నేను నా క్యారెక్టర్లు మానను-శ్రీనివాసరెడ్డి

ప్రతి జనరేషన్ లోనూ హీరోల మాదిరిగానే కొందరు కమెడియన్లు కూడా జనాదరణకు నోచుకుంటారు. తమ నటన, మాట విరుపులతో సినిమాల విజయంలో కీలకంగా మారతారు. పటాస్, అ..ఆ, ప్రేమమ్ ఇలాంటి సినిమాలు చూసిన వారికి…

ప్రతి జనరేషన్ లోనూ హీరోల మాదిరిగానే కొందరు కమెడియన్లు కూడా జనాదరణకు నోచుకుంటారు. తమ నటన, మాట విరుపులతో సినిమాల విజయంలో కీలకంగా మారతారు. పటాస్, అ..ఆ, ప్రేమమ్ ఇలాంటి సినిమాలు చూసిన వారికి ఆయా సినిమాల విజయంలో తనకూ ఓ సముచిత పాత్ర వుందీ అనిపించుకున్న కమెడియన్ శ్రీనివాసరెడ్టి గుర్తుకువస్తారు.

గీతాంజలి సినిమాతో కమెడియన్ నుంచి ప్రధానపాత్రకు మారిన ఆయన, ఇప్పుడు తొలిసారి ఫుల్ లెంగ్త్ హీరోగా జయమ్ము నిశ్చయమ్మురా అంటూ తెరమీదకు వస్తున్నారు. ఈ సినిమా వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హీరోగా తొలి సినిమా చేస్తున్న శ్రీనివాసరెడ్డి బర్త్ డే రేపే. ఈ సందర్భంగా ఆయనతో ముఖాముఖి.

ఇప్పుడు శ్రీనివాసరెడ్డిని ఎలా చూడాలి. కమెడియన్ గానా? హీరోగానా?

నేను రెండూ కాదు. క్యారెక్టర్ ఆర్టిస్టుని. మొదట్నించీ నా ఎయిమ్ అదే. నాది హీరో మెటీరియల్ కాదు అని నాకు తెలుసు. అయితే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు కావాలని కోరిక. అందుకే నా కామెడీ వేషాల్లో కూడా ఆ విధమైన టచ్ మీకు కనిపిస్తుంది. దర్శకులు, రచయితల సహకారంతో ఇది సాధ్యమైంది.

మరి ఇప్పుడు మెయిన్ లీడ్ లోకి వచ్చారుగా?

నాకు మొదట్నించీ కథలు వినడం ఇష్టం అండీ. నాకు చాలా మంది కొత్తవాళ్లు కథలు చెబుతుండేవారు. నాకు పరిచయం వున్న హీరోలకు చెబుతా అని. అలాంటి వాటిలో ఒకటి నాకు సూట్ అవతుందని వాళ్లు చెప్పడం, నేను నమ్మడంతో గీతాంజలి చేసా. ఆ తరువాత మళ్లీ వంద కథల వరకు విన్నా. కానీ ఏదీ నాకు సూట్ అవుతుందన్నది లేదు. వేరే వేరే హీరోలకు రికమెండ్ చేసినవే. కానీ జయమ్ము నిశ్చయమ్మురా కథ విన్నాక, ఇది నాకు పక్కాగా సూట్ అవుతుంది అనిపించింది. అందుకే చేస్తున్నాను. అంతే.

శ్రీనివాసరెడ్డి అంటే చలాకీ డైలాగులకు చిరునామా. కానీ ఈ సినిమా ట్రయిలర్ చూస్తుంటే, మరీ ఇన్నోసెంట్ వ్యవహారం అన్నట్లుగా వుంది.

ఫర్ ఏ ఛేంజ్ అండీ. ప్రేక్షకులు ఇలా కూడా నన్ను చూస్తారు. ఆదరిస్తారు అన్న నమ్మకం. నాకే కాదు, ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకులు అందరికీ కూడా అదే నమ్మకం కలిగింది. నువ్వు కనిపించలేదు. క్యారెక్టరే కనిపించింది అన్నారు వాళ్లంతా.

అంత గొప్ప ఏమిటి సినిమాలో?

మనం భాగ్యరాజా, జంధ్యాల స్టయిల్ సినిమాలు చూసాం అండీ. ఇటీవల అలాంటివి రావడం లేదు. ఇదీ అలాంటిదే. 

జనరేషన్ మారుతోంది. అభిరుచులు మారుతున్నాయి. లౌడ్, మాస్ కామెడీ అలరిస్తున్న జనాలు, ఇప్పుడు అంత క్లాస్ కామెడీ చూస్తారంటారా?

