ఢిల్లీ టెస్ట్ లోనూ ‘సఫా’రీ సేమ్‌ సీన్‌.!

స్పిన్‌.. స్పిన్‌.. స్పిన్‌.. అన్నీ స్పిన్‌ పిచ్‌లేనా.? అక్కడ తిప్పేస్తే అది గొప్పెలా అవుతుంది.? అంటూ సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా వరుస విజయాలపై పెదవి విరిచిన వారెందరో. అందులో ఎంతో కొంత…

స్పిన్‌.. స్పిన్‌.. స్పిన్‌.. అన్నీ స్పిన్‌ పిచ్‌లేనా.? అక్కడ తిప్పేస్తే అది గొప్పెలా అవుతుంది.? అంటూ సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా వరుస విజయాలపై పెదవి విరిచిన వారెందరో. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. అలాగని సొంతగడ్డపై మనోళ్ళ టాలెంట్‌నీ తప్పు పట్టడానికి వీల్లేదు. నాగ్‌పూర్‌ పిచ్‌ విషయంలో అయితే ఐసీసీకి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. ఆ సంగతెలా వున్నా, ఢిల్లీ టెస్ట్‌లోనూ సౌతాఫ్రికా సేమ్‌ తడబాటు కొనసాగిస్తోంది. 

ఇప్పటికే సిరీస్‌ టీమిండియా కైవసం కాగా, 3-0 తేడాతో సౌతాఫ్రికాని మట్టికరిపించాలని తహతహలాడుతోంది కోహ్లీ సేన. ఈ క్రమంలోనే ఢిల్లీ టెస్ట్‌లో పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా రెహానే సెంచరీ పుణ్యమా అని 334 పరుగులు చేయగలిగింది. రహానే సెంచరీకి అశ్విన్‌ అర్థ సెంచరీ తోడవడంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోర్‌ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన సౌతాఫ్రికా కేవలం 121 పరుగలకే ఆలౌట్‌ అయ్యింది. 

ఈ సిరీస్‌లో అదరగొడ్తున్న అశ్విన్‌ కాస్త నెమ్మదిస్తే, జడేజా మరోమారు సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ని ముప్పుతిప్పలు పెట్టాడు. జడేజా ఐదు వికెట్లు తీస్తే, అశ్విన్‌ 2 వికెట్లు తీశాడు. ఫాస్ట్‌ బౌలర్లూ 3 వికెట్లు తీయడం గమనార్హం. ఉమేష్‌ యాదవ్‌ రెండు వికెట్లు, ఇషాంత్‌ శర్మ ఓ వికెట్‌ తీసుకున్నాడు. డివిలియర్స్‌ (42) ఒక్కడే కాస్సేపు భారత బౌలర్లను ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. 

పిచ్‌ మరీ స్పిన్‌కి అనుకూలించెయ్యలేదు.. ఫాస్ట్‌ బౌలర్లకూ కాస్తో కూస్తో అనుకూలించింది. బ్యాటింగ్‌కి సైతం అనుకూలించినా సఫారీ బ్యాట్స్‌మెన్‌ సద్వినియోగం చేసుకోలేకపోయారు.