రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఎలా కలిసివస్తుందో చెప్పలేం. దశాబ్దాలుగా రాజకీయాల్లో మునిగితేలినా ఒక్క పదవీ దక్కకపోవచ్చు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోవచ్చు. ఈ రెండు రకాల కథలు భారత రాజకీయాల్లో ఉన్నాయి. అలాగే ఎవరికి ఎవరు వారసులు అవుతారో కూడా చెప్పలేం. ఒక ముఖ్యమంత్రికి అతని కొడుకో, కూతురో రాజకీయ వారసులై అదే పదవి చేపట్టవచ్చు. వారిని మూలకు నెట్టి వేరే ఎవరో పీఠం ఎక్కొచ్చు. 'నేనే వారసుడిని/వారసురాలిని. ఆ పదవి నాకే దక్కాలి' అని క్లెయిమ్ చేసుకునేందుకు, డిమాండ్ చేసేందుకు అవకాశంలేదు. అలా చేసినా ఆ కోరిక నెరవేరకపోవచ్చు. బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ అనివార్యంగా పదవి నుంచి దిగపోవల్సివచ్చినప్పుడు గంపెడు కుటుంబానికి వండిపెట్టుకుంటూ వంటింట్లోనే గడిపే తన భార్య రబ్రీ దేవిని ముఖ్యమంత్రిని చేసి పారేశారు.
ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలైనప్పుడు 'ఆ పదవికి నేనే వారసుడిని. నాకే దక్కాలి' అని డిమాండ్ చేసిన కుమారుడు వైఎస్ జగన్‌ను కాంగ్రెసు అధిష్టానం పక్కకు పెట్టేసి రోశయ్యకు బాధ్యత ఇచ్చింది. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి వారసత్వపు కథలున్నాయి.
ఇప్పుడు తమిళనాడులోనూ ఇదే గొడవ. ముఖ్యమంత్రి జయలలిత 75 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది చనిపోయిన తరువాత 'జయ వారసురాలిని నేనే' అంటూ ఆమె మేనకోడలు (అన్న జయకుమార్ కుమార్తె) దీపా జయకుమార్ తెర మీదికి వచ్చింది. జయలలితతో దీర్ఘకాలంగా సంబంధాలు లేని, రాజకీయాలతో సంబంధం లేని, జయ మేనకోడలని కూడా ఎవ్వరికీ తెలియని దీప తానే రాజకీయ వారసురాలినని ఎలా అనుకుందో తెలియదు. ఇందుకు ఆమె తాను అత్త పోలికలను పుణికిపుచ్చుకున్నానని, అచ్చం జయలా ఉంటానని చెప్పింది. దీపా జయకుమార్ జయలలితను గుర్తుకు తెచ్చేలా ఉండటం వాస్తవమే. స్వభావం ఏమిటో తెలియదుగాని శారీరకంగా మాత్రం జయకు చాలా దగ్గరగా ఉంటుంది. జయలలిత ఆస్తులకే కాదు, పదవికీ తానే వ ఆరసురాలినని అంది. ఇలా అనుకోవడం ఆమె అజ్ఞానం. జయకు సొంత కుటుంబం, సంతానం లేదు కాబట్టి ఆస్తులకు తాను వారసురాలినని దీప భావించి ఉండొచ్చు. కాని పదవికి వారసురాలయ్యే అవకాశమే లేదు.
అన్నాడీఎంకే పార్టీలో చేరి కీలక పాత్ర పోషిస్తున్నట్లయితే అలా చెప్పుకున్నా కాస్త అర్థం ఉంటుంది. దశాబ్దాలపాటు దూరంగా ఉండి జయ చనిపోగానే తానే వారసురాలినని అంటే చెల్లుతుందా? వాస్తవానికి ఆస్పత్రిలో జయ ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే ఆమె స్నేహితురాలు శశికళ వారసురాలిగా నిర్ణయమైపోయింది. ఆస్తులు కూడా శశికళకు, ఆమె కుటుంబ సభ్యులకు రాసేసినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. ఆల్రెడీ జయలలిత ఇంటిని శశికళ ఆక్రమించేసింది. ఆమె బెడ్రూము, కారు సహా సమస్తం వాడుకుంటోంది. శశికళను వ్యతిరేకించేవారూ ఉన్నప్పటికీ మెజారిటీ పార్టీ ఆమె వెనక ఉండటంతో ప్రధాన కార్యదర్శి అయిపోయింది. రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో శశికళ వ్యతిరేకులు కొందరు 'దీపా పెరవై' అనే సంఘం ఏర్పాటు చేశారు. నగరంలో పలు చోట్ల దీప, జయలలిత బొమ్మలున్న పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆమెకు జేజేలు కొడుతున్నారు. జయకు నిజమైన వారసురాలు దీపాయే అంటున్నారు.
వీరెంత అరిచి గీపెట్టినా ప్రస్తుతం శశికళ అదృష్టాన్ని తారుమారు చేసే అవకాశమే కనబడటంలేదు. మెజారిటీ నాయకులు, కార్యకర్తలు శశి వెంట ఉన్నప్పుడు దీపను ఎవరు పట్టించుకుంటారు? కాకపోతే ఆమె శశికళకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. గెలిస్తే ఎమ్మెల్యే అవుతుంది కాబట్టి చట్టసభలో, బయటా శశికళపై పోరాటం చేసే అవకాశం ఉంటుంది. దీప తమ్ముడు దీపక్‌ను శశికళ తన వైపుకు తిప్పుకుంది. అంటే అక్కాతమ్ముళ్లను విడదీసింది. జయ అంత్యక్రియల్లో అతను పాల్గొన్నాడు. ఈ విషయమై మీడియా అడిగినప్పుడు దీప 'నో కామెంట్' అని వ్యాఖ్యానించింది. అన్న జయకుమార్ చనిపోయిన తరువాత ఆ కుటుంబంతో జయకు బంధం తెగిపోయింది. ఇందుకు వదిన (దీప తల్లి) కారణమని ఇదివరకు ఓ పత్రిక రాసింది. మొత్తంమీద విభేదాలు రావడానికి ఎవరెంత కారణమో తెలియదు. జయలలిత అనారోగ్యంపై, మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న దీప తెర వెనక జరిగిన కుట్రలన్నీ బయటపెడతానంటోంది. దీప తన అత్త మరణం వెనక కుట్రను ఛేదించగలిగితే పెద్ద సంచలనమే కలుగుతుంది. ముందుగా ఆమె ఆ పని చేస్తే మంచిది.