మీరన్న లౌడ్, మాస్ కామెడీ అన్నది ఓ క్యారెక్టర్ పరంగా సినిమాల్లో ఓకె. కానీ అదే రెండున్నర గంటలు చూపిస్తాం అంటే జేబులోంచి ఫోన్ బయటకు తీసి, వాట్సప్, ఫేస్ బుక్ చూసుకుంటారు. అందువల్ల పూర్తి కామెడీ చిత్రం అన్నపుడు అందులో విషయం వండాలి. హడావుడి కాదు అని నా అభిప్రాయం.

కమెడియన్లు హీరోలుగా సక్సెస్ కావడం తక్కువ టాలీవుడ్ లో? ఆ భయం ఏమీ వెంటాడడం లేదా మిమ్మల్ని?

ఇక్కడ సమస్య ఏమిటంటే, తొలిసినిమాకు మూడు రోజులు విన్నాను కథను. ఇది హిట్ అయిందంటే, నా దగ్గరకి చాలా మంది వస్తారు. చాలా కథలు వస్తాయి. వాటిని కూడా ఇంత కేర్ ఫుల్ గా వినాలి. ఎంచుకోవాలి. సాధారణంగా ఎక్కువ మంది తేడా చేసేది అక్కడే. అందుకే నేను మా ఇంట్లో వాళ్లకి కూడా చెప్పాను. ఎందుకంటే వాళ్లకు కూడా నేను విన్న కథ చెబుతాను కాబట్టి. నిర్మొహమాటంగా చెప్పేయమని. 

అంటే హీరోగా ముందుకు సాగాలని డిసైడ్ అయిపోయారన్నమాట.

అలా అని నేను ఎక్కడా అనలేదండీ. అలా అనుకుంటారేమో అని, ముందే రెండు సినిమాలు ఓకె చేసి పెట్టుకున్నా. త్రివిక్రమ్ గారి డైరక్షన్ లో ఒకటి. భలే మంచి రోజు ప్రొడ్యూసర్ల సినిమా మరొటి. నేను మీకు అని కాదు, ఇండస్ట్రీకి అని కాదు, నన్ను ఇంతవాడిని చేసిన డైరక్టర్లకు కూడా చెప్పేది ఒకటే. నేను నా క్యారెక్టర్లు మానను. అవి చేస్తూనే వుంటాను. ఎక్కడన్నా నాకు సరిపోయే మంచి కథ వస్తే మాత్రం చేస్తాను. 

ఇండస్ట్రీ బై మిస్టేక్ శ్రీనివాస రెడ్డి హీరో అయిపోయాడు అని ఫిక్సయిపోతే..

ఆ ప్రమాదం వుందనే ఇంత క్లారిటీగా చెబుతున్నా అండీ. ఇప్పటికే నన్ను ఇంతవాడిని చేసిన డైరక్టర్లు అందరికీ చెప్పుకువచ్చా. చెప్పడం కాదు. రిక్వెస్ట్ చేసా. నేను నా క్యారెక్టర్లు మానను అని. 

హీరోయిన్ గా పూర్ణను తీసుకున్నారు? సినిమాకు ప్లస్ అవుతుందా?

తెలుగుదనం వున్న హీరోయిన్ కావాలి. ఎవరున్నారు? అంజలి చేసేసాను. ఇక స్వాతి లేదా పూర్ణ. అందుకే ఆమెను తీసుకున్నాం. చూసిన వాళ్లు, మా జోడీ చాలా బాగుంది అంటున్నారు.

హీరోగా రెండు సినిమాలు కొత్త డైరక్టర్లతోనే చేసారు?

వాళ్లు తెచ్చిన కథలు నచ్చాయి..చెప్పిన విధానం వాళ్లపై నమ్మకం కలిగించింది అంతే. జయమ్మ నిశ్చయమ్మురా డైరక్టర్ కు సినిమా అంటే చాలా ఫ్యాషన్ అండీ. నేను కూడా చాలా కేర్ తీసుకున్నాను. నాలుగు వెర్షన్లు డబ్బింగ్ చెప్పాను. 

అయితే సినిమా మీద ఏ టెన్షన్ లేదంటారు

వుందండీ..అయిదు వందలు, వెయ్యి రూపాయిల నోట్ల రద్దు టెన్షన్ వుంది. జనం థియేటర్లకు రావడం తగ్గింది కదా? 25 వేళకు ఎలా వుంటుందా అని?

ఆ రోజుకు జనం దగ్గరకు డబ్బులు వచ్చేస్తాయి లెండి.

అలాగంటారా? మంచి మాట అన్నారండీ బాబూ.

అడ్వాన్స్ గా పుట్టిన రోజుకు, సినిమా విడుదలకు గ్రీటింగ్స్

థాంక్సండీ

విఎస్ఎన్ మూర్తి.