ఎమ్బీయస్‌: మృచ్ఛకటికమ్‌- 2

మృచ్ఛకటికం అంటే చిన్న సైజు మట్టి బండి గురించినది అని అర్థం. మృత్‌ (మట్టి) ప్లస్‌ శకటికా (శకటం అంటే బండి, శకటికా అంటే చిరుబండి) మృచ్ఛకటికా అవుతుంది. దానికి సంబంధించినది మృచ్ఛకటికం. అన్నిటినీ…

మృచ్ఛకటికం అంటే చిన్న సైజు మట్టి బండి గురించినది అని అర్థం. మృత్‌ (మట్టి) ప్లస్‌ శకటికా (శకటం అంటే బండి, శకటికా అంటే చిరుబండి) మృచ్ఛకటికా అవుతుంది. దానికి సంబంధించినది మృచ్ఛకటికం. అన్నిటినీ నాటకం అని జనరల్‌గా అనేస్తాం కానీ కరక్టుగా చెప్పాలంటే దీన్ని ప్రకరణం అనాలి. రూపకాలు పది రకాలు. ఈ ప్రకరణానికి కొన్ని లక్షణాలు వుండాలి అని నిర్దేశించారు. ఇతవృత్తం యీ లోకానికి సంబంధించినది, కల్పితమూ అయి వుండాలి, మంత్రి, విప్రుడు లేదా వైశ్యుడు నాయకుడిగా వుండాలి. ఇబ్బందులు పడుతూ వుండాలి. నాయిక కులస్త్రీ కానీ వేశ్య కానీ కావాలి. దీనిలో యిద్దరూ నాయికలుగా వున్నారు. సంప్రదాయానికి విరుద్ధంగా వారిద్దరూ కలుసుకున్నట్లు కూడా చూపించారు. దీన్ని రాసిన శూద్రకుడు ఎవరు, ఎప్పటివాడు అనే అంశంపై స్పష్టత లేదు. క్రీ.శ. 2 వ శతాబ్దంలో ఆంధ్ర శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడు మారుపేరుతో రచించాడని కొందరంటారు. నాటకకాలానికి బౌద్ధం యింకా నిలిచి వుంది. బౌద్ధసన్యాసులను ప్రజలు గౌరవిస్తున్నారు. సంస్కృత నాటకాలన్నిటిలో లాగానే దీనిలో కూడా ప్రధాన పాత్రలు సంస్కృతంలో, సేవక పాత్రలు ప్రాకృతంలోను మాట్లాడతాయి. ప్రాకృతంలో అనేక మాండలికాలు వుంటాయి. ఈ నాటకంలో శౌరసేని, మాగధి, ప్రాచ్య, అవంతి, శాకారి, టక్కీ, చాండాలి అనే మాండలికాలు వాడాడు రచయిత. ఈ భిన్నత్వం వలన ఒక సౌందర్యం వచ్చి చేరిందని అంటారు భాషాపండితులు. మన దృష్టి కథ మీద, పాత్రల స్వభావాలమీద, సమాజస్వభావం మీద కాబట్టి వాటి గురించే మాట్లాడుకుందాం.

తక్కిన నాటకాల్లోలాగానే యీ నాటకం ఆరంభంలో కూడా సూత్రధారి వచ్చి ముఖ్యపాత్రల గురించి, మొదటి సన్నివేశంలో వచ్చే పాత్రల గురించి ప్రేక్షకులకు వివరించాడు. ఆ తర్వాత మొదటి అంకం ప్రారంభమైంది. చారుదత్తుడి వద్ద ఆశ్రయం పొందుతున్న మైత్రేయుడు ప్రవేశించాడు. చారుదత్తుడు యిప్పుడు దరిద్రుడై పోయాడు కాబట్టి అతను బ్రాహ్మణార్థాలకు వెళ్లవలసి వస్తోంది. అవేళ అలా వెళ్లినపుడు చూర్ణవృద్ధుడనే పెద్దాయన కలిసి చారుదత్తుడికి నా కానుకా యియ్యి అంటూ జాజిపూల అత్తరు పూసిన ఉత్తరీయాన్ని యితని చేతికి యిచ్చాడు. అది తీసుకుని చారుదత్తుడు తన లేమిని తలచుకుని బాధపడ్డాడు. 'ఒకప్పుడు నా యింటి ముంగిట్లో భూతబలికోసం వేసే అన్నాన్ని హంసలు వచ్చి తినేవి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేక ఏవో పిచ్చి గింజలు ఓ దోసెడు చల్లుతున్నాను. కీటకాలు వచ్చి వాటిని సగం సగం కొరుకుతున్నాయి.' అని వాపోయాడు. అంటూనే 'సంధ్యాసమయం అవుతోంది కాబట్టి భూతబలిగా చేసిన అన్నాన్ని మన యింటి ముందున్న నాలుగుదారుల కూడలిలో వేసిరా' అని మైత్రేయుణ్ని కోరాడు. 'నేను వెళ్లను, అది రాచబాట. యీ సమయంలో వేశ్యలు, విటులు, రాజపురుషులు అందరూ తిరుగుతూంటారు.' అని అతను మొండికేశాడు. 'సరే, నువ్విక్కడే వుండు. సాయంసంధ్యాజపం పూర్తి చేసుకుని నేనే వెళతానులే' అన్నాడు చారుదత్తుడు. 

