సినీ నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు మారాడు. ఆయన ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. రాజకీయాల గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో అన్నయ్య చిరంజీవికి చేదోడు వాదోడుగా వున్న నాగబాబు, ఆ తర్వాత అన్నయ్యతోపాటే కాంగ్రెస్‌లోకి వెళ్ళాల్సి వచ్చింది. అఫ్కోర్స్, కాంగ్రెస్ నేతగా ఆయనెప్పుడూ మాట్లాడేలనుకోండి.. అది వేరే సంగతి. 'అన్నయ్యతోనే వుంటా.. అది రాజకీయ ప్రయాణమైనాసరే..' అని క్లారిటీ ఇవ్వడంతో, నాగబాబు కూడా కాంగ్రెస్ మనిషేనని అనుకోవాలి.
కానీ, ఇప్పుడు సీన్ మారింది. 2014 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్, బీజేపీ జపం చేసినట్లే.. ఈ మధ్యకాలంలో నాగబాబు కూడా బీజేపీ భజన గట్టిగానే చేస్తున్నారు. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అనే అంశానికి సంబంధించి పవన్, బీజేపీని ప్రశ్నిస్తే.. నాగబాబు, పవన్‌కి మద్దతిచ్చాడు. ఇది వెరైటీనే కదా.! మరోపక్క, 2019 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ నిలబడితే, అన్నయ్య చిరంజీవి మద్దతుగా నిలిస్తే బావుంటుందని నాగబాబు అభిప్రాయపడ్డాడు. దానర్థమేంటి.? పవన్ వెంట, చిరంజీవి నిలబడటం అనేది పవన్ పార్టీలో చిరంజీవి చేరినప్పుడే కదా జరిగేది.!
'నేను, పవన్ కలిసి రాజకీయాల్లో ముందడుగు వేసే ప్రసక్తే లేదు' అని చిరంజీవి మొన్నీమధ్యనే చెప్పారు. కానీ, నాగబాబు నోట అందుకు భిన్నమైన మాటలొస్తున్నాయి. చూస్తోంటే, లేని 'వాక్యూమ్'ని మెగా కాంపౌండ్ క్రియేట్ చేస్తోందనుకోవాలి. దాన్ని ఎలాగూ 'అన్నదమ్ముల అనుబంధం'తో ఫిల్ చేసేస్తారనుకోండి.. అది వేరే విషయం. జనసేన పార్టీలోకి చిరంజీవి వెళ్ళాలంటే పవన్, చిరంజీవిని ఆహ్వానించాలి. అందుకు తగ్గ వాతావరణాన్ని నాగబాబు కల్పిస్తున్నాడన్నమాట.
అంతేనా.? నాగబాబు ద్వారా చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ అవుతాయా.? అసలు, రాజకీయాలపై పవన్‌కళ్యాణ్‌కి వున్న 'చిత్తశుద్ధి' ఎంత.? 2019 ఎన్నికల్లో పవన్ పార్టీ పోటీ చేస్తుందా.? లేదా.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.