యనమలవారి కళ్ళతో.. బంద్‌ సూపర్‌ ఫ్లాప్‌.!

పచ్చకామెర్లు వున్నోడికి లోకమంతా పచ్చగా (ఆకుపచ్చగా సుభిక్షంగా అనుకునేరు.. దుర్భిక్షంగా) కనిపిస్తుందోలేదోగానీ, టీడీపీ నేతలకు మాత్రం తప్పు ఒప్పులా, ఒప్పు తప్పులా.. హిట్టు ఫ్లాపులా.. ఫ్లాపు హిట్టులా కనిపిస్తుంటుంది. వాళ్ళకు ఏం కనిపించినా, కనిపించకపోయినా,…

పచ్చకామెర్లు వున్నోడికి లోకమంతా పచ్చగా (ఆకుపచ్చగా సుభిక్షంగా అనుకునేరు.. దుర్భిక్షంగా) కనిపిస్తుందోలేదోగానీ, టీడీపీ నేతలకు మాత్రం తప్పు ఒప్పులా, ఒప్పు తప్పులా.. హిట్టు ఫ్లాపులా.. ఫ్లాపు హిట్టులా కనిపిస్తుంటుంది. వాళ్ళకు ఏం కనిపించినా, కనిపించకపోయినా, చంద్రబాబు కళ్ళతోనే వాళ్ళు చూస్తారు అదంతే. అదిగదిగో పంది.. అని చంద్రబాబు కుక్కని చూపించి చెబితే, 'జీ హుజూర్‌..' అని టీడీపీ నేతలంతా కుక్కని పంది అనే అంటారు. దటీజ్‌ టీడీపీ. లేదంటే, పదవులు ఊడిపోతాయ్‌.! 

చంద్రబాబు చెప్పారు కాబట్టి ప్రత్యేక హోదా అనవసరం.. చంద్రబాబు అడుగుతున్నారు కాబట్టి ప్రత్యేక హోదా అవసరం. ఏంటిది.? నిలకడలేని మనషులు.. అసలు వీళ్ళని మనషులు అనొచ్చా.? అన్న అనుమానం కలుగుతుంటుంది ఒక్కోసారి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర బంద్‌ చేపట్టింది వైఎస్సార్సీపీ. శ్రీకాకుళం నుంచి చిత్తూరుదాకా మొత్తం 13 జిల్లాలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. 

కానీ, టీడీపీ నేతలకు మాత్రం బంద్‌ సూపర్‌ ఫ్లాప్‌ అయ్యింది. మంత్రి యనమల రామకృష్ణుడు తనకన్నా ఇంకెవరైనా సరే ముందుగా 'ఫ్లాప్‌' అనేస్తారేమోనని తెగ తొందరపడిపోయారు. కళ్ళు లేని కబోదుల్ని చూశాం.. కళ్ళుండీ కబోదుల్లా వ్యవహరిస్తే ఏమనగలం.? అక్కడ హిట్‌, ఫ్లాప్‌ అన్నది ఆలోచించే సందర్భమే కాదిది. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షతోనే బంద్‌ జరిగింది. బంద్‌ ఫ్లాప్‌ అవడమంటే ప్రత్యేక హోదా డిమాండ్‌ ఫ్లాప్‌ అయినట్లే. 

లాజిక్‌ ప్రకారం చూస్తే ప్రత్యేక హోదా బంద్‌ ఫ్లాప్‌ అవ్వాలని టీడీపీ నేతలు నానా తంటాలూ పడి వుండాలి. పార్లమెంటులో మాత్రం, టీడీపీ నేతలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసెయ్యాలి. వెకిలి కామెడీకే పరాకాష్ట ఇది. వైఎస్సార్సీపీ ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి వెళితే, బీజేపీకి భయపడి.. తాము ఉన్న చోట నిలబడి నినాదాలతో 'మమ' అనిపించేశారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి ఈ స్థాయిలో నష్టం జరిగింది, జరుగుతోందంటే దానికి నూటికి నూరుపాళ్ళూ బాధ్యత వహించాల్సింది చంద్రబాబే. ప్రత్యేక హోదా వస్తుందనుకున్న సమయంలో చంద్రబాబు ఈ స్థాయిలో కుయుక్తులు పన్నుతోంటే, ఆయనలో ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి వుందని ఎలా అనుకోగలం.? అయ్యవారికీ దండం పెట్టు.. అన్న చందాన, చంద్రబాబు చెప్పింది మాట్లాడటం తప్ప తమంతట తాము ఆలోచించలేని స్థితి యనమల రామకృష్ణుడు లాంటి సోకాల్డ్‌ లీడర్స్‌ది. ఔన్లెండి, ప్రజా బలంతో ఎన్నికల్లో గెలిస్తే ఆ ప్రజలేమనుకుంటున్నారో, వారి ఆలోచనలెలా వుంటాయో అర్థమవుతుంది.