ఇంతలో సీను చారుదత్తుడి యింటిముందున్న రాచవీధిలోకి మారింది. వసంతసేన ఆ వీధిలో వెళుతూంటే ఆమెను శకారుడు, అతని సహచరుడైన విటుడు వెంటాడుతున్నారు. ఆమె భయంతో తప్పించుకుందామని చూస్తోంది. శకారుడి భాషలో సరిపోని ఉపమానాలు, అపార్ధాలు, లోకపద్ధతికి విరుద్ధాలూ వుంటాయి. పైగా 'స' అనే చోట 'శ' అని పలుకుతాడు. 'వసంతసేనా, రావణుడికి కుంతీదేవిలా నువ్వు నాకు వశం కాక తప్పదు. రాముడికి భయపడ్డ ద్రౌపదిలా పారిపోతున్నావేమిటి?' అంటున్నాడు. విటుడు 'అక్కా, పారిపోకు, మా బావ శకారుడు అడవి కోడిపుంజులా పరుగుపరుగున వస్తున్నాడు' అంటూ సతాయిస్తున్నాడు. వీళ్ల ధాటికి వసంతసేన పరిచారికలు కూడా పారిపోయారు. చివరకు శకారుడు వసంతసేన జుట్టు దొరకబుచ్చుకుని కత్తితో నరుకుతాను జాగ్రత్త అని బెదిరించాడు. 'నా నగలకోసమా?' అని వసంతసేన అడిగితే 'అబ్బే నీ కోసమే, నా మన్మథబాధ తీర్చు' అన్నాడు శకారుడు.  విటుడు ఆమెకు గుర్తు చేశాడు – 'నువ్వు వేశ్యవు. నీ శరీరం డబ్బులు పారేసి కొనుక్కునే అంగడి వస్తువు.' అని. 'ప్రేమ పుట్టేది గుణం చేత తప్ప బలాత్కారం చేత కాదు, ఇలా బెదిరిస్తే అనురాగం పుడుతుందా?' అని అడిగింది వసంతసేన. శకారుడు కుండబద్దలు కొట్టేశాడు – 'బావా, యీ వేశ్య మదనుడి కోవెల తోటలో జరిగిన మదనోత్సవంనాడు చారుదత్తుణ్ని చూసి మోహించింది. అందుకే నన్ను యిష్టపడటం లేదు. ఆ దరిద్రుడి యిల్లు యిదిగో యీ ఎడమవైపే వుంది.   ఈ చీకట్లో మననుంచి తప్పించుకుని యిది అక్కడ దూరుతుందేమో జాగ్రత్త సుమా' అని విటుడికి హెచ్చరిక చెప్పాడు. 

'అమ్మయ్య, అనుకోకుండా శకారుడు నాకు సరైన చోటే చూపించాడే' అనుకుని వసంతసేన చారుదత్తుడి యింటి ముంగిటికి వెళ్లింది. 'మినుముల రాసిలో నల్లపూసలా చీకట్లో యీమె మాయమైందే' అని శకారుడు వాపోయాడు. అతని సహచరుడైనా విటుడికి వసంతసేనపై జాలి కలిగింది. 'మరి ఆమెను ఎలా కనిపెట్టగలవ్‌?' అని శకారుణ్ని అడిగాడు. 'తను వేసుకున్న ఆభరణాల చప్పుడు ద్వారా, తను జడలో ధరించిన పూలదండ పరిమళం ద్వారా కనుక్కోగలను' అన్నాడు శకారుడు. ఆ మాటల్ని విటుడి వసంతసేనను బెదిరించినట్లుగా 'చూశావా, వీటి సాయంతో నిన్ను పట్టుకోగలం' అంటూ హెచ్చరించాడు. ఆమె ఆ సూచన గ్రహించి తన నగలను, పూలమాలను తీసేసి యింట్లోకి వెళ్లడానికి పక్క గుమ్మం వెతుకుతోంది. ఇంతట్లో చారుదత్తుడు పూజ ముగించి భూతబలిని తీసుకెళ్లమని మైత్రేయుణ్ని మళ్లీ అడిగాడు. పరిచారిక రదనిక తోడుగా వస్తే వెళతాన్నాడతను. 'నువ్వు దీపం పట్టుకో, నేను తలుపు తీస్తా' అన్నాడు. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015)

[email protected]

Click Here For Archives