూల్ డ్రింక్స్‌ని చూడగానే లొట్టలేసే సామాన్యులు సైతం, వాటికి దూరంగా వుంటున్నారట. అందుకే మరి, తమిళ తంబికి 'జై' కొట్టు గురూ.. అనేది.
అమెరికాలోనే అమెరికా వస్తువుల్నే వాడాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెగేసి చెబుతున్నప్పుడు, ఇండియాలో కేవలం ఇండియాకి చెందిన వస్తువుల్నే వాడాలనే డిమాండ్ తెరపైకి రావడంలో వింతేముంది.? స్వాతంత్య్ర పోరాటంలో మనోళ్ళు ఎప్పుడో 'విదేశీ వస్తు బహిష్కరణ' చేసేశారు కదా.! ఏదిఏమైనా, తమిళనాడు జల్లికట్టు ఉద్యమం, కూల్ డ్రింక్స్‌పైనా జనంలో చైతన్యం తెచ్చిందన్నమాట. దేశవ్యాప్తంగా ఈ చైతన్యం వస్తే ప్రజారోగ్యమూ మెరుగుపడ్తుంది కదా.?