ప్రేమ పాటలు మామూలుగా జనాలకు నచ్చడం వేరు.. ప్రేమలో పడినవారికి నచ్చడం వేరు. ప్రేమలో పడినవారు ప్రేమ పాటలు వింటే తెగ ఫీలైపోతారు. తమవాళ్లనే ఊహించుకుంటూ ఓ తెగ ఇదైపోతారు. అంతకాదు కానీ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సంగతి చూస్తే కాస్త అనుమానంగా వుంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఫుల్ లెంగ్త్ లో నటించిన సినిమా శతమానం భవతి. ఈ సినిమాలో హీరో శర్వాతో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. అదే అడిగితే బావామరదళ్ల క్యారెక్టర్లు కదా ఆ మాత్రం వర్కవుట్ అవ్వకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నించింది కూడా.
ఇదిలా వుంటే ఈ మలయాళీ అమ్మడు ఇటీవల యూట్యూబ్ లోకి వదిలిన ఓ వీడియో ఇప్పటికి రెండు లక్షలకు పైగా హిట్ లు తెచ్చేసుకుంది. ఇంతకీ ఏమిటీ వీడియో అంటే.. శతమానం భవితిలోని 'నాలో నువ్వు, నీలో నేను' పాటకు డబ్ స్మాష్ అన్నమాట. సరే ఆ పాటకు సినిమాలో నటించింది కాబట్టి అలాగే మళ్లీ మరోసారి నటించింది అనుకుంటే పొరపాటే. ఆ పాట, దాని సాహిత్యం, దాని ప్రతిపదార్థం అన్నీ తెలుసుకుని, మనసుతో స్పందించి, మొహంలోకి ఆ భావాలు అన్నీ తీసుకువచ్చి మరీ వీడియో చేసింది. ఇది చూసిన అందరూ అనుపమ కొంపదీసి ఎవరితోనన్నా ప్రేమలో పడిందా ఏమిటి? ఇంతలా ఫీలైపోతోంది అని గుసగుసలు పోతున్నారు.